తిన్నా నీరసమే.. తినక పోయినా నీరసమే..
తిన్నా నీరసమే.. తినక పోయినా నీరసమే..
Published Tue, Sep 19 2017 11:48 PM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM
భీమవరం టౌన్:
’’గంగ గోవు పాలు గరిటడైనను చాలు.. కడవడైన నేమి ఖరము పాలు..’’ అని వేమన ఏనాడో చెప్పారు. సంఘం మేలు కోరి ఎన్నో హితవచనాలు పలికారు. అవన్నీ మనం పట్టించుకోకుండా అధునిక ప్రపంచం, పద్ధతులు అంటూ ఎన్నో కొత్త అలవాట్లు చేసుకున్నాం, చేసుకుంటున్నాం. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. జిల్లాలో 39 లక్షల జనాభా ఉంది. ఆహారం తీసుకోవడంలో పరిమాణం చూస్తున్నామే గాని, వాటి వల్ల ఎంతమేరకు ఉపయోగకరం అనేది పట్టించుకోవడం లేదు. దాంతో జబ్బులతో ఇబ్బందులు పడుతున్నాం. చిన్నపాటి పనులు కూడా చేసుకోలేక నీరసించి పోతున్నాం. ఇందుకు ఉదాహరణే కింద ఉదహరిస్తున్న ఆలుమగల సంభాషణ.
భార్య: చూడు ఆ వయస్సులో కూడా ఎంత బలంగా, చలాకీగా ఉన్నాడో..
భర్త: అవునవును పూర్వకాలం తిండి. అందుకే ఈ వయస్సులో కూడా ఇలా
ఉన్నాడు. 80 ఏళ్లు పైబడే ఉన్నట్లు కనిపిస్తోంది.
భార్య: మనమూ ఉన్నాం. ముప్పూటలా తిన్నా నీరసమే.. తినకపోయినా
నీరసమే. అప్పట్లో మా తాత కుండడు అన్నం, ఒక కోడి, 50 గారెలు,
20 బూరెలు ఒకేసారి తినేసేవాడట మా నానమ్మ చెప్పేది. అదేమిటో
వాళ్లకీ మనకీ వ్యత్యాసం అర్థం కావడం లేదు.
భర్త: అప్పుడూ ఇప్పుడూ అదే అన్నం, పప్పు, కాయగూరలు, ఆకుకూరలు,
మాంసం, చేపలు, రొయ్యలు, పీతలు, పచ్చళ్లు, పాలు, పెరుగు, నెయ్యి
అన్నీ తింటున్నాం కదా అయినా ఎందుకు ఇంత నీరసంగా ఉంటున్నామని
ఆలోచిస్తున్నావా? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చెబుతా విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.
’’అమ్మచేతి గోరుముద్ద, నానమ్మ చేసిన సున్నుండ, అమ్మమ్మ పట్టిన ఊరగాయ ఇప్పుడెక్కడివి. అంత తీరిక సమయం ఎవరికీ లేదు. నరం లేని నాలుక కోరుకునే రుచులకు అలవాటుపడి ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్‌లపై ఆధారపడుతున్నాం. టేస్టింగ్ సాల్ట్ వంటకాలు. రంగులు కలిపిన స్వీట్లు, పోషక విలువలు లేని పిజ్జాలు, బర్గర్ల బాట పడుతున్నారు. మరోవైపు పాలు, నెయ్యి, నూనెలు, పప్పు, బియ్యం, ఇలా అన్ని కల్తీమయమే. దంపుడు బియ్యం బలం నేడు ఎవరికీ తెలియదు. అంతా పాలిష్ బియ్యం. పురుగు మందులతో తడిచి ముద్దయిన ఆకు, కూరగాయలు. ఇంటి పెరట్లో, పొలం గట్టున సహజ సిద్ధంగా పెంచిన కూరగాయలు, ఆకుకూరలు ఇప్పుడు గగనమయ్యాయి. సెంటు స్థలం ఉంటే ఒంటి స్తంభం మేడ నిర్మాణం, పొలాలను కనుమరుగు చేసి ఆక్వా చెరువులు, రియల్ ఎస్టేట్ ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు. పల్లెల్లో పాలు, పెరుగు, కూరగాయలు తీసుకోండి వదినా, అక్కా అంటూ ఒకప్పుడు ఇచ్చిపుచ్చుకునే వారు. ఇప్పుడు నీళ్లు కలిసిన పాలు, పిండి పాలు, ఇక ఒంట్లో బలమెక్కడ ఉంటుంది. పంటకాలువల్లో అప్పటికప్పుడు పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు, పెరట్లో పెంచిన నాటుకోళ్లు, అవిపెట్టిన గుడ్లు ప్రతీ ఇంటా తినేవారు. పదిమందికి పంచేవారు. మరి ఇప్పుడో పురుగుమందుల అవశేషాలున్నాయని బెంబేలెత్తిస్తున్న చేపలు, రొయ్యలు, తలవాల్చే తెల్లకోళ్లు. అవిపెట్టే గుడ్లు. ఇంకెక్కడ పోషక విలువలున్న పౌష్టికాహారం. నచ్చిన కూరతో కొంచెం గట్టిగా ఓపట్టు పడితే ఓ మాత్ర, ఆ తరువాత గ్యాస్‌కు ఓ మాత్ర, అయినా మంట తగ్గకపోతే సిరప్, ఇది నేటి మన తిండి తిప్పలు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు సేంద్రియ సేద్యం అంటూ పూర్వ వైభవం, ఆరోగ్యం కోసం పరుగులు పెడుతున్నాం’’ అని వివరించాడు భర్త. ఇకనుంచి మనమూ రసాయనాలు లేని, కల్తీలేని, సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం అంది భార్య.
ఇది ఆ భార్యభర్తల ఆలోచనే కాదు. నేటి సమాజంలో చాలామందిలో వస్తున్న మార్పు. తీసుకునే ఆహారం విషయంలో సహజసిద్ధమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఈ మార్పు ముదావహమే గదా.
జిల్లా జనాభా, వినియోగించే పరిణామం ఆధారంగా లెక్కిస్తే జిల్లాలో ఆహార పదార్థాల వినియోగం నెలకు ఇలా ఉంది.
జిల్లా జనాభా: 39,95,742
మటన్ 200 టన్నులు
చికెన్ 420 టన్నులు
రొయ్యలు 200 టన్నులు
పీత 50 టన్నులు
చేప 400 టన్నులు
గుడ్లు 6 కోట్లు
బియ్యం 30 వేల టన్నులు
కందిపప్పు 2,420 టన్నులు
పెసరపప్పు 1200 టన్నులు
పాలు 3.60 కోట్ల లీటర్లు
Advertisement
Advertisement