మా కెమిస్ట్రీ బాగుందంటున్నారు!
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి తెలుగు నాట కూడా అభిమానులున్నారు. ఆయన సినిమాలు చాలా మట్టుకు తెలుగులో అనువాదమయ్యాయి. డెరైక్ట్‌గా ‘రైల్వే కూలీ’, ‘సూర్యపుత్రులు’, ‘స్వాతికిరణం’ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడాయన వారసుడు దుల్కర్ సల్మాన్ ‘ఓకే బంగారం’ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేశారు. గురువారం హైదరాబాద్ వచ్చిన దుల్కర్ పత్రికలవారితో ముచ్చటించారు.
‘‘తెలుగులో బంగారం లాంటి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తా. ఏ దేశంలోనూ లేనన్ని భాషలు మన దేశంలో ఉన్నాయి. ఏ భాషలో మంచి సినిమా వస్తే, ఆ భాషలో చేయాలని ఉంది. ఇక, ‘ఓకే బంగారం’ విషయానికొస్తే.. మణిరత్నంగారి సినిమా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. నేను కూడా అంతే. ఆయన ఈ పాయింట్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. సహజీవనం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నిజజీవితంలో ఇది తప్పా? సరైనదా? అని చెప్పడానికి నేనెవర్ని? నిత్యామీనన్‌తో నాకిది మూడో చిత్రం.
మా కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. కొంతమంది తెలుగువాళ్లు ఫోన్ చేసి అభినందించడం, ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఇక్కడ సినీ ప్రేమికులు ఎక్కువ’’ అన్నారు. ‘‘మీ నాన్నగారికన్నా మీరు మంచి ఆర్టిస్ట్ అని రామ్‌గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొనడం, మీరు కూడా అందుకు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఈ విషయం గురించి మీరేమంటారు?’’ అని దుల్కర్‌ని ప్రశ్నిస్తే, ‘‘దాని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు’’ అన్నారు. ఒకవేళ వర్మతో సినిమా చేసే అవకాశం వస్తే - ‘‘కథ బాగుంటే... అప్పుడాలోచిస్తా’’ అని దుల్కర్ చెప్పారు.