కాలిఫోర్నియా: ఎనర్జీ డ్రింక్స్... ఇటీవల వీటి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ డ్రింక్స్‌ని ఎక్కువగా తాగుతున్నారు. తక్షణం శక్తి పొందవచ్చనో లేదా స్టైల్‌గా భావించో చాలా మంది వీటిపైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎప్పుడో ఒకసారి వీటిని తీసుకుంటే ఫర్వాలేదు కానీ... అదే పనిగా తాగితే మాత్రం గుండె బేజారవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఈ విషయమై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ఇందులో భాగంగా 18 నుంచి 40 ఏళ్ల వయసు గల 34 మందిని ఎంపిక చేసుకుని వారితో 304 – 320 గ్రాముల కెఫిన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ను తాగించారు. ఆ డ్రింక్ తాగిన వారిలో హృదయ స్పందనలు 6 మిల్లీ సెకన్ల నుంచి 7.7 మిల్లీ సెకన్లకు పెరిగినట్లు గుర్తించారు. హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు జరిగితే అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎనర్జీ డ్రింక్‌లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment