ఐ.ఏ.ఎస్‌ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి | Divya Mittal: IAS officer shared some parenting advice on Twitter | Sakshi
Sakshi News home page

Divya Mittal: ఐ.ఏ.ఎస్‌ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి

Published Tue, Aug 30 2022 12:31 AM | Last Updated on Tue, Aug 30 2022 8:27 AM

Divya Mittal: IAS officer shared some parenting advice on Twitter - Sakshi

ఉత్తర ప్రదేశ్‌ ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ దివ్య మిట్టల్‌

‘మా అమ్మ ముగ్గురు పిల్లలను పెంచింది. ముగ్గురం ఐఐటి చదివాం. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని ఉత్తమమైన సంతానంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాను. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. నేను తెలుసుకున్నవి మీకు చెబుతాను. పనికొస్తాయేమో చూడండి’ అంటూ ఉత్తర ప్రదేశ్‌ ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ దివ్య మిట్టల్‌ రాసిన ట్విట్టర్‌ పోస్టు వైరల్‌ అయ్యింది. ఇంతకీ ఆమె చెప్పిన పాఠాలు ఏమిటి?

‘మా అమ్మ నుంచి నేను పిల్లల పెంపకం నేర్చుకున్నాను. మా అమ్మ ముగ్గురు పిల్లల్ని పెంచింది. ముగ్గురం ఐ.ఐ.టికి వెళ్లాం. నేను ఐ.ఐ.ఎంలో కూడా చదివాను. ఆ తర్వాత 2013 కేడర్‌లో ఐ.ఏ.ఎస్‌ అయ్యాను. నా ఇద్దరు తోబుట్టువులు కూడా బాగా సెటిల్‌ అయ్యారు. ఇదంతా మంచి పెంపకం వల్లే జరిగిందని అనుకుంటున్నాను.

నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని నేను బాగా పెంచాలి. మా అమ్మ నుంచి నేర్చుకున్నవి, నాకు నేనై గ్రహించినవి మీకు చెప్తాను. ఉపయోగపడితే చూడండి’ అని ఉత్తరప్రదేశ్‌ ఐ.ఏ.ఎస్‌ అధికారి దివ్య మిట్టల్‌ రాసిన ట్విటర్‌ పోస్టు (వరుస) ఇటీవల కాలంలో దేశంలో ఎక్కువ మంది మెచ్చిన పోస్ట్‌గా గుర్తింపు పొందింది.

ఉత్తరప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌ నగర్‌ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్న దివ్య మిట్టల్‌ అప్పుడప్పుడు ట్విటర్‌ ద్వారా నలుగురికీ ఉపయోగపడే కిటుకులు, స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తుంటుంది. ఇటీవల ఆమె పేరెంటింగ్‌ గురించి రాసిన పోస్టు కూడా అలాంటిందే.  ఆమె నమ్మి చెప్పిన విషయాలు చాలామందికి నచ్చాయి. అయితే వీటితో విభేదించేవాళ్లు ఉండొచ్చు. ఉంటారు కూడా. కాని ఎక్కువమంది ఇలాగే పెంచాలని భావిస్తారు కాబట్టి దివ్యను మెచ్చుకుంటూ పోస్ట్‌ను వైరల్‌ చేశారు. దివ్య చెప్పిన పెంపకం పాఠాలు ఇలా ఉన్నాయి.

ఏదైనా చేయగలరు అని చెప్పండి:  పిల్లలకు ఆత్మవిశ్వాసం ముఖ్యం. చిన్నప్పటి నుంచి నువ్వు ఏదైనా చేయగలవు అనే భావన వారిలో కల్పించాలి. నిన్ను నువ్వు నమ్ము అని తల్లిదండ్రులు పిల్లలకు తరచూ చెప్పాలి. ఆత్మవిశ్వాసమే వారిని లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో చేరుకోవడంలో సాయం చేయగలదు.

పడనివ్వండి పర్వాలేదు:  పిల్లలకు చిన్న నొప్పి కూడా కలగకుండా పెంచాలని చూడొచ్చు. జీవితం పూలపాన్పు కాదు. పరిష్కార పత్రాలతో అది సమస్యలను తేదు. పడి లేచి అందరూ ముందుకెళ్లాల్సిందే. అందుకే పిల్లల్ని బాగా ఆడనివ్వండి. పడనివ్వండి. లేవనివ్వండి. వాళ్లు పడగానే పరిగెత్తి పోకండి. విఫలమైనప్పుడు లేవడం వారికి తెలియాలి. లేచాక సరే.. పద అని వారితో పాటు ముందుకు పదండి.

పోటీ పడాలి:   వాళ్లను రకరకాల పోటీలలో పాల్గొనేలా చేయండి. గెలవడానికి మాత్రమే కాదు. ఓటమితో తగినంత పరిచయం ఏర్పడటానికి, ఓటమి కూడా ఉంటుందని తెలియడానికి వారు పాల్గొనాలి. ఓటమి కంటే ఓడిపోతామనే భయం ఎక్కువ ప్రమాదకరమైనది. ఓడినా పర్వాలేదు... పోటీ పడాలి అనేది నేర్పించాలంటే ఈ పని తప్పనిసరి.

రిస్క్‌ కూడా ముఖ్యమే:   పిల్లలు రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి సమయాలలో తప్పనిసరి పర్యవేక్షణ చేయండి. అంతే తప్ప అసలు రిస్కే వద్దు అనేలా ఉండొద్దు. అడ్వంచర్‌ స్పోర్ట్స్‌ ఆడతానంటే ఆడనివ్వండి. చెట్టు ఎక్కుతానంటే దగ్గరుండి ఎక్కించండి. అలాంటి సమయాలలో ప్రమాదం ఉందనిపిస్తే పిల్లలు జాగ్రత్త పడతారు. ప్రమాదాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ అనుభవం వారికి నేర్పుతుంది.

బోలెడన్ని అవకాశాలు:  మా చిన్నప్పుడు ఇంత పేదగా ఉన్నాం... అంత పేదగా ఉన్నాం... కాబట్టి నువ్వు బాగా చదువుకుని పైకి రావాలి... ఇలా కొందరు తల్లిదండ్రులు చెబుతుంటారు. అలా చెప్పక్కర్లేదు. ఈ లోకం చాలా పెద్దది... ఎక్కడ చూసినా అవకాశాలు ఉంటాయి... బోలెడంత సంపద ఉంది... నేర్చుకున్న విద్యకు విలువ ఉంటుంది... ఏదో ఒకటి సాధించడం కష్టం కాదు. కాని ఆ సాధించేదేదో పెద్దదే సాధించు అనే విధాన పిల్లలకు స్ఫూర్తినివ్వాలి.

మీరే ఆదర్శం:  పిల్లలకు తల్లిదండ్రులకు మించి రోల్‌మోడల్స్‌ ఉండరు. వారికి మీరే ఆదర్శంగా ఉండండి. మీరు ఒకటి చెప్పి మరొకటి చేస్తూ ఉంటే పిల్లలు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో తెలియక బాధ పడతారు. మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో మీరు వారి ఎదుట అలా ఉండండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

మందలించండి:  పిల్లలు తప్పు చేస్తే మందలించండి. ఇది సరిౖయెన పని కాదు అని గట్టిగా చెప్పండి. తప్పు లేదు. మంచి నడవడిక అంటే ఏమిటో వారికి తెలియాలి.

వారిని నమ్మండి:   మీ అంచనాకు తగినట్టుగా పిల్లలు లేకపోతే నిరాశ చెందకండి. ‘నీ మీద నమ్మకం పోయింది’ అని పిల్లలతో పొరపాటున కూడా అనకండి. మీరే వారిపై నమ్మకం పోగొట్టుకుంటే ఇక వారిని నమ్మేదెవరు. పిల్లలు కుదేలైపోతారు. అందుకని వారికి అవకాశం ఇవ్వండి. ‘నిన్ను నమ్ముతున్నాం. నువ్వు చేయగలవు. పర్వాలేదు. మళ్లీ ప్రయత్నించు’ అని చెప్పండి.

భిన్న అనుభవాలను ఇవ్వండి:  మీ పిల్లలకు లోకం చూపించండి. ఊళ్లు, కొత్త ప్రదేశాలు, అనాథ గృహాలు, సైన్స్‌ ల్యాబ్‌లు, భిన్న రంగాల పెద్దలు ఇలా మీకు వీలైనచోటుకు తీసుకెళ్లి వీలైన వారితో పరిచయం చేయించండి. తిరిగొచ్చేప్పుడు వారితో ఆ విషయాలను మాట్లాడండి. మీ పనుల్లో మీరు ఉండకండి.

వారు చెప్పేది వినండి:  పిల్లలు ఏదైనా చెప్పడం మొదలెట్టగానే నోర్మూయ్‌ నీకేం తెలియదు అనకండి. వాళ్లు శుంఠలనే భావన తీసేయండి. ముందు వారు చెప్పేది పూర్తిగా వినండి. వెంటనే రియాక్ట్‌ కావద్దు. ఆలోచించి అప్పుడు మాట్లాడండి. తాము చెప్పేది తల్లిదండ్రులు వింటారు అనే నమ్మకం పోతే పిల్లలు చెప్పడం మానేస్తారు.

పోల్చకండి:  మీ పిల్లలను ఇతర ఏ పిల్లలతో పోల్చకండి. అలాగే వారి తోబుట్టువులతో కూడా పోల్చకండి. మీరు మీ పిల్లల్లో ఒకరిని గారాబం చేస్తే వారు లోకంలో అంతా ఇంతే సుఖంగా ఉంటుంది అనుకుంటారు. ఎవరినైనా నిర్లక్ష్యం చేస్తే వారు గుర్తింపు కోసం, అంగీకారం కోసం పాకులాడే స్థితికి వెళతారు. కాబట్టి రెండూ వద్దు.

ఇవీ ఐ.ఏ.ఎస్‌ ఆఫీసర్‌ చెప్పిన పెంపకం పాఠాలు. ఇక నిర్ణయం మీదే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement