
జగన్ ఆదేశం.. కార్యకర్తల అభీష్టం పోరుకు పేర్ని నాని సిద్ధం
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు, అనుక్షణం తనకు వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తల అభీష్టం మేరకు మచిలీపట్నం...
- జగన్ ఆదేశం.. కార్యకర్తల అభీష్టం
- పోరుకు పేర్ని నాని సిద్ధం
సాక్షి, మచిలీపట్నం : ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు, అనుక్షణం తనకు వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తల అభీష్టం మేరకు మచిలీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను..’ అని ఆ పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) స్పష్టం చేశారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదనే జగన్‌మోహన్‌రెడ్డికి, కార్యకర్తలకు లేఖ రాసి పోటీనుంచి విరమించుకోవాలనుకున్నానే తప్ప ఎవరినో పార్టీలో చేర్చుకున్నందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
వైఎస్ కుటుంబానికి అండగా ఉండాలని ఏడాదిన్నర పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవిని వదిలేశానని వివరించారు. మంత్రి స్థాయి హోదా కలిగిన విప్ పదవిని కాదనుకున్నానని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నష్టం కలిగించే పని ప్రాణం ఉన్నంతవరకు చేయబోనని స్పష్టం చేశారు. అందరి అభీష్టం మేరకు ఈ నెల 19న నామినేషన్ వేస్తానని వెల్లడించారు.
ఆర్థిక కారణాలతో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయలేనని నాని రెండు రోజుల క్రితం ప్రకటించటంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పేర్ని అభిమానులు ఆయన ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ఆయన సోమవారం బందరు చేరుకుని కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయనను చుట్టుముట్టిన పార్టీ శ్రేణులు చందాలు వేసుకునైనా, తల తాకట్టు పెట్టి అయినా మిమ్మల్ని మేము గెలిపించుకుంటామంటూ పట్టుబట్టారు. అదే సమయంలో గుడివాడ తాజా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొడాలి నాని వచ్చి కార్యకర్తల సమక్షంలోనే పేర్ని నానితో మాట్లాడి పోటీకి ఒప్పించారు.
మీడియా కథనాలు బాధ కలిగించాయి...
అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఆర్థిక కారణాలతో తాను పోటీకి వెనకాడితే.. వాస్తవ విషయాలను వక్రీకరించి కొన్ని మీడియా సంస్థలు ఈ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని తనను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించటం తనకెంతో బాధ కలిగించిందన్నారు. బందరు నియోజకవర్గంలో రెండు పర్యాయాలు గెలిచిన తాను ఇక్కడ ప్రజలకు తగినంత సేవ చేసే అవకాశం వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్యల హయాంలోనే కలిగిందని వివరించారు.
వారిద్దరికీ ఎప్పుడూ రుణపడి ఉంటానని చెప్పారు. బందరు నియోజకవర్గంలో తాను తలపెట్టిన పనుల్లో పోర్టు, డ్రెయినేజీ వంటి వాటిని పూర్తి చేయకుండా అడ్డుతగిలిన వ్యక్తి ఇప్పుడు రెండు చెప్పులు పట్టుకుని ఓటు అడిగేందుకు ప్రజల్లోకి వచ్చారని నాని అన్నారు. గెలుపోటముల రుచులను చూసిన తాను ఈ ఎన్నికల్లో ఏదైనా గుండె నిబ్బరంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అయితే ఇటీవల మునిసిపల్, పరిషత్ ఎన్నికలు చూసి డబ్బు ఖర్చు పెట్టలేక.. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా నష్టపోకూడదనే ఆందోళనతో పోటీ నుంచి తాను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఏదేమైనా అధినేత ఆదేశం, కార్యకర్తల అభిమానం మేరకు 19న నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
పార్టీ అండగా ఉంటుంది : కొడాలి నాని
వైఎస్సార్‌సీపీ కుటుంబంలో పేర్ని నాని ఒకరని, ఎటువంటి పరిస్థితినైనా ఆయనకు అండగా ఉంటామని పోటీచేయాల్సిందేనని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించటంతో తాను ఆయన్ని ఒప్పించేందుకు వచ్చానని కొడాలి నాని చెప్పారు. ఈ నెల 8న అధినేతను తనతో పాటు కలిసిన పేర్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎన్నికల్లో పోటీచేయలేననే విషయాన్ని చెప్పారని ఆయన వివరించారు.
అదే సమయంలో జిల్లాకు సంబంధించిన లోక్‌సభ, శాసనసభ స్థానాలకు గెలిచే అభ్యర్థులు ఎవరినైనా పార్టీలో చేర్చుకునే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అధినేతకు పేర్ని స్పష్టం చేసినట్లు తెలిపారు. ఇంతమంది ప్రజలు, కార్యకర్తల అభిమానం ఉన్న పేర్ని నాని లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాలని, ఆయనకు జగన్‌మోహన్‌రెడ్డి అండదండలు ఎప్పుడూ ఉంటాయని కొడాలి నాని అన్నారు. ఆయనవెంట ఉప్పాల రాము కూడా ఉన్నారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ శ్రేణులు నాని నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు.