చెప్పాల్సింది...మూడే నిమిషాల్లో!
మన దర్శక, రచయితల్లో చాలా మంది ఒక కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకుంటారు. డైలాగులతో సహా స్టోరీ అంతా రెండు, మూడు గంటలు వివరంగా చెబితే కానీ, హీరోనూ, నిర్మాతనూ ఆకట్టుకోలేమనీ, వారిని ఒప్పించి, సినిమాను పట్టాలెక్కించలేమనీ భావిస్తుంటారు. కానీ, మణిరత్నం మాత్రం అందుకు విరుద్ధమట. ‘‘మూడే మూడు నిమిషాల్లో కథ చెప్పలేకపోతే, అదే కథే కాదు’’అని ఆయన అభిప్రాయమట. ఆయన అనుసరించే మంత్రం కూడా అదేనట.
సాక్షాత్తూ ఆయనతో సాన్నిహిత్యమున్న గీత రచయిత వైరముత్తు ఈ సంగతి వెల్లడించారు. రానున్న మణిరత్నం సినిమా ‘ఓ కే(కాదల్) కన్మణి’ (తెలుగులో ’ఓకే బంగారం’గా వస్తోంది) చిత్రానికి తమిళంలో పాటలు రాసిన ఆయన దీని గురించి మరికొంత వివరణ కూడా ఇచ్చారు. ‘‘మణి (రత్నం) నాకెప్పుడూ మూడు నిమిషాలకు మించి కథ చెప్పలేదు. ఆయన సినిమాల్లోని డైలాగులన్నీ సంక్షిప్తంగా, సూటిగా విషయం చెప్పేలా ఉంటాయి కదా... ఆయన కథ చెప్పే విధానం కూడా అంతే! సరిగ్గా అలాగే ఉంటుంది.
అయితే, ఆయన కథ చెప్పడం పూర్తయ్యే సరికల్లా మనకు ఆయన చెబుతున్న కథ తాలూకు సమగ్ర స్వరూపం అర్థమవుతుంది’’అని అత్యధికంగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఈ తమిళ సినీ గీత రచయిత వివరించారు. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్‌లు జంటగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రంపై మణిరత్నం చాలా ఆశలే పెట్టుకున్నారు.
‘‘ఈ సినిమా ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు, వారి ఆలోచనా ధోరణి, వారి మధ్య ప్రేమ చుట్టూ తిరుగుతుంది. మణిరత్నం ఎప్పుడూ స్థూలంగా కథ చెబుతారు. ఇక, వాటికి దృశ్యాలను నాకు నేను ఊహించుకుంటాను. అది మణిరత్నం విలక్షణ బాణీ’’ అని వైరముత్తు తెలిపారు. ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రం మునుపటి మణిరత్నం వెండితెర హిట్ ప్రేమకథల బాణీలోనే విజయం సాధిస్తుందా అన్నది వేచిచూడాలి.