Kadhalikka Neramillai Review: వీర్యదానంతో బాబు పుడితే... | Tamil Movie Kadhalikka Neramillai Movie Review In Telugu | Sakshi
Sakshi News home page

OTT: నిత్యా మీనన్‌ ‘కాదలిక్క నేరమిల్లై’ రివ్యూ

Published Sat, Feb 22 2025 11:05 AM | Last Updated on Sat, Feb 22 2025 11:11 AM

Tamil Movie Kadhalikka Neramillai Movie Review In Telugu

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ప్రేమ.. ఓ చక్కటి ఫీలింగ్‌. ప్రేమ తరువాత పెళ్లి... ఓ థ్రిల్లింగ్‌ ఈవెంట్‌... పెళ్లి తరువాత పిల్లలు... జస్ట్‌ స్ట్రగులింగ్‌... ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. నేటి యువతరం పడుతున్న పాట్లు ఇవి. ఇన్ఫెర్టిలిటీ అనేది నేటి జనరేషన్‌తో పాటు వేగంగా విస్తరిస్తున్న సమస్య. చాప కింద నీరులా ఈ సమస్య మనకు తెలియకుండానే మన కుటుంబాలను, బంధాలను మానసికంగా వేధిస్తోంది. ఆ సమస్య మీదే కాస్త చిలిపిగా రాసుకున్న కథ ‘కాదలిక్క నేరమిల్లై’ (ప్రేమించడానికి సమయం లేదు). ఇది తమిళ సినిమా కానీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ లభ్యమవుతోంది. 

సినిమా అంతా చాలా సరదాగా సాగిపోతుంది. దర్శకురాలు  కృతికా ఉదయనిధి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘జయం’ రవి, నిత్యా మీనన్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... 2017లో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆర్కిటెక్‌ అయిన శ్రియ తను ప్రేమించిన కరణ్‌ను తల్లిదండ్రులను ఎదిరించి రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటుంది. పెళ్లైన కొద్ది సమయంలోనే కరణ్‌ మోసగాడు అని తెలిసి, విడిపోతుంది. కానీ శ్రియకు పిల్లలంటే మహా ఇష్టం. విడిపోయిన కరణ్‌తో అది సాధ్యపడదు కాబట్టి ఐవీఎఫ్‌ పద్ధతిలో పిల్లలను కనాలని నిర్ణయించుకుంటుంది. 

మరో పక్క పెళ్లి, పిల్లలు అనే సిద్ధాంతానికి దూరంగా ఉన్న ఆర్కిటెక్‌ సిధ్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ నిరుపమతో విడిపోవాల్సి వస్తుంది. కొన్ని అనుకోని పరిస్థితుల్లో తాను ఓ స్వచ్ఛంద సంస్థకు వీర్యదానం చేస్తాడు. అనూహ్యంగా సిద్‌ వీర్యంతోనే శ్రియ ఓ పిల్లాడికి జన్మనిస్తుంది. ఆ పిల్లాడి పేరు పార్ధివ్‌. 

పార్ధివ్‌కు ఊహ తెలిశాక తన తండ్రి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇదే టైంలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి సిద్, శ్రియ చెన్నై నగరంలో కలుస్తారు. మరి... తన తండ్రి సిద్‌ అని పార్ధివ్‌ తెలుసుకుంటాడా? సిధ్‌ని పార్ధివ్‌ తండ్రిగా శ్రియ ఒప్పుకుంటుందా? అనేది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాలోనే చూడాలి. ఓ సున్నితమైన పాయింట్‌ని చక్కటి స్క్రీన్‌ప్లేతో సరదాగా తీసుకెళ్లారు దర్శకురాలు. మీకు సమయం ఉంటే ప్రేమ కోసం ప్రేమతో ఈ సినిమాని చూడండి. వర్త్‌ఫుల్‌ వాచ్‌.  
– ఇంటూరు హరికృష్ణ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement