OK Bangaram
-
హిందీలో... ఓ.కే. బంగారం
గతంలో ‘ఆషికీ-2’ చిత్రం ద్వారా అందరినీ ఆకట్టుకున్న జంట - శ్రద్ధా కపూర్, ఆదిత్యారాయ్ కపూర్. దీర్ఘకాలంగా ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఓ శుభవార్త. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలసి మళ్ళీ తెర మీదకొస్తున్నారు. వారి లేటెస్ట్ సినిమా ‘ఓకే... జానూ’ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. మణిరత్నం దర్శకత్వంలో హిట్టయిన తమిళ చిత్రం ‘ఓ.కె. కన్మణి’ (తెలుగులో ‘ఓ.కె. బంగారం’)కి ఇది హిందీ రీమేక్. ఇక్కడ దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ధరించిన పాత్రల్ని ఈ హిందీ రీమేక్ ‘ఓ.కె. జానూ’లో ఆదిత్యారాయ్ కపూర్, శ్రద్ధాకపూర్‌లు పోషిస్తున్నారు. ముంబయ్‌లోని మెరైన్‌డ్రైవ్ ప్రాంతంలో హీరో హీరోయిన్లిద్దరూ ద్విచక్ర వాహనం మీద వెళుతున్న దృశ్యాలను ముందుగా చిత్రీకరించారు. కథ రీత్యానే కాక, గత చిత్రాల రీత్యా కూడా వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. షాద్ అలీ దర్శకత్వంలో ప్రసిద్ధ ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తరాదిన కూడా హిట్టవుతుందేమో చూడాలి. -
మరోసారి జతగా...
‘ఓకే బంగారం’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ మలయాళంలో నటించిన చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. అన్వర్ రషీద్ దర్శకత్వంలో తెరకెక్కగా, మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ‘జతగా’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు. మార్చి మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత సురేశ్ మాట్లాడుతూ - ‘‘మలయాళంలో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన చిత్రమిది. లవ్, సెంటిమెంట్‌తో పాటు పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం తెలిపే అంశాలతో నిర్మించిన చక్కని ఫీల్ గుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్. సాహితి రాసిన మాటలు, గోపీ సుందర్ అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. లోకనాథన్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. అతి త్వరలో పాటలు విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. -
బంగారం బాలీవుడ్‌కి వెళ్తోంది
చాలా కాలం తరువాత మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కి మంచి విజయం సాధించిన సినిమా ఓకే బంగారం. వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయిన మణిరత్నం, ఈ సినిమా సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నటీనటుల ఎంపిక విషయంలో చాలా రోజులు ఆలస్యం అయినా, తర్వాత సరైన నిర్మాత దొరకకపోవటంతో మరింత ఆలస్యం అయ్యింది. ఫైనల్‌గా ఓకే బంగారం బాలీవుడ్ రీమేక్ కు టీం సెట్ అయ్యిందన్న వార్త బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ పొయటిక్ లవ్ స్టోరీని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో మణిరత్నం తెరకెక్కించిన సఖి సినిమాను సాథియా పేరుతో బాలీవుడ్లో తెరకెక్కించిన షాద్ అలీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆషికీ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో మరోసారి తెరను పంచుకోనున్నారు. సౌత్‌లో సూపర్బ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్న ఏఆర్ రెహమాన్ మరోసారి ఈ ప్రేమకథకు సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఓకే బంగారం రీమేక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కార్తీతోనే మణి సినిమా
ఓకే బంగారం సక్సెస్‌తో తిరిగి ఫాంలోకి వచ్చిన మణిరత్నం తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా, మణి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. కార్తీ, దుల్కర్ సల్మాన్ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తాడని భావించినా.. ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు. తరువాత కార్తీ, నాని కాంబినేషన్ అంటూ, నాని సోలో హీరోగా బైలింగ్యువల్ సినిమా అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా మణిరత్నం నెక్ట్స్ సినిమాపై మరో వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. కార్తీ హీరోగా ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట మణిరత్నం. కార్తీ అయితే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని భావించిన మణి, ఈ సినిమానే ఫైనల్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. -
'అగ్ని నక్షత్రం' ఇన్ స్పిరేషన్ తో మణి సినిమా!
ఓకె బంగారం సక్సెస్ తరువాత మణిరత్నం చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటికే కార్తీ, దుల్కర్ సల్మాన్ లు హీరోలుగా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రివేంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇద్దరు యంగ్ హీరోలు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీ గతంలో మణిరత్నం తెరకెక్కించిన 'అగ్ని నక్షత్రం' స్ఫూర్తితో రూపొందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. 1988లో రిలీజ్ అయిన అగ్నినక్షత్రం సినిమాలో అమలా, నిరోషాలు హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ కొత్త సినిమా కోసం 'ఇదు ఎన్న మాయం' ఫేం కీర్తి సురేష్‌ను ఒక హీరోయిన్గా ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం ఇంకా వేట కొనసాగుతోంది. ప్రస్తుతానికి మణి ఇంకా 'ఓకె బంగారం' సక్సెస్ ను ఎంజాయ్ చేసే మూడ్‌లోనే ఉన్నాడు. అక్టోబర్ 1 నుంచి సౌత్ కొరియాలో జరగనున్న బుసాన్ ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 'ఓకె బంగారం' ను ప్రదర్శిస్తున్నారు. బుసాన్ ఆసియాలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ కావటంతో మణి ఆ ఏర్పాట్లలో మునిగిపోయాడు. ఈ హడావిడి పూర్తవ్వగానే కార్తీ, దుల్కర్ ల కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా మీద దృష్టి పెట్టనున్నాడు. తమిళంలో చాలా కాలం తరువాత వస్తున్న మల్టీ స్టారర్ సినిమా కావటంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా మణి చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. -
'నన్ను నేను చూసుకొని మురిసిపోయా'
హైదరాబాద్: తొలిసారి వెండితెరపై తనను తాను చూసుకోవడం చాలా అనుభూతిని ఇచ్చిందని లీలా సాంసన్ అన్నారు. మణిరత్నం తెరకెక్కించిన ఓకే కన్మణి తెలుగులో వచ్చిన ఓకే బంగారం చిత్రంలో ఈమె తొలిసారిగా కనిపించారు. 63 సంవత్సరాల వయసులో గతంలో ఎలాంటి అనుభవం లేకుండానే కెమెరా ముందుకు వచ్చిన ఆమె ప్రేక్షకులను అబ్బుర పరిచారు. ఆమె హావబావాలు, మాటలతో అందరితో చప్పట్లు కొట్టించుకున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్ భార్యగా నటించిన లీలా సాంమ్సన్ చక్కటి మాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ తొలిసారి మణిరత్నం తనకు ఫోన్ చేసి కథ చెప్పారు. వినగానే నచ్చింది. ఈ చిత్రంలో భవాని అనే పాత్ర చేస్తారా అని అడగగానే ఎందుకు చేయను అని వెంటనే ఒప్పేసుకున్నానని చెప్పారు. స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లిన వారం తర్వాత ఆ పాత్ర మీదే అని చెప్పారన్నారు. తెరమీద తనను తాను చూసుకొని మురిసిపోయానని, మొదటిసారే ప్రకాశ్ రాజ్ లాంటి నటుడితో కలిసి చేయడం చాలా ఆనందనిచ్చిందన్నారు. లీలా సాంమ్సన్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా పనిచేసి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
మా కెమిస్ట్రీ బాగుందంటున్నారు!
మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి తెలుగు నాట కూడా అభిమానులున్నారు. ఆయన సినిమాలు చాలా మట్టుకు తెలుగులో అనువాదమయ్యాయి. డెరైక్ట్‌గా ‘రైల్వే కూలీ’, ‘సూర్యపుత్రులు’, ‘స్వాతికిరణం’ సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడాయన వారసుడు దుల్కర్ సల్మాన్ ‘ఓకే బంగారం’ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేశారు. గురువారం హైదరాబాద్ వచ్చిన దుల్కర్ పత్రికలవారితో ముచ్చటించారు. ‘‘తెలుగులో బంగారం లాంటి అవకాశాలొస్తే తప్పకుండా చేస్తా. ఏ దేశంలోనూ లేనన్ని భాషలు మన దేశంలో ఉన్నాయి. ఏ భాషలో మంచి సినిమా వస్తే, ఆ భాషలో చేయాలని ఉంది. ఇక, ‘ఓకే బంగారం’ విషయానికొస్తే.. మణిరత్నంగారి సినిమా అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. నేను కూడా అంతే. ఆయన ఈ పాయింట్ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. సహజీవనం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నిజజీవితంలో ఇది తప్పా? సరైనదా? అని చెప్పడానికి నేనెవర్ని? నిత్యామీనన్‌తో నాకిది మూడో చిత్రం. మా కెమిస్ట్రీ బాగుందని అందరూ అంటున్నారు. కొంతమంది తెలుగువాళ్లు ఫోన్ చేసి అభినందించడం, ఆశ్చర్యానందాలకు గురి చేసింది. ఇక్కడ సినీ ప్రేమికులు ఎక్కువ’’ అన్నారు. ‘‘మీ నాన్నగారికన్నా మీరు మంచి ఆర్టిస్ట్ అని రామ్‌గోపాల్ వర్మ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొనడం, మీరు కూడా అందుకు అభ్యంతరం తెలియజేయడం జరిగింది. ఈ విషయం గురించి మీరేమంటారు?’’ అని దుల్కర్‌ని ప్రశ్నిస్తే, ‘‘దాని గురించి ఇప్పుడేం మాట్లాడదల్చుకోలేదు’’ అన్నారు. ఒకవేళ వర్మతో సినిమా చేసే అవకాశం వస్తే - ‘‘కథ బాగుంటే... అప్పుడాలోచిస్తా’’ అని దుల్కర్ చెప్పారు. -
'కొడుకు నుంచి మమ్ముట్టి నటన నేర్చుకోవాలి'
ఎవరినైనా పొగడాలంటే.. అవతలివాళ్లను తిట్టాలన్నది రాంగోపాల్ వర్మ ఫిలాసఫీ. తాజాగా ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తడానికి స్వయంగా మమ్ముట్టినే తిట్టిపోశాడు రామూ. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన 'ఓకే బంగారం' సినిమాను ప్రశంసించేందుకు తన ట్విట్టర్ ఖాతాను వేదికగా చేసుకున్నాడు. ఇప్పుడే తాను మణిరత్నం సినిమా చూశానని, అవార్డు కమిటీ సభ్యులకు ఏమాత్రం సెన్స్ ఉన్నా.. వాళ్లు మమ్ముట్టికి ఇన్నాళ్లుగా ఇచ్చిన అవార్డులన్నీ వెనక్కి తీసేసుకుని వాటిని ఆయన కొడుక్కి ఇస్తారని రామూ అన్నాడు. దుల్కర్‌తో పోలిస్తే మమ్ముట్టి ఒక జూనియర్ ఆర్టిస్టు మాత్రమేనని వ్యాఖ్యానించాడు. మమ్ముట్టి నటనను తన కొడుకు నుంచి నేర్చుకోవాలని.. తాను ఈ మాట నిజంగానే అంటున్నానని నొక్క చెప్పాడు. కొన్నేళ్లలోనే మమ్ముట్టి కొడుకు కేరళ గర్వపడేలా చేస్తాడని.. ఇన్ని దశాబ్దాలుగా మమ్ముట్టి మాత్రం ఆ పని చేయలేకపోయారని కూడా రాంగోపాల్ వర్మ అన్నాడు. Jst saw Mani's film and if the award commitee members have any sense they will take back all awards of Mamooty and give it to his son — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamooty is a junior artiste compared to his son — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamooty should learn acting from his son..I mean realistic — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 Mamootys son will make Kerala proud In the non Kerala markets in just years which Mamooty couldn't do for decades — Ram Gopal Varma (@RGVzoomin) April 21, 2015 -
సినిమా రివ్యూ : ఓ.కె. బంగారం
చిత్రం - ‘ఓ.కె. బంగారం’, తారాగణం - దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, లీలా సామ్సన్, ప్రకాశ్‌రాజ్, ప్రభూ లక్ష్మణన్, రమ్యా సుబ్రమణియమ్, కణిక, బి.వి. దోషీ, మాటలు - కిరణ్, పాటలు - సీతారామశాస్త్రి, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, కొరియోగ్రఫీ - బృంద, కూర్పు - ఏ. శ్రీకర్‌ప్రసాద్, నిర్మాత - ‘దిల్’ రాజు, రచన, దర్శకత్వం - మణిరత్నం దాదాపు పాతికేళ్ళ క్రితం దేశంలో మొదలైన ఆర్థిక సరళీకరణ, ఆ వెంటనే వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంలో పుట్టి పెరిగిన కొత్త తరం ఇప్పుడు పరవళ్ళు తొక్కుతోంది. దేశాన్నీ, ప్రపంచాన్నీ ముందుండి నడుపుతున్న ఈ తరానికి పెళ్ళి, కెరీర్ లాంటి అంశాలపై ఉన్న అభిప్రాయాలు, కుటుంబ సంబంధాలపై ఉన్న ఆలోచనలు ఎలాంటివి? వివాహ వ్యవస్థ కన్నా సహజీవనమైతే బరువు బాధ్యతలు ఉండవని వారు అనుకోవడంలో ఎంత నిజాయతీ ఉంది? వాటిని తెరపై చూపితే ఎలా ఉంటుంది? దర్శక - రచయిత మణిరత్నం చేసిన తాజా వెండితెర ప్రయత్నం - ‘ఓ.కె. బంగారం’ అదే! ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత - పంపిణీదారు ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అందించారు. కథ ఏమిటంటే... హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి కుర్రాడు ఆదిత్య కంటమనేని అలియాస్ ఆది (దుల్కర్ సల్మాన్) ఉద్యోగ నిమిత్తం ముంబయ్ వెళతాడు. అక్కడ తన అన్నయ్య స్నేహితుడైన గణపతి (ప్రకాశ్‌రాజ్), భవాని (లీలా శామ్సన్) దంపతుల ఇంటికి వెళతాడు. అప్పటికి 23 ఏళ్ళుగా ముంబయ్‌లో స్థిరపడిన ఆ దంపతుల ఇంట్లోనే ఒక గదిలో పేయింగ్ గెస్ట్‌లా ఆశ్రయం పొందుతాడు. అంతకు ముందు రైల్వేస్టేషన్లో చూసిన తారా కళింగ అలియాస్ తార (నిత్యా మీనన్) అనే ఔత్సాహిక ఆర్కిటెక్ట్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. తారకు ఏడేళ్ళ వయసప్పుడే ఆమె తల్లి, తండ్రి విడిపోతారు. కోయంబత్తూరులో పెద్ద ఫ్యాక్టరీ, వ్యాపారాలు నడిపే ధనికురాలైన తల్లికి కూడా దూరంగా తార స్వతంత్రంగా బతుకుతుంటుంది. మిత్రురాలు, సహోద్యోగిని అయిన అనన్య పెళ్ళిలో కలిసిన ఆది, తారలిద్దరికీ ‘పెళ్ళి ఈజ్ ఓన్లీ ఫర్ ఫూల్స్’ అనీ, దానికన్నా బాదరబందీ లేని ‘లివ్ - ఇన్ రిలేషన్షిప్’ మెరుగనీ బలమైన అభిప్రాయం ఉంటుంది. ప్రేమ పెరిగిన వారిద్దరూ, వివాహబంధానికి వెలుపలే ఆది గదిలోనే కలసి ఉండాలని నిర్ణయించుకుంటారు. ఈ వివాహేతర జీవన సంబంధంతో కలిసిన యువ జంటకు సమాంతరంగా వివాహ బంధంలోని గొప్పదనాన్ని చూపే భవాని - గణపతి దంపతుల కథ నడుస్తుంటుంది. ఒకప్పటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు భవాని ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధితో, తద్వారా వచ్చే మతిమరుపుతో బాధపడుతూ ఉంటుంది. అయినా ఆమెను ప్రేమతో చూస్తూ, సమస్త సపర్యలూ చేస్తుంటాడు గణపతి. గేమింగ్ యానిమేషన్లో ఉన్న హీరో అమెరికా వెళ్ళాలని కలలు కంటూ ఉంటే, సంప్రదాయ సంగీతంలో దిట్ట అయిన హీరోయిన్ ఆర్కిటెక్చర్లో పై చదువులకు ప్యారిస్ పోదామనుకుంటుంది. ఈ కెరీర్ స్వప్నాల మధ్య ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’లో ఉన్న ఆ యువ జంట ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? వారి జీవితాలు ఎటు మళ్ళాయి? లాంటివన్నీ మిగతా చిత్ర కథ. ఎలా నటించారంటే... ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ ఇప్పటికే కొన్ని మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లాంటివీ అందుకున్నారు. తెలుగు తెరపై తొలిసారిగా కనిపించిన ఈ యువ నటుడు తెరపై బాగున్నారు. ఇక, ఇటీవలి కాలంలో తన అభినయం ద్వారా అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న నిత్యా మీనన్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కళ్ళతోనూ అభినయించగల సామర్థ్యం, సన్నివేశానికీ - సందర్భానికీ తగ్గట్లు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నైపుణ్యం, శారీరక సౌందర్యాన్ని మించిన ఆత్మిక ఆకర్షణ నిత్యా మీనన్‌ను అందరికీ ఆత్మీయురాలిని చేస్తుంది. గతంలో కొన్ని మలయాళ చిత్రాల్లో కలసి నటించిన దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ మరోసారి వెండితెరను అద్భుతంగా వెలిగించింది. గతంలో కేంద్ర సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పనిచేసి, మోడీ నేతృత్వంలోని బి.జె.పి. ప్రభుత్వం వచ్చాక వివాదాల మధ్య రాజీనామా చేసిన ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి లీలా శామ్సన్ ఈ చిత్రంలో భవానిగా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. ఆమెను అమితంగా ప్రేమిస్తూ, వంటతో సహా అన్నీ చూసుకొనే భర్త పాత్రలో ప్రకాశ్‌రాజ్ బాగున్నారు. ముఖ్యంగా, వానలో వారిద్దరూ కలిసే సన్నివేశం అప్రయత్నంగా కళ్ళు చెమర్చేలా చేస్తుంది. సాంకేతిక విభాగాల పనితీరెలా ఉందంటే... ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి. వాటికి మణిరత్నం శైలి చిత్రీకరణ, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ ఇంద్రజాలం, శ్రీకర్‌ప్రసాద్ ఆ దృశ్యాలను ఏర్చికూర్చిన విధానం నవతరాన్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ‘రారా ఆటగాడా...’, ‘మన మన మన మెంటల్ మదిలో...’, ‘ఏదో అడగనా...’ లాంటి పాటలు పదే పదే కూనిరాగం తీయాలనిపిస్తాయి. అది ఈ సినిమాకు ఉన్న పెద్ద సానుకూల అంశం. సీతారామశాస్త్రి కలం మరొక్కసారి తన పదును చూపిన సినిమా ఇది. ముఖ్యంగా, ఈ సినిమాకు రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం రొటీన్ సినిమాలు, వాటిలోని రీరికార్డింగ్‌కు భిన్నంగా ఉంది. సంప్రదాయ సంగీత నేపథ్యం కథలో ఉండడంతో, అందుకు తగ్గట్లు రెహమాన్ అక్కడక్కడ వాడిన సంగీత శకలాలూ, బిట్లూ బాగున్నాయి. తమిళంలో ‘లైవ్ సౌండ్’తో తీసిన ఈ చిత్రానికి తెలుగు అనువాదంలో కథానాయకుడికి మన తెలుగు హీరో నాని డబ్బింగ్ చెప్పారు. నిత్యా మీనన్, ప్రకాశ్‌రాజ్‌లు తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం పాత్రలకు నిండుదనం తెచ్చింది. తెలుగులో కిరణ్ డైలాగులు రాసిన ఈ చిత్రంలో ‘దిడీలని’ (గబుక్కున అని అర్థం), ‘ముట్టాళ్’ (తెలివిలేనివాడు అని అర్థం) లాంటి తమిళ పదాలను తెలుగు వెర్షన్లో యథేచ్ఛగా ఎందుకు వాడారో అర్థం కాదు. ఎలా ఉందంటే... దేశం గర్వించే దిగ్దర్శకుడు మణిరత్నం అందించిన మరో ప్రేమకథా చిత్రమిది. నిజానికి, అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో మణిరత్నం దిట్ట. ‘మౌనరాగం’ రోజుల నుంచి... ‘గీతాంజలి’ మీదుగా... మొన్నటి ‘సఖి’ దాకా అది బాక్సాఫీస్ సాక్షిగా పదే పదే ఋజువవుతూ వస్తున్న సత్యం. ఇటీవల ‘రావణ్’, ‘కడలి’ లాంటి పెద్ద ఎదురుదెబ్బలే తగిలిన ఆయన ఈ సారి ‘సహజీవన’మనే సమకాలీన అంశాన్నీ, తనకు పట్టున్న ప్రేమకథనూ కలిపి వెండితెరపై పసందైన వంటకాన్ని వండి వడ్డించారు. తమిళంలో ‘ఓ కాదల్ (ఓ.కె) కన్మణి’గా తయారైన ఈ చిత్రం తెలుగులో ‘ఓ.కె. బంగారం’గా అనువాదమైంది. పదిహేనేళ్ళ క్రితం మాధవన్, షాలిని జంటగా మణిరత్నమే తీసి, తమిళ ఉగాది కానుకగా (2000 ఏప్రిల్ 14న) విడుదలైన తమిళ ‘అలై పాయుదే’ (తెలుగులో ‘సఖి’గా విడుదలై, హిట్టయింది) ఛాయలు ఈ కొత్త చిత్రం నిండా పరుచుకున్నాయి. అందుకే, ఒక రకంగా ఇది సమకాలీన వాతావరణానికి తగ్గట్లుగా తీసిన ‘సఖి - 2015’ అని కూడా చెప్పవచ్చు. ఒకరకంగా సహజీవనానికి చాలావరకు సానుకూలంగా అనిపించే ప్రమాదమున్న సినిమా ఇది. అయితే, ‘ఒక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలా? అప్పుడిక అంతా ఓ.కేనా?’ అని హీరోయిన్ పాత్ర వేసే ప్రశ్న మాత్రం నిజంగానే ఆలోచింపజేస్తుంది. ఫస్టాఫ్ కొంత నిదానంగా అనిపించినా, పాత్రల పరిచయం, వాటి గమ్మత్తై ప్రవర్తన, చిన్ని చిన్ని అందమైన అంశాలతో నడుస్తుంది. చాలామంది ప్రేక్షకులను మళ్ళీ తమ యౌవనదశలోకి ప్రయాణింపజేస్తుంది. ఇక, ఈ తరం యువ ప్రేక్షకుల మాటైతే ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అయితే, ఈ కథకు సెకండాఫ్‌కు కీలకం. హీరో హీరోయిన్ల ప్రవర్తన, వైఖరిలోని మార్పునూ, ఘర్షణనూ తెలియజెప్పే ఈ భాగం ఎంత కన్విన్సింగ్‌గా ఉంటే, సినిమా అంత బాగుంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ, ఆ క్రమంలో కథ, కథనం అస్తుబిస్తు అయినట్లు కనిపిస్తుంది. దాంతో, సెకండాఫ్‌లో చాలాసేపు ప్రేక్షకులు తెరపై జరుగుతున్న కథ నుంచి కొంత దూరమవుతారు. నిజానికి, అప్పటికే 15 మంది గర్ల్ ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేసిన హీరో తనను 16వ గర్ల్ ఫ్రెండ్‌గా ఎంచుకున్నా, హీరోయిన్ అతనికి దగ్గరవడానికి తగిన కారణం కనిపించదు. అలాగే, వారిని తమ ఇంట్లోని గదిలో ఉండడానికి ప్రకాశ్‌రాజ్ కుటుంబం అంగీకరించడానికీ బలమైన కారణం చూపలేదు. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్నది తెలియని ఆకర్షణా, ప్రేమా, ‘లివ్ ఇన్ రిలేషన్షిప్’ ముసుగులో ఉన్న కామమా అన్న అనుమానమూ వస్తుంది. డైలాగుల గందరగోళం మధ్య హీరోయిన్‌కు హీరో కనిపించని రెండు రోజులు అసలేమైందన్న విషయమూ స్పష్టంగా అర్థం కాదు. హీరో, హీరోయిన్ల వైపు బంధువులంతా ఒప్పుకున్నాక కూడా పెళ్ళికి వారు సిద్ధం కాకపోవడానికి మొత్తానికి, పెళ్ళి వద్దనుకొనే దశ నుంచి పెళ్ళి చేసుకుందామనుకొనే దశకు మారిన ఒక జంట జీవితంగా ఇది ‘న్యూ ఏజ్ లవ్‌స్టోరీ’. సంప్రదాయ సంగీత నేపథ్యమున్నా, సంప్రదాయ జీవన విధానానికి విరుద్ధంగా సాగే ఈ చిత్రం కొత్తతరంలో ఉండే సరదాలు, అనుభూతులు, అనుమానాలను ప్రతిఫలిస్తుంది. స్వేచ్ఛ, స్వతంత్ర లైంగిక జీవనాన్ని ప్రతిపాదిస్తూ, కొన్ని వర్గాలనే ఆకట్టుకుంటుంది. కాకపోతే, మణిరత్నం ఇమేజ్, ఆయన మార్కు విజువల్స్, పాటల మీద ప్రేక్షకులకుండే అభిమానమే ఈ ‘ఫీల్ గుడ్ సినిమా’కు శ్రీరామరక్ష. వెరసి, ఫుల్‌మీల్స్ కాలేకపోయిన ఈ సినిమా ఒక్కముక్కలో - కొందరికే ఓ.కె. బంగారం! - రెంటాల జయదేవ -
'ఓకే బంగారం' ఆడియో సక్సెస్ మీట్
-
నేను వేధిస్తుంటా.. అతను సహిస్తుంటాడు..!
దర్శకుడు మణిరత్నం... సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్... ఇద్దరూ ఒకేసారి మీడియా ముందుకు వస్తే! రెండు మేరునగాలనూ కూర్చోబెట్టి, 5 నిమిషాల్లోనే అంతా అడిగేయమంటే? బుధవారం ‘ఓ.కె. బంగారం’ పాటల విజయోత్సవం కోసం హైదరాబాద్ సుడిగాలి పర్యటన జరిపారు ఆ ఇద్దరు. ప్లైట్ దిగుతూనే రెహమాన్ నాంపల్లి దర్గా సందర్శన, సానియా మిర్జాతో భేటీ, వెంటనే ఆడియో ఫంక్షన్, ప్రత్యేక టీవీ ఇంటర్వ్యూ, ‘బాహుబలి’ రాజమౌళితో రెహమాన్ మంతనాలు - మణిరత్నం ముచ్చట్లు... ఉన్న కాసేపూ ఊపిరి సలపని హడావిడి. 4 గంటలు నిరీక్షించి, అలసిన మీడియా... కాలానికి అతీతమైన ఆ క్రియేటర్‌సని పరిమిత కాలవ్యవధిలోనే ఆవిష్కరించాలని ప్రయత్నించింది. నటుడు ప్రకాశ్‌రాజ్ కలగ జేసు కుంటూ ఉండగా, సాగిన ‘డబుల్ ధమాకా’ నుంచి... మరికొద్ది నెలల్లో అరవయ్యో ఏట అడుగుపెడుతున్నారు. అయినా, ‘ఓ.కె. బంగారం’ లాంటి ఇంత అందమైన ప్రేమకథా చిత్రాన్ని తీయడం ఆశ్చర్యం! మణిరత్నం: (ఆశ్చర్యం నటిస్తూ...) ఎవరు అరవయ్యో ఏట అడుగుపెడుతున్నది! నాకు ఇప్పటికీ ఇరవై ఒక్క ఏళ్ళ చిల్లరే! (నవ్వులు...) మీరు తరచూ బొంబాయి నగర నేపథ్యంలో చిత్రాలు తీస్తుంటారు. ఈ సినిమా కూడా ఆ నేపథ్యంలో సినిమానే! ఆ నగరం పట్ల మీ ఆకర్షణకు ప్రత్యేక కారణం? మణి: నేను తీసిన చిత్రాల్లో ఒకటైన ‘బొంబాయి’ అయితే, పూర్తిగా ఆ నగరం చుట్టూ తిరిగిన కథ. అయితే, ఆ కథ, ఆ నేపథ్యం వేరు. నిజం చెప్పాలంటే, నాకు బొంబాయి (ఇప్పటి ముంబై) నగరమంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ, ఇష్టం. రెండు మూడేళ్ళు నేను అక్కడే చదువుకున్నాను. పెపైచ్చు, భారతదేశంలో బాగా పురోగమిస్తున్న అనేక మహానగరాలకు ప్రతీక బొంబాయి నగరం. అందుకే, ఈ కథకు ఆ నేపథ్యమైతే బాగుంటుందని ఎంచుకున్నా. బొంబాయిలో ఉండే ఉల్లాసం, ఉత్సాహం కథకు ఉపకరిస్తుందనా? మణి: ప్రతి నగరానికీ తనదైన ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఈ చిత్ర కథ ఒక నిర్ణీత వాతావరణంలో, ప్రపంచంలో జరుగుతుంది. అది బొంబాయిలో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అందుకనే ఆ నగర నేపథ్యం తీసుకున్నాం. మీ సినిమాలు సమాజం నుంచి ప్రేరణ పొందుతుంటాయి. మరి, ఈ సినిమా? మణి: ఈ సినిమా కథ కూడా సమాజంలో నుంచి తీసుకున్నదే! ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా ఇవాళ్టిని, ఇవాళ్టి ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇవాళ్టి యువతీ యువకులు, వయసు మీద పడ్డవాళ్ళు, వాళ్ళ మనోభిప్రాయాలను ఈ సినిమా చూపెడుతుంది. వారి మానసిక వైఖరినీ, వారు తీసుకొనే నిర్ణయాలనూ, వారి మధ్య ఉన్న ఘర్షణనూ ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన రీసెర్చ్ చేస్తుంటారు? మణి: ఏదైనా ఒక ప్రత్యేకమైన కథ, ఒక ప్రత్యేకమైన పాత్ర అనుకున్నప్పుడు స్వరూప స్వభావాలకు కొంత రీసెర్చ్ అవసరం. కానీ, జీవితం నుంచే కథలనూ, పాత్రలనూ ఎంచుకున్నప్పుడు మనం చూసిన విషయాలు, మనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు కీలకమవుతాయి. కళ్ళూ, చెవులూ విప్పార్చి, అన్నీ గమనిస్తూ ఉంటే... చాలు. అదే మనకు రీసెర్చ్. ‘సహజీవనం’ అనే అంశంపై ఈ చిత్రకథ సాగుతుందని విన్నాం. ఇవాళ్టికీ సమాజం ఒక నేరంగా చూస్తున్న ఇలాంటి క్లిష్టమైన అంశాన్ని ఎంచుకున్నారేం? మణి: ఈ చిత్ర కథ కేవలం ‘సహజీవనం’ అనే అంశంపై సాగేది కాదు. ‘ఓ.కె. బంగారం’ సినిమా వివాహం గురించి, వివాహవ్యవస్థ పట్ల కథలోని ప్రధాన పాత్రలకు ఉన్న వైఖరి గురించి, వారి అభిప్రాయాల గురించి! కాబట్టి, ఈ సినిమా అనేక విషయాలనూ, పలువురు వ్యక్తులనూ స్పృశిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో పెరుగుతున్న ఈ తరం యువతీ యువకులు ఏ రకమైన పాశ్చాత్య ప్రభావానికి లోనవుతున్నారు, అదే సమయంలో మన భారతీయ విలువల్లో వేటికి కట్టుబడి ఉన్నారనేది ఈ చిత్రం చూపిస్తుంది. తెలుగు నేటివిటీ కోసం ఏమైనా మార్పులు చేశారా? మణి: ఈ చిత్రకథను దేశంలోని ఒక మహానగర నేపథ్యంలో చూపెట్టాం కాబట్టి, ఇది మనందరికీ తెలిసిన కథ, మన మధ్యే జరుగుతున్న కథ అనిపిస్తుంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ఇది తమ కథ అనే భావిస్తారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ ‘ఓ కాదల్ కన్మణి’ని షూటింగ్ జరుగుతున్నప్పుడే డైలాగులు, శబ్దం కూడా రికార్డు చేసేలా ‘సింక్ సౌండ్’తో చిత్రీకరించారేం? మణి: నన్నడిగితే, ఏ సినిమానైనా అలా ‘సింక్ సౌండ్’లోనే తీయాలంటాను! ‘సింక్ సౌండ్’తో తీయగలిగితే, అలా తీయడమే చాలా మంచిదని నా అభిప్రాయం. ఈ సినిమాను అలా తీయడం నాకెంతో సంతోషం అనిపించింది. అలా చేయడం వల్ల ఆర్టిస్టుల హావభావాలు, దానికి ప్రతిస్పందన, సెట్స్ మీదే రికార్డయిన ఆ సౌండ్‌లోని సూక్ష్మ వివరాలు, విశేషాలు తోడై అద్భుతంగా ఉంటుంది. డైలాగుల్లోనే కాక, మొత్తం సినిమాకే కొత్త జవజీవాలొస్తాయి. అలా ‘సింక్ సౌండ్’లో తీయడం కష్టం కాదా? మణి: కష్టమే! ఆ మాటకొస్తే, షూటింగ్‌తో సహా అనేక విషయాలు కష్టమే. అయినా, మనం చేయాలి. కష్టంగా ఉంటుంది కదా అని, భయపడి వదిలేయకూడదు కదా! వీలుంటే, నా రాబోయే చిత్రాలకు కూడా ఇదే పద్ధతి పాటిస్తా. ప్రకాశ్‌రాజ్: (పక్క నుంచి అందుకుంటూ...) నటీనటుల దృష్టిలో నుంచి చెప్పాలంటే, ‘సింక్ సౌండ్’ చాలా కీలకం. నటిస్తున్న నటీనటులకు ఆ భాష తెలియాలి. ఆ డైలాగ్ చెబుతూ భావప్రకటన చేయడం తెలియాలి. దీనివల్ల తరువాతెవరో డబ్బింగ్ చేస్తారనే సౌకర్యం ఉండదు. ఆ క్షణాన్ని కెమేరా ముందు జీవించగలగాలి. నటీనటులు జాగ్రత్తగా, చైతన్యంతో ఉండాలి. ఆ సినిమా పట్ల ఎంతో నిజాయతీతో, నిబద్ధతతో ఉండాలి. ఒక నటుడిగా నాకు అది అనుభవమైంది. మణి: ప్రకాశ్‌రాజ్ మనసుకు హత్తుకొనేలా చెప్పారు. థ్యాంక్స్ ప్రకాశ్. గతంలో చక్కటి ప్రేమకథ ‘సఖి’ తీశారు. ఇప్పుడు ఈ సినిమా... ప్రకాశ్‌రాజ్: రెండూ భిన్నమైన సినిమాలు. శుక్రవారం మీరే చూస్తారు. చాలాకాలం తర్వాత మీరు, కెమేరామన్ పి.సి. శ్రీరామ్ మళ్ళీ కలసి పనిచేశారు... మణి: మళ్ళీ కలసి పనిచేయడమని నేను అనను. ఎందుకంటే, శ్రీరామ్ మా టీమ్‌లో ఎప్పుడూ సభ్యుడే! నా సినిమాకు కెమేరామన్‌గా పనిచేయని సందర్భాల్లో కూడా ఆయన మా జట్టులో వాడే! నేను తీసే ప్రతి సినిమా స్క్రిప్టూ ఆయనకు తెలుసు. ఆయన నాకు ‘బౌన్స్ బోర్డ్’ లాంటివాడు. నాకు ఆయన ఎంత మిత్రుడంటే, నా ప్రతి సినిమా ఆయనతో చర్చిస్తూ ఉంటా. మీకు వేటూరిగారితో అలవాటు. ఇప్పుడు సీతారామశాస్త్రిగారితో పనిచేయడం? మణి: వేటూరి గారితో అనేక సంవత్సరాలు కలసి ప్రయాణించాను. ఇప్పుడు శాస్త్రి గారితో పనిచేయడం కూడా అచ్చం ఆ అనుభూతి లాగానే, ఎంతో బాగుంది. ఆయన రాసిన సాహిత్యం ఎంతో ఆనందాన్నిచ్చింది. రెహమాన్ గారూ! ఈ చిత్రంలో మీ అబ్బాయి స్వరంగేట్రం చేస్తున్నట్లున్నాడు! ఎ.ఆర్. రెహమాన్: నిజానికి, మా కుటుంబం వినడం కోసం ఒక పాట చేశా. అనుకోకుండా, మణి సార్ ఆ పాట విన్నారు. వెంటనే, ‘ఆ పాట నాకు కావాలి. ఈ సినిమాలో వాడతాను’ అన్నారు. అసలైతే, ఆ పాటను మ్యూజిక్ వీడియో చేయాలని, నా వ్యక్తిగత మిత్రులు వినేలా వాళ్ళకు ఇవ్వాలనీ ముందు అనుకున్నాను. కానీ, మణి సార్ అడిగేసరికి, సినిమాలో పెట్టేశా. మణి: నువ్విప్పటికీ ఆ పాటతో మ్యూజిక్ వీడియో చేయచ్చు.(నవ్వులు...) రెహమాన్: (నవ్వేస్తూ...) మణిరత్నం సినిమాలో రావడం గొప్ప విషయం కదా! ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. ఒక సంగీత కళాకారుడైతే, ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకనో కళ్ళవెంట నీళ్ళొచ్చేస్తున్నాయంటూ భావోద్వేగంగా మెసేజ్ పెట్టారు. రోజూ దాని గురించి అలాంటి మెసేజ్‌లొస్తూనే ఉన్నాయి. రెండు దశాబ్దాల పైచిలుకుగా మణిరత్నంతో మీ అనుబంధం గురించి..? మణి: (మధ్యలోనే అందుకుంటూ...) నేను వేధిస్తుంటా... అతను దాన్ని సహించి, నాకు కావాల్సింది ఇస్తుంటాడు. (నవ్వులు) రెహమాన్: నేను చాలా కాలంగా చెప్పాలనుకుంటున్న విషయం చెప్పాలి. మణి సార్లో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. సాధారణంగా అందరూ అవతలివాళ్ళను పాపులారిటీని బట్టి, వాళ్ళ జయాపజయాలను బట్టి జడ్జ్ చేస్తుంటారు. ఈ హీరో పాపులర్, ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు ఊపు మీద ఉన్నాడు... ఇలా చూసి, వాళ్ళను పెట్టుకోవాలని చూస్తుంటారు. ఫ్లాపులు వచ్చినవాళ్ళను దూరం పెట్టేస్తుంటారు. కానీ, మణి అలా జడ్జ్ చేయరు. అవతలి వాళ్ళు ఎంత ప్రేమతో, ఇష్టంతో నాణ్యమైన పని అందిస్తారన్నదే చూస్తారు. సదరు యాక్టర్ సక్సెస్‌లో ఉన్నాడా, ఫెయిల్యూర్లో ఉన్నాడా అని కాకుండా, ఆ వ్యక్తి ఎంత చక్కటి నటన అందిస్తారు, ఆ పాత్రను ఎంత అద్భుతంగా పండిస్తారన్నదే చూస్తారు. చేసే పని మీద శ్రద్ధ, ప్రేమ ఉంటే చాలు... మిగతావాళ్ళంతా పక్కనపెట్టినవాళ్ళను సైతం ఆయన ఆనందంగా స్వాగతిస్తారు. దగ్గరకు తీసుకొని, తన ప్రాజెక్ట్‌లో భాగం చేసుకొని, ప్రేమిస్తారు. అది ఆయనలోని గొప్ప లక్షణం. ఫ్లాపుల్లో ఉన్న ఫలానా వ్యక్తిని తీసుకుంటే, నా సినిమా కూడా ఫ్లాపవుతుందేమో లాంటి మూఢనమ్మకాలు ఆయనకు లేనే లేవు. మణి సార్! మీరు గతంలో మమ్ముట్టితో, ఇప్పుడీ సినిమాలో ఆయన కుమారుడు దుల్కర్‌తో పనిచేశారు. ఎవరిని ఇష్టపడ్డారు? మణి: వారిద్దరూ ఒకరికొకరు పూర్తి భిన్నం. మమ్ముట్టి లాంటి దిగ్గజం ఛాయలో పెరుగుతూ, ఆయన ప్రభావం లేకుండా నటించడం చాలా కష్టం. కానీ, విచిత్రంగా దుల్కర్ అదే చేశాడు. తండ్రిని అనుకరించకుండా, ఆత్మవిశ్వాసంతో అభినయించాడు. అది గొప్ప విషయం. నన్నడిగితే, ఏ ఇద్దరినీ ఒకరినొకరు పోల్చి, ఎవరు ఇష్టమని జడ్జ చేయాల్సిన పని లేదు. దుల్కర్, నిత్యామీనన్ల ఎంపికకు ప్రత్యేక కారణమేదైనా ఉందా? మణి: కేవలం నా మనుగడ కోసమే. (నవ్వులు...). తీస్తున్న సినిమాకు సులభంగా అందుబాటులో ఉంటూ, కథలోని పాత్ర లకు తమదైన అదనపు విలువను జోడిస్తూ, ఈ కథ నిజంగా జరిగిందని తెరపై అనిపించగలిగే వాళ్ళనెంచుకుంటూ ఉంటా. రెహమాన్‌జీ.. ఈ చిత్రానికి చేసి, పక్కన పెట్టేసిన పాటలేమైనా? రెహమాన్: మేము మరో పాట కూడా చేశాం. తీరా సినిమా చూశాక, ఆ పాట సరిగ్గా అతికినట్లు అనిపించలేదు. షూట్ చేసిన ఆ పాట తీసేశాం. నేను ఎంత కష్టపడి చేసిన పాటైనా సరే, బాగా లేదనుకుంటే పక్కనపెట్టాల్సిందే! మణి: రెహమాన్‌లోని గొప్ప విషయం అదే. ఇతరులు అలా ఉండరు. అతను ఎంతో శ్రమపడి, చేసిన పాటను సైతం వద్దని అంటే పక్కనపడేస్తాడు. నేను మాత్రం తీసిన ఏ సీన్ కైనా ఎవరైనా అలా అంటే, తగాదా పడతా (నవ్వులు...) రెహమాన్‌జీ.. మీరు కానడ రాగం తరచూ వాడతారు. మణి గారు అడుగుతుంటారా? మణి: నాకే రాగమూ తెలీదు. ‘మౌనరాగం’ తెలుసేమో? మణి: హ్హ...హ్హ... హ్హ... రెహమాన్: పాట వినిపించ గానే, ఎవరీ సింగర్ అని మణి అడిగారంటే, ఆ పాట బాగుందని. ఈ సినిమాలో విలాస్‌ఖాన్, తోడి లాంటి అనేక రాగాలు వాడాలని చూశా. అయితే, మనకు ఎన్ని రాగాలు వచ్చని కాక, అవి ఎలాంటి భావాన్ని ఇస్తున్నాయనేది ముఖ్యం. అందుకే, చాలా సింపుల్‌గా వెళ్ళిపోయాను. మణీజీ! మీ సినిమాలు యువతరం, పెద్దవాళ్ళు అందరూ చూస్తుంటారు. ఇన్ని వర్గాలకు నచ్చేలా ఎలా తీస్తారు? మణి: ఫలానా వయస్సు వాళ్ళకు నచ్చాలంటూ తీయను. ఎవరూ అలా తీయ కూడదు. ఎంచుకున్న కథను దానికి తగ్గట్లు తీయాలి. దాన్ని నిజాయతీగా తీయాలి. మన మనసుకు ముందుగా నచ్చేలా తీయాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశించాలి. అంతే. - రెంటాల జయదేవ -
సహజీవనం నేపథ్యంలో...
విదేశాలకు వెళ్లాలనుకునే ఓ అమ్మాయికీ, ఓ అబ్బాయికీ ముంబయ్‌లో పరిచయం ఏర్పడుతుంది. విదేశాలు వెళ్లేవరకూ ఇద్దరూ కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. చివరికి ఇద్దరి ప్రయాణానికి సమయం దగ్గరపడుతుంది. ఇన్నాళ్లూ కలిసి ఉన్న ఈ ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు విదేశాలు వెళతారా? లేక జతగా వెళతారా? అసలు విదేశాలు వెళ్లాలనే నిర్ణయాన్ని మార్చుకుంటారా? తదితర అంశాల సమాహారంతో మణిరత్నం తీసిన చిత్రం ‘ఓకే బంగారం’. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించారు. మద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్త్తున్నాయి. వచ్చే వారం ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత ‘దిల్’ రాజు చెబుతూ - ‘‘సహజీవనంపై హిందీలో చాలా సినిమాలొచ్చాయి. కానీ, తెలుగులో ఈ అంశం పూర్తిగా కొత్త. ఈ చిత్రం యువతకూ, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే విధంగా ఉంటుంది. ఏఆర్. రహమాన్ స్వరపరచిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. పీసీ శ్రీరామ్ ఫొటోగ్రఫీ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్. -
చెప్పాల్సింది...మూడే నిమిషాల్లో!
మన దర్శక, రచయితల్లో చాలా మంది ఒక కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకుంటారు. డైలాగులతో సహా స్టోరీ అంతా రెండు, మూడు గంటలు వివరంగా చెబితే కానీ, హీరోనూ, నిర్మాతనూ ఆకట్టుకోలేమనీ, వారిని ఒప్పించి, సినిమాను పట్టాలెక్కించలేమనీ భావిస్తుంటారు. కానీ, మణిరత్నం మాత్రం అందుకు విరుద్ధమట. ‘‘మూడే మూడు నిమిషాల్లో కథ చెప్పలేకపోతే, అదే కథే కాదు’’అని ఆయన అభిప్రాయమట. ఆయన అనుసరించే మంత్రం కూడా అదేనట. సాక్షాత్తూ ఆయనతో సాన్నిహిత్యమున్న గీత రచయిత వైరముత్తు ఈ సంగతి వెల్లడించారు. రానున్న మణిరత్నం సినిమా ‘ఓ కే(కాదల్) కన్మణి’ (తెలుగులో ’ఓకే బంగారం’గా వస్తోంది) చిత్రానికి తమిళంలో పాటలు రాసిన ఆయన దీని గురించి మరికొంత వివరణ కూడా ఇచ్చారు. ‘‘మణి (రత్నం) నాకెప్పుడూ మూడు నిమిషాలకు మించి కథ చెప్పలేదు. ఆయన సినిమాల్లోని డైలాగులన్నీ సంక్షిప్తంగా, సూటిగా విషయం చెప్పేలా ఉంటాయి కదా... ఆయన కథ చెప్పే విధానం కూడా అంతే! సరిగ్గా అలాగే ఉంటుంది. అయితే, ఆయన కథ చెప్పడం పూర్తయ్యే సరికల్లా మనకు ఆయన చెబుతున్న కథ తాలూకు సమగ్ర స్వరూపం అర్థమవుతుంది’’అని అత్యధికంగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఈ తమిళ సినీ గీత రచయిత వివరించారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్‌లు జంటగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంపై మణిరత్నం చాలా ఆశలే పెట్టుకున్నారు. ‘‘ఈ సినిమా ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు, వారి ఆలోచనా ధోరణి, వారి మధ్య ప్రేమ చుట్టూ తిరుగుతుంది. మణిరత్నం ఎప్పుడూ స్థూలంగా కథ చెబుతారు. ఇక, వాటికి దృశ్యాలను నాకు నేను ఊహించుకుంటాను. అది మణిరత్నం విలక్షణ బాణీ’’ అని వైరముత్తు తెలిపారు. ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రం మునుపటి మణిరత్నం వెండితెర హిట్ ప్రేమకథల బాణీలోనే విజయం సాధిస్తుందా అన్నది వేచిచూడాలి. -
మణిరత్నం సినిమాకు నాని డబ్బింగ్
మణిరత్నం మీద అభిమానంతో నాని అనువాద కళాకారుడిగా మారిపోయారు. మలయాళ హీరో మమ్ముట్టి తనయుడు, హీరో దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రకు మాట సాయం చేశారు. విషయం ఏంటంటే.. దుల్కర్, నిత్యామీనన్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘ఓకె కన్మణి’ని ‘ఓకె బంగారం’ పేరుతో ‘దిల్’ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇందులో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు. ఆ విధంగా ఈ సినిమా మొత్తం చూసిన నాని, ‘సఖి’ కన్నా గొప్ప విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుందని చెప్పారు. అప్పట్లో మణిరత్నం ‘సఖి’ని నైజామ్‌లో పంపిణీ చేశాననీ, ఇప్పుడీ ‘ఓకె బంగారం’ చిత్రాన్ని అనువదించి, విడుదల చేయడం ఆనందంగా ఉందని ‘దిల్’ రాజు అన్నారు. ఎ.ఆర్. రహమాన్ స్వరపరచిన పాటలను ఈ నెలాఖరునా, చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయనున్నామనీ ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: పి.సి. శ్రీరామ్, పాటలు: సీతారామశాస్త్రి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్.