
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ మిత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్ డాలర్ల డీల్‌తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. ప్రస్తుతం మిత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెన్యూవబుల్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.
పిరమల్ గ్రూప్ రుణం చెల్లింపు..
మిత్రా ఎనర్జీ సంస్థ 2017 సెప్టెంబర్‌లో పిరమల్ గ్రూప్ నుంచి నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా రూ.1,800 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌తో డీల్ ఉపయోగపడుతుందని.. వాస్తవానికి ఈ డీల్ సక్సెస్‌లో రీ పేమెంటే ప్రధానంగా నిలవనుందని తెలిసింది. అయితే ఈ డీల్ గురించి ఇరు వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.