దేశీయంగా 2030 నాటికి 440 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఏటా రూ.మూడు లక్షల కోట్లు అవసరమని ఇక్రా తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ(ఇక్రా) ఈమేరకు నివేదిక విడుదల చేసింది. పునరుత్పాదక ఇంధన రంగం ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదికలో తెలిపింది.
ఇక్రా గ్రూప్ కార్పొరేట్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ వి.విక్రమ్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారతదేశం 440 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని నిర్ణయించింది. అందుకోసం ఏటా రూ.మూడు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 200 గిగావాట్లుగా ఉన్న పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వచ్చే ఆరేళ్లలో రెట్టింపు అవ్వాల్సి ఉంది. ప్రధానంగా ఈ రంగంలో ఎనర్జీ స్టోరేజీ, గ్రిడ్ ఇంటిగ్రేషన్ వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి కొత్త వాహనాల విక్రయాల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 25 శాతం వాటాను కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, బస్సులు వరుసగా 40 శాతం, 30 శాతంగా ఉంటాయి. వీటి కోసం భవిష్యత్తులో విద్యుత్ వినియోగం పెరుగుతుంది’ అన్నారు.
ఇదీ చదవండి: జీఎస్‌టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చ
దేశీయంగా పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా తయారీ ఊపందుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో విద్యుత్తు తయారీకి ఇప్పటికీ అధికం శాతం భారత్‌లో బొగ్గునే వినియోగిస్తున్నారు. క్రమంగా దీన్ని పునరుత్పాదక ఇంధనంతో భర్తీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ దిశగా ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు పెంచుతున్నారు. దేశంలో కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ప్లేట్లను ఏర్పాటు చేసి 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రణాళికలు ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment