
ఆగేనా.. జరిగేనా..
వాయిదాపై చివరి ఆశ
వాయిదా కోరుతూనే ఏర్పాట్లు
యథావిధిగా షెడ్యూల్ అమలు
హైదరాబాద్‌లో కలెక్టర్, ఎస్పీ
సుప్రీంకోర్టు నిర్ణయంపై అందరి ఆసక్తి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై నేడు నిర్ణయం
సాక్షి, మచిలీపట్నం : స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాల్సిన పాలకులు ఏళ్ల తరబడి సాచివేత ధోరణి అవలంబించారు.. చివరకు సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించాక ఎన్నికలు జరిపే పరిస్థితి వరకు తీసుకొచ్చారు.. పాలకుల వైఫల్యం కారణంగా నిలిచిన ఎన్నికలను వరుసగా నిర్వహించడం యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది.. మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదించడంతో ఎన్నికలు జరుగుతాయా, ఆగుతాయా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఎందుకు కష్టమనే విషయాలపై లిఖితపూర్వకంగా తెలియజేయాలని, దానిపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రెండురోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు అటు అధికారుల్లోను, ఇటు రాజకీయ పార్టీల నేతల్లోను ఆశలు రేపుతున్నాయి. దీంతో జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వాయిదా పడితే బాగుండు అనుకునే అధికార యంత్రాంగానికి, పార్టీలకు, ఆశావహులకు నేడు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు, మే 7న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎన్నికల నిర్వహణపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.రఘునందనరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నదీ జిల్లాకు చెందిన ఇద్దరు కీలక అధికారులు ఎన్నికల కమిషన్‌కు నివేదించారు.
మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలకు తోడు జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. గత శుక్ర, శనివారాల్లో జిల్లాలోని జెడ్పీ చైర్మన్, 49 మండలాల ఎంపీపీలు, 49 జెడ్పీటీసీలు, 836 ఎంపీటీసీల రిజర్వేషన్‌లను ఖరారు చేసి విడుదల చేశారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనంటూ ఎన్నికల కమిషన్ ఈనెల 10న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి నామినేషన్‌లను స్వీకరించి ఏప్రిల్ 6న జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపును చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసినా మరోవైపు అవి వాయిదా పడితే బాగుంటుందన్న ఆశలు అటు అధికారుల్లోను, ఇటు రాజకీయ పార్టీల్లోను చిగురిస్తున్నాయి.
భారమే అంటున్న అధికారులు, నేతలు..
వరుస ఎన్నికల నిర్వహణ ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పలువురు అధికారులు వాపోతున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో వాటి ఫలితాలు తమపై పడే ప్రమాదం ఉందని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు మధనపడుతున్నారు. దీనికితోడు తమ ఎన్నికలకు ముందే వచ్చే మున్సిపల్, స్థానిక పోరులో ఆయా పార్టీల అభ్యర్థులను దించి వారి విజయం కోసం తామే వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తుందని ఎంపీ, ఎమ్మెల్యే ఆశావహులు ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని వారంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.