కేర్... ఇంత
పేరెంటింగ్ టిప్స్
వర్షాకాలంలో నేల చిత్తడిగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో పిల్లలకు తడి నేల మీద జారకుండా పట్టు దొరికే షూస్, చెప్పులు వేయాలి. అడుగు బాగం గరుకుగా, నొక్కులుండాలి. ఎగురుతూ, దూకుతూ ఉంటారు కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తప్పదు. దోమల నివారణకు వాడే కృత్రిమ పరికరాల నుంచి వెలువడే వాయువులు పిల్లలకు ఆరోగ్యకరం కాదు. రాత్రంతా అదే గాలి పీల్చడంతో ఆ దుష్పభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. వీటికి బదులుగా ఒక కప్పు నీటిలో ఒక ముక్క కర్పూరం వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రావు. పైగా దోమలను పారదోలే కృత్రిమ పరికరాలు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి కాబట్టి వీటి వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణానికి కూడా మేలు చేసిన వారవుతారు.
చంటి పిల్లలకు మసాజ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మసాజ్ చేసే ఆయిల్‌ను గోరువెచ్చగా వేడి చేసి వాడాలి. ఫ్రిజ్‌లో ఉన్న వెన్నను బయటకు తీసిన తర్వాత నార్మల్‌గా మెత్తబడినప్పటికీ చల్లదనం ఎక్కువసేపు ఉంటుంది. ఉష్ణోగ్రత చూసుకుని అవసరమైతే మసాజ్‌కు కావలసినంత ఒక కప్పులోకి తీసుకుని వేడిగా ఉన్న పాలగిన్నెలాంటి దాని మీద పెట్టి ఆ తరువాత వాడాలి. చిన్న పిల్లలున్న ఇంట్లో ప్రతి పనినీ కేర్‌ఫుల్‌గానే చేయాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ... ఇంట్లో రోజంతా కేరింతలు ఉండాలంటే ఈ మాత్రం కేర్ తీసుకోవాల్సిందే.