గెలుపెవరిదో? | win of this elecation | Sakshi
Sakshi News home page

గెలుపెవరిదో?

Published Fri, May 9 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

గెలుపెవరిదో?

గెలుపెవరిదో?

  •   సమాలోచనల్లో అభ్యర్థులు
  •   సెలైంట్ ఓటింగ్‌పైనే తర్జనభర్జనలు
  •   అనుయాయులతో కలిసి లెక్కలేస్తున్న అభ్యర్థులు
  •   గెలుపోటములపై భారీ బెట్టింగ్‌లు
  • సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు గెలుపు అవకాశాలపై లెక్కల్లో మునిగిపోయారు. తమకు అనుకూల, ప్రతికూల అంశాలు ఏమిటి.. పోలింగ్ సరళి ఎవరికి లాభించే అవకాశముందనే అనే అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఓటర్ల సెలైంట్ ఓటింగ్ కూడా అభ్యర్థులను కలవరపెడుతోంది. సెలైంట్ ఓటింగ్ ఎటు పడిందో అంచనా వేయడం కష్టంగా మారడంతో అభ్యర్థులు ఇప్పుడు లెక్కలు కట్టే పనిలో పడ్డారు. మరోపక్క సీమాంధ్ర అంతటా ఫ్యాన్‌గాలి సెలైంట్‌గా వీచిందని, వైఎస్సార్‌సీపీకి అనుకూల పవనాలు వీచాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల తంతు ముగిసినప్పటికీ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిలాక్స్ కాలేదు. ప్రతి నియోజకవర్గంలోనూ ప్రధాన అభ్యర్థులు గురువారం ఉదయం నుంచే ఓట్ల లెక్కలు కట్టే పనిలో పడ్డారు. తమ అనుయాయులతో కూర్చుని అనుకూల, ప్రతికూల పరిస్థితులను బేరీజు వేస్తూ ఓట్ల కూడికలు, తీసివేతల లెక్కల్లో నిమగ్నమయ్యారు. తమ నియోజకవర్గాల పరిధిలోని కీలక నాయకులను పిలిపించుకుని ఆంతరంగిక సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. గ్రామాలు, మండలాలు, వార్డులు, బూత్‌ల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయి.. ఎన్ని పోలయ్యాయి.. వాటిలో ఎవరికెన్ని ఓట్లు వస్తాయి.. తదితర కోణాల్లో అంచనాలు వేస్తున్నారు.

    సెలైంట్ ఓటింగ్‌పై టీడీపీలో కలవరం...

    జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల నడుమ ప్రధాన పోరు సాగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పురిటిగడ్డలో ప్రస్తుత పరిస్థితి ఆ పార్టీకి మింగుడుపడటం లేదు. సెలైంట్ ఓటింగ్ తమ కొంప ముంచుతుందని టీడీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అదే జరిగితే జిల్లాలో చాలా సీట్లు గల్లంతయ్యే      ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థులు తమ అనుయాయులతో కలిసి ఓట్ల లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ‘గాలి ఎటువైపు వీచిందంటావ్’ అంటూ ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సైతం తమ అనుయాయులతో కలిసి ఓట్ల శాతం, పోలింగ్ సరళి, సమీకరణలు వంటి వాటిని బేరీజు వేస్తున్నారు. ఓటింగ్ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి బలాబలాలు అంచనా వేస్తున్నారు.
     
    బెట్టింగ్‌ల జోరు..
     
    మరోపక్క ఎన్నికల పోలింగ్ ముగియడంతో పందేల రాయుళ్ల జోరు మొదలైంది. ఎన్నికల ఫలితాలపై పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహించేందుకు క్రికెట్ బుకీలు రంగంలోకి దిగారు. దీంతో దేశంలోను, రాష్ట్రంలోను ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ బుకీల వ్యవస్థ మళ్లీ పుంజుకుంది. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం వరకు టీడీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున సాగిన పందేలు పోలింగ్ అనంతరం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారిపోయాయి. సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందని, 110 నుంచి 140 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 21 ఎంపీ సీట్లు వైఎస్సార్‌సీపీకి వస్తాయని పెద్ద ఎత్తున పందేలు సాగుతున్నాయి. జిల్లాలోనూ ఎక్కువ స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని పందేలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, అభ్యర్థుల ఓట్లు, మెజార్టీలు తదితర అంశాలపై కూడా బెట్టింగ్‌లు వేయడం గమనార్హం.
     
    విశ్రాంతి కోసం విహార యాత్రలకు సిద్ధం..

     
    వరుస ఎన్నికలతో అలిసిపోయిన రాజకీయ పార్టీల నేతలు, కేడర్ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. గురువారం జిల్లా అంతటా బలాబలాలపై లెక్కలు కట్టిన అభ్యర్థులు రానున్న రెండు రోజుల్లో దూర ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకునే యోచనలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, పార్టీ ముఖ్య నేతలతో మరికొందరు అభ్యర్థులు విహారయాత్రలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 12న మున్సిపాలిటీలు, 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో ఈ లోగానే విహార యాత్రలు పూర్తిచేసుకునేలా కొంతమంది, ఫలితాలు తేలాకే వెళ్లేలా మరికొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement