ప్రేమ కోసం ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు అంటోంది నటి నిత్యామీనన్. ఈ కేరళా అమ్మడు నటించిన హిందీ చిత్రం మిషన్ మంగళ్ ఇటీవలే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తలైవి(జయలలిత)గా మారడానికి రెడీ అవుతోంది. అంతే కాకుండా రెండు మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. విభిన్న పాత్రల్లో, వైవిద్య చిత్రాల్లో నటించే నటీమణుల్లో నిత్యామీనన్ ఒకరు. మిషన్ మంగళ్ చిత్రంలో ఈమె నటించడానికి కూడా ఇదే కారణం.
కాగా ప్రేమ, పాశం గురించి ఈ సుందరి ఏమంటుందో చూద్దాం. ‘ప్రేమ కోసం వెతుక్కోకండి. అసలు ప్రేమకు మరోకరు అవసరమే లేదు. మనలో మనమే ప్రేమను నింపుకుంటే ప్రపంచమే ప్రేమమయం అవుతుంది. సంతోషంగా ఉన్నవాళ్లు దాన్ని ఇతరులకు పంచుతారు. ప్రేమను కలిగినవారే దాన్ని ఇతరులతో పంచుకుంటారు. ప్రేమ అనేది అనుభవంగా ఉండకూడదు. అది అనుభవించేదిగా ఉండాలి.
నిన్ను ప్రేమించడానికి నీకంటే మంచివాళ్లు ఎవరూ ఉండరు. అసలు ప్రేమ అనేదాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటున్నాం. ఐలవ్యూ అనే మాటను కూడా తప్పుగా భావిస్తున్నాం. ఇతరులపై చూపే ప్రేమాభిమానాలు, మనం మనపై చూపుకునే ప్రేమ అంటూ ప్రేమ పలు రకాలు. ప్రేమ కోసం వెతుకుంటూ ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ప్రేమ అనేది ప్రపంచంలో ఎక్కడో లేదు. అది మనలోనే ఉంది. లోపల ఉన్న దాన్ని బయటకు తీస్తే, అదే నిజమైన ప్రేమ.
ప్రేమ అనేది మననుంచే ప్రారంభం కావాలి. అది మీ వద్ద లేకుంటే ఇతరుల వద్ద లభిస్తుందని ఆశించి పరిగెత్తకూడదు. మనల్ని ఇతరులు గౌరవించాలని భావిస్తున్నాం. ముందు మనల్ని మనమే గౌరవించుకోవాలి’ అని నటి నిత్యామీనన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment