- అభివృద్ధికి నోచని రహదారులు
- ప్రతిపాదనలు దాటని వైనం
- అవస్థల్లో జనం
మచిలీపట్నం టౌన్ : పట్టణంలో పలు రహదారుల అభివృద్ధిని సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో ఆయా రహదారులు ఏళ్ల తరుబడి అభివృద్ధికి నోచుకోపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. పట్టణంలో అధ్వానంగా ఉన్న పలు రహదారులను అభివృద్ధి చేసేందుకు గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పలు రహదారుల పనులు ప్రారంభించి, సగంలోనే ఆపేయడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. మునిసిపల్ అధికారులకు ముందు చూపు లేకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదని ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజుల్లో మునిసిపల్ పాలనా బాధ్యతల్ని స్వీకరించనున్న నూతనంగా పాలకవర్గమైనా రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. పట్టణంలోని 1, 42, 38వ వార్డుల మీదుగా ఉన్న ప్రధాన రహదారిని తారు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులను ప్రారంభించి, మెటల్ రోడ్డు నిర్మించారు. ఆతర్వాత రహదారి తారురోడ్డుగా అభివృద్ధి చేయలేదు.
ఈ రహదారి పనులు మెటల్ రోడ్ స్థాయిలోనే నిలిచిపోయాయి. ఫలితంగా ఈ రహదారికి ఉపయోగించిన రబ్బీష్ కొట్టుకుపోయి కంకరరాళ్లు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం ఈ రహదారి దుక్కిదున్నిన చేనులా కనిపిస్తూ, రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు నరకం చూపిస్తోంది. ఈ రహదారి మీదుగా నిత్యం హౌసింగ్‌బోర్డు, డ్రైవర్స్‌కాలనీ, గుమస్తాల కాలనీ, సుందరయ్య నగర్, టెంపుల్ కాలనీ, వైఎస్సార్ నగర్ వాసులు రాకపోకలు సాగిస్తుంటారు.
అలాగే స్థానిక 38వ వార్డులోని సుందరయ్య నగర్ నుంచి నెహ్రూనగర్, మేదరకాలనీల మీదుగా బైపాస్ రోడ్‌ను చేరుకునే రహదారి కూడా ఇలానే అధ్వానంగా ఉంది. మూడేళ్ల క్రితం ఈ రహదారిని సిమెంట్ రోడ్‌గా జల్ తుఫాన్ నిధులతో అభివృద్ధి చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. ఈ పనులను తక్కువకు టెండర్‌తో దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులను ప్రారంభించి మెటల్ రోడ్ వరకూ పనులను పూర్తి చేశాడు.
అయితే ఈ జల్‌తుఫాన్ నిధులు విడుదల కావనే విషయం తెలియడంతో పనులను కాంట్రాక్టర్ ఆపేయటంతో ఇప్పటికీ సిమెంట్ రోడ్‌గా అభివృద్ధి జరగలేదు. కంకరరాళ్లు లేచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక కేంద్రీయ విద్యాలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉండడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, సిబ్బందితోపాటు ఆ ప్రాంతంలోని పలు కాలనీలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
టెంపుల్ కాలనీ వరకూ సిమెంట్ రోడ్ ఉన్నా, అక్కడి నుంచి ఉన్న రబ్బీష్‌రోడ్ గుంతల మయమై అధ్వానంగా ఉంది. ఈ రోడ్ పల్లంగా ఉండడంతో వానొస్తేచాలు చిన్న పాటి కాలువను తలపిస్తోంది. వర్షపునీటిలో నిండిన రోడ్‌లో ప్రయాణించాలంటే అటుగా వెళ్లే వారు సాహసం చేయాల్సిందే.
ఈ రహదారిని అభివృద్ధి చేసేం దుకు నాలుగేళ్ల క్రితం అప్పటి మునిసిపల్ ప్రత్యేక అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కానీ ఇంజినీరింగ్ అధికారుల ఉదాసీనత వల్ల ఈ రహదారి అప్పటి నుంచీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇలా పట్టణంలోని పలు ప్రాంతాల్లో రహదారులు అభివృద్ధికి నోచలేదు. ఇకనైనా మునిసిపల్ అధికారులు, పాలకులు దృష్టి సారించి రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.