రాజంపేట టౌన్ : గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు లేకపోవడంతో దసరా సెలవుల్లో విద్యార్థులు తమకు తోచిన రీతిలో ఆనందంగా గడపాలన్న ఉత్సుకతతో ఉంటారు. అయితే సంతోషం మాటునే కొన్ని ప్రమాదాలు కూడా పొంచి వుంటాయన్న విషయాన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. పిల్లలు ఆనందంగా గడిపేందుకు వారికి స్వేచ్ఛను ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అయితే వారిని ఒక కంటి కనిపెట్టి ఉంచాల్సిన బాధ్యత మాత్రం తల్లిదండ్రులపై ఎంతైనా ఉందనే చెప్పాలి.
సెలవుల్లో చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారు. మరికొంత మంది విహార యాత్రల పేరిట వివిధ ప్రాంతాలకు వెళుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకు నీటిలో దిగి ఈతకొట్టడం, బైక్ నడపడం నేర్చుకొని.. బైక్ నడిపేందుకు ఎంతో ఇష్టపడతారు. సెలవుల్లో ఈ విషయాలపైనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండాలి. లేకుంటే ఆనందమయం కావాల్సిన సెలవులు విషాదమయం కాగలవు. సెలవుల సందర్భంగా విద్యార్థులు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డ సంఘటనలు అన్నమయ్య జిల్లాలో అనేకం ఉన్నాయి.
పిల్లల పట్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
► ఆడుకోవడానికి ఎక్కువ దూరం పంపకూడదు.
► సమీపంలో ఉండే క్రీడామైదానాల్లోకి వెళ్లినా, వారి వెంట పెద్దలు ఎవరో ఒకరు వెళ్లాలి.
► క్రీడామైదానాల సమీపంలో, ఆడుకునే ప్రాంతాల సమీపంలో చెరువులు, బావులు, తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు వంటివి ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు కూడా పంపక పోవడమే మంచిది.
► ఎత్తయిన భవనాల పైన, శిథిలావస్థలో ఉండే భవనాల్లో ఆటలు ఆడకుండా చూడాలి.
► యువకులు చిన్నపాటి వీధుల్లో కూడా బైక్‌లను వేగంగా నడుపుతుంటారు. అందువల్ల పిల్లలు వీధుల్లోని రోడ్లపై ఆడుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
► ఓ మోస్తారు పిల్లలు బైక్‌లను నడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అందువల్ల తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు బైక్‌లను తీసుకెళ్లి ప్రమాదాల బారిన పడే ప్రమాదముంది. అందువల్ల పిల్లలు బైక్‌లను తీసుకెళ్లకుండా ఉండేందుకు బైక్ తాళాలను పిల్లలకు అందుబాటులో ఉంచకుండా చూసుకోవాలి.
► ప్రస్తుతం చాలా మంది పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్‌ను ఎక్కువ చూసే అవకాశమున్నందున, సెల్‌ఫోన్‌పై వ్యాపకం లేకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలి.
ఇలా చేస్తే మంచిది
► సెలవుల్లో విద్యార్థులు ఇంటి పట్టునే ఉండి ఆడుకునేందుకు క్యారమ్స్, చెస్, వంటి క్రీడలు ఆడుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలి.
► ఇరుగు, పొరుగున ఉన్న పిల్లలందరికీ కూడా క్యారమ్, చెస్ బోర్డులను అందుబాటులో ఉంచితే పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఆడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి.
► తల్లిదండ్రుల్లో ఎవరికో ఒకరికి సమయం ఉంటే పిల్లలను క్రీడా మైదానాలకు తీసుకెళ్లి క్రికెట్, కబడ్డీ, రన్నింగ్ వంటివి ప్రాక్టీస్ చేయిస్తే మరింత మంచిది. ఎందుకంటే ఈ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి.
► ఈతకు వెళ్లడం, బైక్‌లను నడపడం వంటివి చేస్తే చోటు చేసుకునే ప్రమాదాలగురించి పిల్లలకు సున్నితంగా తెలియజేయాలి.
► పిల్లలను ఎగ్జిబిషన్, పార్కులు వంటి ప్రదేశాలకు తీసుకెళ్లాలి. సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన వారికి సమీపంలో ఉండే చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ఇలా చేయడం వల్ల ఒంటరిగా బయటకు వెళ్లాలన్న ఆలోచనలు రావు.
► జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన విషయాలను తెలియ చేయాలి. అలాగే పేదరికం నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న వారి విజయగాధలను విషదీకరించి చెప్పాలి. ఇవి పిల్లల్లో స్ఫూర్తిని కలిగిస్తాయి.
► పడుకునే సమయంలో పిల్లలకు మంచి విషయాలను చెబుతుండాలి. పూర్వం ఉండిన ఉమ్మడి కుటుంబాలు, అప్పట్లో ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలపై తెలియ చేయాలి. ఇవి సన్మార్గం వైపు నడిచేందుకు దోహద పడగలవు. (క్లిక్: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. 21 మంది విద్యార్థుల్లో..)
తల్లిదండ్రులు స్నేహితుల్లా వ్యవహరించాలి
తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహితుల్లా వుండాలి. అప్పుడే ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా తల్లిదండ్రులకు నిర్భయంగా తెలపగలరు. అంతేకాక చెప్పిన విషయాలను కూడా చక్కగా ఆలకిస్తారు. ముఖ్యంగా సెలవుల సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలు బయటికి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది. సెలవుల సమయంలో పిల్లల గురించి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
– శివభాస్కర్‌రెడ్డి, డీఎస్పీ, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment