Nitya Menen
-
ఆ అవార్డుకు రిషబ్ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన రిషబ్ శెట్టి, ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన నిత్యామీనన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు‘నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికి నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.అవార్డు బాధ్యత పెంచింది : చందూ మెండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సంగతి తెలిసిందే. -
హిట్‌టాక్‌తో దూసుకుపోతున్న ధనుష్ చిత్రం.. ఫ్యాన్స్‌కు పండగే
ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తిరుచిట్రంపళం. హీరోయిన్లుగా నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్ నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం, ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్ ఆర్.జవహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. సుమారు 16 నెలల తరువాత థియేటర్లో ధనుష్ చిత్రం విడుదలైంది. ఇంతకుముందు ఈయన నటించిన రెండు చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కావడంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. కాగా ఈ తిరుచిట్రంపళం చిత్రం ఎలా ఉందంటే ధనుష్ అభిమానులు పండుగ చేసుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నాలుగు పాత్రల మధ్య జరిగే ఈ చిత్ర కథలో ధనుష్, నిత్యామీనన్, దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్ పోటీపడి నటించారు. కుటుంబం, ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో అందంగా తెరకెక్కించారు. చిత్రంలో భారతీరాజా కొడుకుగా ప్రకాష్‌రాజ్, ఆయన కొడుకుగా ధనుష్, పక్కింటి అమ్మాయిగా నిత్యామీనన్ నటించారు. ఇక ధనుష్ ప్రేమించే పాత్రల్లో నటి రాశిఖన్నా, ప్రియ భవాని శంకర్ నటించారు. ఎన్నో ఆసక్తికరమైన కథనంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనిరుథ్ సంగీతం చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ధనుష్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. -
ప్రభాస్ ఇష్యూ ఇంకా బాధపెడుతోంది.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్
‘అలా మొదలైంది’చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ నిత్యామీనన్.. తనదైన నటనతో అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరరైంది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా.. సింగర్‌గా కూడా రాణిస్తుంది. పాత్ర నచ్చితే చాలు.. నిడివి ఎంత ఉంటుందనేది పట్టించుకోకుండా నటిస్తుంది ఈ భామ. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తోంది. అలాగే డైరెక్టర్ విశ్వక్ తెరకెక్కించిన స్కైలాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిసెంబర్ 4న విడుదలైన ఈ చిత్రం మంచి స్పందన వచ్చింది. ఈ మూవీతో నిత్యామీనన్ నిర్మాతగా కూడా మారింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నిత్యా.. గతంలో చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ ఇష్యూ గురించి మాట్లాడూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు సినిమాలు పెద్దగా చూడలేదు. నాను తెలుగు సరిగా వచ్చేది కాదు. అందుకే టాలీవుడ్ సినిమాలు చూసేదాన్నికాదు. అదే సమయంలో నన్ను ప్రభాస్ గురించి అడిగారు…నాకు తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. జర్నలిస్టులు నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. ఆ ఇష్యూతో నిజాయితీగా అన్ని చోట్ల ఉండకూడదని,ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని అర్థమైంది. ప్రభాస్ ఇష్యూ నన్ను ఇప్పటికి బాధ పెడుతుంది’అని నిత్యా చెప్పుకొచ్చింది. -
‘స్కైలాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : స్కైలాబ్ నటీనటులు : సత్యదేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు నిర్మాణ సంస్థ: బైట్ ప్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ నిర్మాతలు : పృథ్వీ పిన్నమరాజు, నిత్యా మేనన్ దర్శకత్వం: విశ్వక్ ఖండేరావు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ : ఆదిత్య జవ్వాది ఎడిటింగ్: రవితేజ గిరిజాల విడుదల తేది : డిసెంబర్ 4, 2021 విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు సత్యదేవ్. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘స్కైలాబ్’.నిత్యామీనన్ హీరోయిన్. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించాడు. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై సినిమాపై ఆసక్తి పెంచింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ని కూడా భారీగా చేయడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శనివారం(డిసెంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్కైలాబ్’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘స్కైలాబ్’ కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1979 నాటికాలంలో సాగుతుంది. కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి గ్రామానికి చెందిన గౌరి(నిత్యామీనన్).. జమీందార్ కూతురైనప్పటికీ జర్నలిజంలో తనేంటో నిరూపించుకోవాలనుకుని హైదరాబాద్‌లో ప్రతిబింబం పత్రికలో చేరుతుంది. ఎప్పటికైనా తన పేరుతో వార్త అచ్చువేయించుకుంటానని తండ్రితో సవాల్ చేస్తుంది. అయితే తన రాతల వల్ల పత్రికకు ఇబ్బందులు తప్ప లాభమేమిలేదని పత్రిక ఎడిటర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేస్తాడు. రైటర్‌గా తనను తాను నిరూపించుకోవడానికి మంచి స్టోరీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది గౌరి. అదే గ్రామానికి చెందిన డాక్టర్ ఆనంద్(సత్యదేశ్) సస్పెండై సొంతూరికి వచ్చి క్లినిక్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం ఎక్కువ. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తాడు. వీరితో పాటు అదేగ్రామానికి చెందిన సుబేదార్ రామారావు(రాహుల్ రామకృష్ణ) కుటుంబం చేసిన అప్పులు తీర్చడానికి నానా తంటాలు పడుతుంటాడు. వివాదంలో ఉన్న తాత భూమి అమ్మితే చాలు.. అప్పులన్ని తీర్చి హాయిగా బతకొచ్చని భావిస్తాడు. ఇలా వేరు వేరు సమస్యలో సతమతమవుతున్న ఈ ముగ్గురు.. ఒక బ్రేక్ కోసం ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో. అమెరికా అంతరిక్ష ప్రయోగశాల నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వస్తాయి. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందనే పుకార్లు వస్తాయి. ఆ సమమంలో గ్రామ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? స్కైలాబ్ నిజంగానే బండలింగంపల్లి గ్రామంలో పడిందా? ఈ సంఘటన కారణంగా గౌరి, డాక్టర్ ఆనంద్, సుభేదార్ జీవితాల్లో ఎలాంటి మలుపులు వచ్చాయి? అనేదే ‘స్కైలాబ్’మిగతా కథ. ఎవరెలా చేశారంటే... జర్నలిస్ట్ గౌరిగా నిత్య అద్భుతంగా నటించారు. హీరోయిన్లా కాకుండా.. గౌరి అనే పాత్రగా మాత్రమే తెరపై కనిపిస్తారు. ఆమె వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అయింది. ఇక సత్యదేశ్, రాహుల్ రామకృష్ణ నటనకు వంక పెట్టాల్సిన అవసరంలేదు. నటులుగా వారు ఎప్పుడో నిరూపించుకున్నారు. డాక్టర్ ఆనంద్‌గా సత్యదేవ్, సుబేదార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆనంద్ తాతయ్య పాత్రలో తనికెళ్ల భరణి, గౌరి తల్లి పాత్రలో తులసి మరోసారి తమ అనుభవాన్ని చూపించారు. ఇక గౌరి ఇంట్లో పనిచేసే శ్రీను పాత్రలో కొత్త కుర్రాడు విష్ణు బాగా నటించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే.. ? 1979లో సాగే పీరియాడికల్ మూవీ ఇది. అప్పట్లో స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు రావడంతో అసలేం జరగబోతుందోనని అందరూ ఎదురుచూశారు. ఆ సమయంలో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లిలో ఉండే గౌరి, ఆనంద్, రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్ ఖండేరావు. తొలిసారే ఇలాంటి సరికొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకున్న దర్శకుడి ప్రయత్నాన్ని ప్రశంసించాల్సిందే. అయితే అనుకున్న పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు తెరపై చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. కథ బాగున్నప్పటికీ.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో అయితే కథ ఎప్పటికీ ముందుకుసాగదు. కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. ఇక సెకండాఫ్‌లో అయినా కథలో వేగం పెరుగుతుందనుకుంటే.. అక్కడ కూడా అంతే. స్లోగా సాగుతూ.. బోర్ కొట్టిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్స్, సంభాషణలు బాగున్నాయి. అలాగే అంతర్లీనంగా అప్పట్లో మనషుల మధ్య ఉన్న వివక్షను చూపించే ప్రయత్నం బాగుంది. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బాగుంది. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా సందర్భానుసారం వస్తాయి. రీ రికార్టింగ్ కూడా ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫికీ అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. 1979నాటి పల్లె వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మెచ్చుకోవాలి. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు బాగా పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ‘స్కైలాబ్’ప్రయోగం విఫలమైనా.. ప్రయత్నం మాత్రం బాగుంది. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ కథ విని హీరోయిన్ శ్రియ ఏడ్చేసింది: సృజనా రావు
‘‘జీవిత ప్రయాణం గురించి చెప్పడమే ‘గమనం’ చిత్రం ఉద్దేశం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్ సర్కిల్‌ను చూపించాలనుకున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ఓ ప్రయాణం ఉంటుంది’’ అని డైరెక్టర్ సృజనా రావు అన్నారు. శ్రియ, శివ కందుకూరి, నిత్యా మీనన్, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గమనం’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్న సృజనా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉందని ముందు మా ఇంట్లో చెప్పలేదు. తర్వాత నేను తీసిన డాక్యుమెంటరీని మా నాన్నగారికి చూపించాను. ‘నేనైతే హెల్ప్ చేయను కానీ నువ్వే కష్టపడి ప్రూవ్ చేసుకోవాలి’ అని నాన్న అన్నారు. ఆ తర్వాత సపోర్ట్ చేశారు. చిన్నప్పుడు మా నాన్నతో పాటు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సెట్లో ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేది దర్శకుడే అని గ్రహించాను. అప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలన్నీ ‘గమనం’లో ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నటీనటులను అనుకుని రాయలేదు. శ్రియకి కథ చెప్పగానే ఏడ్చేసి, నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఇందులో శ్రియ చాలా కొత్తగా కనిపిస్తారు. నిత్యా మీనన్, చారు హాసన్ బాగా చేశారు. ‘గమనం’ కథ నిర్మాత జ్ఞానశేఖర్‌గారికి బాగా నచ్చింది. ఇళయరాజాగారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ‘నన్నే సంగీతదర్శకుడిగా ఎందుకు అనుకుంటున్నావు?’ అని అడిగారు. కథ చెప్పడం ప్రారంభించాక సగంలోనే ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా సినిమా చేసినందుకు రచయిత సాయి మాధవ్ బుర్రాకి థ్యాంక్స్. ‘గమనం’ విడుదల కోసం ఎంతో ఎగై్జటింగ్‌గా ఉన్నాను. నా తర్వాతి చిత్రం కోసం ఓ కథ సిద్ధం చేశా’’ అన్నారు. -
ముగ్గురు భామలతో ధనుష్ రొమాన్స్!
తమిళ సినిమా: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ధనుష్.. తాజాగా మరో చిత్రాన్ని ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ సంస్థలో కథానాయుడికిగా నటించేందుకు ధనుష్ సిద్ధం అవుతున్నా రు. జవహర్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధనుష్‌కు జంటగా రాశీఖన్నా, ప్రియ భవాని శంకర్, నిత్యామీనన్ నటిస్తున్నారు. దర్శకుడు భారతీరాజా, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చెన్నైలో గురువారం షూటింగ్ పూజా కార్యక్రమం ప్రారంభమైంది. -
దుస్తులు వేలం వేసిన నిత్యామీనన్
చెన్నై : కరోనా మహమ్మారి మానవాళిని అతలాకుతలం చేస్తోంది.ముఖ్యంగా పేదల జీవితాలు దయనీయంగా మారాయి. అలాంటి వారిని ఆదుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. నటి నిత్యామీనన్ నేను సైతం అంటూ సిద్ధమయ్యారు. తన దుస్తులను వేలం వేసి తద్వారా వచ్చిన డబ్బును కరోనా బాధితులకు అందించాలని నిర్ణయించుకున్నారు. దీని గురించి నిత్యామీనన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ఇటీవల ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్నానని చెప్పింది. తాను ధరించిన దుస్తులను తన స్నేహతురాలు, డిజైనర్ కరోని ప్రత్యేకంగా తయారు చేసిందని చెప్పింది. కాగా ప్రస్తుతం కరోనా మహమ్మారి పేదల జీవితాలను చిధ్రంగా మార్చేసిందని..అలాంటి వారు మళ్లీ నిలదొక్కుకోవడానికి సాయం చేయాలని భావించినట్లు పేర్కొంది. దీంతో తాను ఫ్యాషన్ షోలో ధరించిన దుస్తులతో పాటు సినిమాలో ధరించిన ఖరీదైన దుస్తులను వేలం వేయాలని నిర్ణించానని పేర్కొంది. తద్వారా వచ్చిన డబ్బును నూరు శాతం అర్పణం ట్రస్టుకు చేరుతుందని చెప్పింది. ఆ ట్రస్ట్ పేద కుటుంబాలకు సాయం చేస్తుందని నిత్యామీనన్ చేప్పింది. -
కథలు వండుతున్నారు
లాక్ డౌన్ సమయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు స్టార్స్. ఒకరు గరిటె పట్టుకుని వంట గదిలోకి అడుగుపెడితే, మరొకరు యోగా మ్యాట్ మీద ధ్యానంపై దృష్టి పెడుతున్నారు. నిత్యా మీనన్ తనలో ఉన్న కథకురాలిని బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారట. కథలు వండే పని మీద ఉన్నారు. ఈ విషయం గురించి నిత్యా మీనన్ మాట్లాడుతూ –‘‘లాక్ డౌన్ వల్ల పరిసరాలు ఎంతో ప్రశాంతంగా మారిపోయాయి. ఈ ప్రశాంతతని ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే కొన్ని కథలు సిద్ధం చేస్తున్నాను. కొంత కాలంగా నా మైండ్‌లో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యాక్టర్‌గా బిజీగా ఉండటంతో కథలు డెవలప్ చేయలేకపోయాను. వాటిని అభివృద్ధి చేయడానికి ఇది బెస్ట్ టైమ్. వీటితో పాటు కొత్త భాష నేర్చుకుంటున్నాను. సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. యోగా చేస్తున్నాను’’ అన్నారు. -
ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు
ప్రేమ కోసం ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు అంటోంది నటి నిత్యామీనన్. ఈ కేరళా అమ్మడు నటించిన హిందీ చిత్రం మిషన్ మంగళ్ ఇటీవలే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తలైవి(జయలలిత)గా మారడానికి రెడీ అవుతోంది. అంతే కాకుండా రెండు మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. విభిన్న పాత్రల్లో, వైవిద్య చిత్రాల్లో నటించే నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. మిషన్ మంగళ్ చిత్రంలో ఈమె నటించడానికి కూడా ఇదే కారణం. కాగా ప్రేమ, పాశం గురించి ఈ సుందరి ఏమంటుందో చూద్దాం. ‘ప్రేమ కోసం వెతుక్కోకండి. అసలు ప్రేమకు మరోకరు అవసరమే లేదు. మనలో మనమే ప్రేమను నింపుకుంటే ప్రపంచమే ప్రేమమయం అవుతుంది. సంతోషంగా ఉన్నవాళ్లు దాన్ని ఇతరులకు పంచుతారు. ప్రేమను కలిగినవారే దాన్ని ఇతరులతో పంచుకుంటారు. ప్రేమ అనేది అనుభవంగా ఉండకూడదు. అది అనుభవించేదిగా ఉండాలి. నిన్ను ప్రేమించడానికి నీకంటే మంచివాళ్లు ఎవరూ ఉండరు. అసలు ప్రేమ అనేదాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం. ఐలవ్యూ అనే మాటను కూడా తప్పుగా భావిస్తున్నాం. ఇతరులపై చూపే ప్రేమాభిమానాలు, మనం మనపై చూపుకునే ప్రేమ అంటూ ప్రేమ పలు రకాలు. ప్రేమ కోసం వెతుకుంటూ ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ప్రేమ అనేది ప్రపంచంలో ఎక్కడో లేదు. అది మనలోనే ఉంది. లోపల ఉన్న దాన్ని బయటకు తీస్తే, అదే నిజమైన ప్రేమ. ప్రేమ అనేది మననుంచే ప్రారంభం కావాలి. అది మీ వద్ద లేకుంటే ఇతరుల వద్ద లభిస్తుందని ఆశించి పరిగెత్తకూడదు. మనల్ని ఇతరులు గౌరవించాలని భావిస్తున్నాం. ముందు మనల్ని మనమే గౌరవించుకోవాలి’ అని నటి నిత్యామీనన్ పేర్కొంది. -
‘నన్ను బ్యాన్ చేస్తామని బెదిరించారు’
పాత్రలు మాత్రమే కనిపించేలా నటించే విలక్షణ నటి నిత్యామీనన్. పాత్రలు పోషించడంలోనే కాదు వాటిని ఎంచుకోవడంలోనూ నిత్యది డిఫరెంట్ స్టైల్. కంటెంట్‌కు ప్రాధాన్యం ఉంటే చిన్న పాత్రలైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. వ్యక్తిగతంగా కూడా తనకు నచ్చినట్లే ఉంటారు నిత్యా. దాంతో చాలామంది ఆమెకు పొగరు అని కూడా అనుకుంటారు. తాజాగా నిత్యా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను కలవడానికి వచ్చిన నిర్మాతలతో నిత్యా మాట్లాడలేదని.. చాలా పొగరుగా ప్రవర్తించిందనే ప్రచారం జరుగుతుంది. ఆమెని బ్యాన్ చేయాలని సదరు నిర్మాతలు భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. తాజాగా ఓ టీవీ షో ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన నిత్యా.. ‘వారు(నిర్మాతలు) ముందుగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి.. నన్ను కలవాలని చెప్పారు. అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. ఎవరితో మాట్లాడలని కూడా అనిపించలేదు. ఆ సమయంలో మా అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది. అది కూడా చాలా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉంది. షూటింగ్ సమయంలో కూడా దీని గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వచ్చేది. వెంటనే కార్వాన్లోకి వెళ్లి మా అమ్మ గురించి తల్చుకుని బాధపడేదాన్ని. అంతేకాక అదే సమయంలో నేను మైగ్రేన్‌తో బాధపడుతున్నాను. అప్పుడు ఎవరితో మాట్లాడలని అనిపించలేద’న్నారు. ‘కానీ ఇవేవి తెలీకుండా ఆ నిర్మాతలు నాకు చాలా పొగరని.. యాటిట్యూడ్ చూపిస్తాను అన్నారు. కానీ ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా పనేదో నేను చూసుకుంటాన’ని తెలిపారు. నిత్యా సమాధానం అభిమానలు మనసు గెల్చుకుంది. ఎప్పుడు మీరు ఇంతే ధైర్యంగా ఉండాలని అభినందిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నిత్యా తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ‘ఐరన్ లేడీ’లో నటిస్తున్నారు. ఆమె చేతిలో ‘కొలంబి’, ‘సైకో’, ‘మిషన్ మంగళ్’ తదితర చిత్రాలు ఉన్నాయి. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో కూడా నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
సూర్య పక్కన ఛాన్స్ కొట్టేసింది
చెన్నై : కేరళ కుట్టి నిత్య మీనన్ ప్రముఖ నటుడు సూర్య పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. తమిళ థ్రిల్లర్ చిత్రం '24' లో సూర్య పక్కన నటిస్తోంది. ఈ చిత్రంలో నిత్య కీలక పాత్ర పోషిస్తోందని ఆమె సన్నిహిత వర్గాలు గురువారం చెన్నైలో వెల్లడించాయి. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ముంబైలో ప్రారంభమై... శరవేగంగా సాగుతోందని తెలిపారు. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడు గతంలో టాలీవుడ్ హీరో నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం 'ఇష్క్'కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాంతో విక్రమ దర్శకత్వంలో నిత్య రెండో చిత్రం చేస్తుంది. ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సమంతా కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగులో విడుదల కానుంది. -
మా కెమిస్ట్రీ బాగుందంటున్నారు!
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి తెలుగు నాట కూడా అభిమానులున్నారు. ఆయన సినిమాలు చాలా మట్టుకు తెలుగులో అనువాదమయ్యాయి. డెరైక్ట్‌గా ‘రైల్వే కూలీ’, ‘సూర్యపుత్రులు’, ‘స్వాతికిరణం’ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడాయన వారసుడు దుల్కర్ సల్మాన్ ‘ఓకే బంగారం’ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేశారు. గురువారం హైదరాబాద్ వచ్చిన దుల్కర్ పత్రికలవారితో ముచ్చటించారు. ‘‘తెలుగులో బంగారం లాంటి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తా. ఏ దేశంలోనూ లేనన్ని భాషలు మన దేశంలో ఉన్నాయి. ఏ భాషలో మంచి సినిమా వస్తే, ఆ భాషలో చేయాలని ఉంది. ఇక, ‘ఓకే బంగారం’ విషయానికొస్తే.. మణిరత్నంగారి సినిమా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. నేను కూడా అంతే. ఆయన ఈ పాయింట్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. సహజీవనం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నిజజీవితంలో ఇది తప్పా? సరైనదా? అని చెప్పడానికి నేనెవర్ని? నిత్యామీనన్‌తో నాకిది మూడో చిత్రం. మా కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. కొంతమంది తెలుగువాళ్లు ఫోన్ చేసి అభినందించడం, ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఇక్కడ సినీ ప్రేమికులు ఎక్కువ’’ అన్నారు. ‘‘మీ నాన్నగారికన్నా మీరు మంచి ఆర్టిస్ట్ అని రామ్‌గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొనడం, మీరు కూడా అందుకు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఈ విషయం గురించి మీరేమంటారు?’’ అని దుల్కర్‌ని ప్రశ్నిస్తే, ‘‘దాని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు’’ అన్నారు. ఒకవేళ వర్మతో సినిమా చేసే అవకాశం వస్తే - ‘‘కథ బాగుంటే... అప్పుడాలోచిస్తా’’ అని దుల్కర్ చెప్పారు.