
సాక్షి, అమరావతి: కృష్ణపట్నం, విజయవాడలో నిర్మాణంలో ఉన్న థర్మల్ యూనిట్లను వేగంగా పూర్తి చేయాలనిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన ఎనర్జీ డిపార్ట్‌మెంట్, విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల పని తీరుపై క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై ఇస్తున్న కరెంటు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా ఇస్తున్న కరెంటు సరఫరాపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటికి నిధులను సకాలంలో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రణాళిక వేసుకోవాలని ఆర్థికశాఖ అధికారులకు సూచించారు. థర్మల్ యూనిట్ల నిర్మాణం దీర్ఘ కాలం పాటు కొనసాగితే అవి భారంగా తయారవుతాయని తెలిపారు. సత్వరమే నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మేలు జరుగుతుందని అధికారులకు సూచించారు.
విద్యుత్ కొరత లేకుండా చూసుకొండి
వేసవి దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిపై సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వచ్చే మూడు, నాలుగు నెలల్లో విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా ఎంతమేరకు విద్యుత్ అవసరమవుతుందో ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. జెన్‌కో ఆధ్వర్యంలో నడుస్తున్న 15యూనిట్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బొగ్గు సరఫరాపై నిరంతరం సమీక్ష చేసి అవసరాలకు అనుగుణంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ఇంధనశాఖ ఎక్స్ అఫిసియో ప్రిన్సిపల్ సెక్రటరీ జీ సాయిప్రసాద్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: ప్రైవేటీకరించవద్దు.. నిర్ణయం మార్చుకోండి: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment