నీళ్లన్నాక.. వేడి ఉన్నాక... ఆవిరి అవడం సహజం. మేఘాలు ఏర్పడేందుకు, వానై వర్షించేందుకు ఆవిరి అవసరం కూడా. కానీ.. నీరు ఆవిరైపోవడం మనకు ఇంకో ప్రయోజనమూ కల్పిస్తే..? అది కూడా పర్యావరణానికి ఎలాంటి హానీ కలిగించని రీతిలో బోలెడంత కరెంటు ఉత్పత్తి చేసేదైతే? అద్భుతాలు సాక్షాత్కారమవుతాయి. విషయం అర్థమైపోయిందిగా.. ఫొటోలో ఉన్నది అలాంటి ఓ యంత్రమే. కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త ఓజ్‌గుర్ సహీన్ సిద్ధం చేశాడీ యంత్రాన్ని. ఆవిరితో విద్యుత్తు ఎలా అన్న అనుమానం అక్కరలేదు. దీని కోసం ప్రత్యేకమైన బ్యాక్టీరియాలను వాడుతున్నారు. యంత్రంలో పసుపు పచ్చ రంగులో చిన్న చిన్న టేపులు కనిపిస్తున్నాయి చూడండి.. వాటిపై ఉంటుంది బ్యాక్టీరియా. తేమ తగిలితే ఉబ్బిపోవడం.. లేదంటే బక్కచిక్కి పోవడం వీటి ప్రత్యేకత.
ఈ సూక్ష్మమైన కదలికలను ఒడిసిపట్టడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చునని సహీన్ రెండేళ్ల క్రితమే ప్రతిపాదించాడు. అమెరికాలోని చెరువులు, సరస్సుల వంటి జల వనరులపై ఈ యంత్రాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో 70 శాతం అక్కడి నుంచే పుట్టించవచ్చునని కూడా ప్రకటించాడు. అప్పట్లో యంత్రాన్ని తయారు చేయలేదు కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదుగానీ.. సహీన్ తాజాగా ఆవిరిని విద్యుత్తుగా మార్చే యంత్రాన్ని తయారు చేయడంతో ఈ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ ఆవిరి విద్యుత్తు యంత్రాలు ఎంతో ఉపయోగకరమని సహీన్ మద్దతుదారులు అంటూంటే.. నీటి ఆవిరిని అడ్డుకోవడం వల్ల భవిష్యత్తులో ప్రకృతి సహజమైన జలచక్రంలో తేడాలొస్తే ఏం చేయాలని ఇతరులు ప్రశ్నిస్తున్నారు. సహీన్ మాత్రం ఈ యంత్రాలతో మేఘాలు ఏర్పడే ప్రక్రియ వల్ల నష్టమేమీ ఉండదంటున్నారు. ఇలాంటి యంత్రాలు అందుబాటులోకి వస్తాయో రావో ప్రస్తుతానికైతే తెలియదుగానీ.. ఐడియా మాత్రం.. వావ్ అనే మాదిరిగానే ఉంది!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్