
అనావృష్టి
వరుణుడు కరుణ చూపడం లేదు. జూలైలోనూ ఎండలు వేసవిని తలపించేలా కాస్తున్నాయి. వడగాలులు రోహిణీని తలపిస్తున్నాయి. గత పదేళ్లతో పోల్చితే జిల్లా సగటు వర్షపాతం ఈ ఏడాది అతి తక్కువగా నమోదైంది.
- గత పదేళ్లలో ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదు
- జూలైలోనూ వడగాడ్పులు
- ఒక్క ఎకరంలోనూ వరినాట్లు పడలేదు
వరుణుడు కరుణ చూపడం లేదు. జూలైలోనూ ఎండలు వేసవిని తలపించేలా కాస్తున్నాయి. వడగాలులు రోహిణీని తలపిస్తున్నాయి. గత పదేళ్లతో పోల్చితే జిల్లా సగటు వర్షపాతం ఈ ఏడాది అతి తక్కువగా నమోదైంది. జిల్లా అంతటా అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పచ్చటి పైర్లతో కళకళలాడాల్సిన పంట పొలాలు నేడు బీడు భూములను తలపిస్తున్నాయి.
మచిలీపట్నం : ఈ ఏడాది మే నెలలో మురిపించిన వర్షాలు ఆ తర్వాత జాడ లేకుండా పోయాయి. జూలై నెల వచ్చేసినా వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. జూలై ఒకటి నుంచి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనట్లు లెక్కిస్తారు. ఈ సీజన్ నవంబరు వరకు కొనసాగుతుంది. జూన్‌లో జిల్లాలో సగటు వర్షపాతం 97.4 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది.
ఈ ఏడాది కేవలం 28.2 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కన్నా 69.2 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా నమోదవడంతో పాటు జూలైలోనూ వడగాలులు వీస్తున్నాయి. దీంతో పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. దీంతో బోరునీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనూ వరి నారుమడులు పోసేందుకు సైతం రైతులు సాహసించలేకపోతున్నారు. జూలై నాలుగో తేదీ నాటికి కూడా జిల్లాలో ఒక మిల్లీమీటరు వర్షపాతం కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
అదును దాటుతోంది...
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో వ్యవసాయానికి అదును తప్పుతోందని రైతులు ఆందోళన చెబుతున్నారు. జూలై మొదటి వారంలోనైనా నారుమడులు పోసుకుంటే ఆగ స్టు మొదటి వారంలో వరినాట్లు పూర్తిచేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆగస్టులో వరినాట్లు పూర్తికాకుంటే ఖరీఫ్ వరిసాగుకు సమయం చాలదని రైతులు అంటున్నారు. ఖరీఫ్ సీజన్‌లో సాగుచేసే వరి వంగడాలు కనీసంగా 150 రోజులకు పైబడి కోతకు వస్తాయని, దీంతో సాధారణంగా నవంబరు 15 తరువాత వరికోతలు ప్రారంభమవుతాయని రైతులు భావిస్తున్నారు.
కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సీజన్‌కు సాగునీటిని ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రభుత్వం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. సాగునీటి విడుదల తేదీని ఎప్పటికి ప్రకటిస్తారనే అంశంపై రైతుల్లో అయోమయం నెలకొంది. 2012లో అక్టోబరులో, 2013లో ఆగస్టులో కాలువలకు అధికారికంగా సాగునీటిని విడుదల చేశారు. ఈ రెండు సంవత్సరాల్లో కృష్టానదికి ఉప నదులుగా ఉన్న వజినేరు, మున్నేరు, కొండవీటి వాగు, కట్టలేరు తదితర వాగుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురవడం, ఆ నీరు కృష్ణానదిలోకి చేరడంతో వాటినే ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువలకు సాగునీరుగా వదిలారు.
ఈ ఏడాది పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. అసలు వర్షాలే కురవకపోవడంతో ఉప నదుల నుంచి నీరు వచ్చి చేరే పరిస్థితి లేదు. నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి అధికారికంగా సాగునీరు ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులు, పాలకులు స్పష్టత చెప్పలేకపోతున్నారు. ఆకాశంలో మబ్బులు ఉసూరుమనిపిస్తున్నాయి. వాయుగుండం పడితేనే వర్షం కురుస్తుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు సకాలంలో కురవకుంటే 2002, 2003 నాటి పరిస్థితులు తలెత్తి ఒక్క పంటకే పరిమితం అవుతామనే భయం రైతులను వెంటాడుతోంది.
అతి తక్కువ వర్షపాతం నమోదు
జూన్‌లో 97.4 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం జిల్లాలో నమోదు కావాల్సి ఉంది. ఈ ఏడాది కేవలం 28.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత పదేళ్లలో వ్యవధిలో పరిశీలిస్తే ఇదే అతితక్కువ వర్షపాతం కావడం గమనార్హం. జూన్‌లో గత పదేళ్లుగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.