కిటికీలతోనే ఇంటికి కావాల్సిన విద్యుత్తు అంతా ఉత్పత్తి చేయగలిగితే ఎలా ఉంటుంది. సౌరశక్తితో కొంత విద్యుత్తు సాధ్యమేగానీ.. అంతా ఎలా అని ఆశ్చర్యపోనక్కరలేదు. ఆ అద్భుతం త్వరలోనే నిజం కానుంది. అంతా పోలండ్ శాస్త్రవేత్త ఓల్గా మలినికివజ్ పరిశోధనల ఫలితం. అత్యంత చౌక సోలార్ ప్యానెల్స్‌ను తయారు చేసేందుకు ఈ లేడీ శాస్త్రవేత్త ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించారు మరి. పెరోవోస్‌స్కైట్స్ అనే సేంద్రీయ పదార్థం ద్వారా సౌరశక్తిని ఒడిసిపట్టవచ్చునని చాలాకాలంగా తెలిసినప్పటికీ అవన్నీ వ్యయప్రయాసలతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఓల్గా పెరోవోస్‌స్కైట్స్ సోలార్ సెల్స్‌ను అతితక్కువ ఉష్ణోగ్రతల్లోనే తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశారు.
సాధారణ ఇంక్‌జెట్ ప్రింటర్ ద్వారా మనం అక్షరాలను ముద్రించినంత సులువుగా సోలార్ సెల్స్‌ను, ప్యానెల్స్‌ను ముద్రించుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా.. అన్నిరకాల ఉపరితలాలపై దీన్ని అతికించుకోవచ్చు. స్వీడన్‌కు చెందిన స్కాన్‌స్కా ఈ కొత్త పద్ధతి ద్వారా తయారు చేసిన సోలార్ ప్యానల్స్‌ను పోలండ్‌లోని వార్సా నగరంలోని భవనంపై అతికించి పరిశీలిస్తోంది. దాదాపు 1.3 చదరపు మీటర్ల సైజున్న ప్యానెల్‌తో ఒక పీసీ రోజంతా పనిచేసేంత విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని. తయారీకయ్యే ఖర్చు 4 – 4.5 వేలకు మించదని అంచనా.
గుండెజబ్బులనుగుర్తించేందుకు కొత్త పద్ధతి
గుండెజబ్బు వచ్చే అవకాశాన్ని ముందుగా గుర్తించగలిగితే ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడవచ్చునన్నది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పటివరకూ ఆ అవకాశం లేకుండా పోయింది. ఛాతి, భుజం లేదా ముఖంలోని ఒక పార్శ్వంలో నొప్పి వస్తే.. అర్జెంటుగా ఆసుపత్రిలో చేరడమే ప్రస్తుతం మనం చేయగలిగిన పని. అయితే డ్యూక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ఒక పరిశోధన పుణ్యమా అని ఇప్పుడు ఈ పరిస్థితి మారనుంది. రక్తనాళాలల్లో పూడికలను చాలాముందుగానే గుర్తించేందుకు వీరో ఒక పద్ధతిని ఆవిష్కరించారు.
ట్రెడ్‌మిల్ పరీక్షల తరువాత రెండు గంటలకు కొంతమంది రక్తాన్ని పరిశీలించినప్పుడు కనీసం ఐదు రకాల జీవరసాయనాల్లో మార్పులు గుర్తించారు శాస్త్రవేత్తలు. కొవ్వులు, అమినోయాసిడ్ల వంటి ఈ రసాయనాల్లో వచ్చిన మార్పులను మరింత కచ్చితత్వంతో గుర్తిస్తే రక్తప్రసరణలో ఏదో తేడా ఉన్నట్లు స్పష్టమవుతుందని... ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ టి. లింకాకెంగ్ అంటున్నారు. శరీరంలోకి నాళాన్ని పంపించాల్సిన అవసరం తగ్గుతుందని వివరించారు. మరింత విస్తత స్థాయిలో అధ్యయనం చేసేందుకు డ్యూక్ శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment