ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌ ‘ఫుల్‌ ఆదా’ | Andhra Pradesh Saves Rs2,342 Core Energy | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌ ‘ఫుల్‌ ఆదా’

Published Fri, Sep 10 2021 5:24 AM | Last Updated on Fri, Sep 10 2021 8:40 AM

Andhra Pradesh Saves Rs2,342 Core Energy - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న విధానాలతో సత్ఫలితాలు వస్తున్నాయి. ప్రజాధనం వృథా కాకుండా నివారిస్తూ ప్రతి పైసాను ఆదా చేయడంతో విద్యుత్‌ సంస్థలు బలోపేతం అవుతున్నాయి.  ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చిన్న ప్రాజెక్టులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు ఉత్తమ ప్రమాణాలు పాటించడం, బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో విద్యుత్‌ సంస్థలు రూ.2,342 కోట్ల మేర ఆదా చేయగలిగాయి. విద్యుత్‌ సంస్థల్లో సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీ,సీ) 2018–19లో 13.79 శాతం ఉండగా 2019–20లో 10.95 శాతానికి తగ్గాయి. 

రీ టెండర్‌తో రూ.15.96 కోట్లు మిగులు
చౌక విద్యుత్, పొదుపు చర్యల్లో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో సిస్టం అప్లికేషన్స్‌ అండ్‌ ప్రొడక్టస్‌(ఎస్‌ఏపీ), హన (హై పెర్ఫార్మెన్స్‌ అనలిటిక్‌ అప్లయన్స్‌) ఎంటర్‌ప్రైజెజ్‌ క్లౌడ్‌ సర్వీసుల టెండర్‌ ఖరారులో రూ.15.96 కోట్లు ఆదా చేసింది. వాస్తవానికి ఎస్‌ఏపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఏపీ ట్రాన్స్‌కో ఐదేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్ల కాలానికి క్లౌడ్‌ సర్వీసులకు రూ.20.22 కోట్లతో నామినేషన్‌ పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది. ఇదే కంపెనీ మరో ఐదేళ్ల పాటు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని కోరింది. ఈ ప్రతిపాదనను ఏపీ ట్రాన్స్‌ కో తిరస్కరించింది. రీ టెండర్‌ ద్వారా ఐదేళ్ల క్లౌడ్‌ సర్వీసుల కోసం రూ.3.94 కోట్లకు, వన్‌ టైం మైగ్రేషన్‌ కోసం రూ.31.22 లక్షలకు టెండరు ఖరారు చేసింది. ఫలితంగా రూ.15.96 కోట్లు ఆదా అయ్యాయి.

విద్యుత్‌ కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా
చౌక విద్యుత్‌ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా విద్యుత్‌ సంస్థలు అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయి. ఒక రోజు ముందే విద్యుత్‌ వినియోగాన్ని అంచనా వేసే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీని అమలు చేస్తున్నాయి. ఫలితంగా విద్యుత్‌ కొనుగోలు ఖర్చును గణనీయంగా తగ్గించగలుగుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచాయి. 2019 – 20, 2020 – 21లో ఉత్తమ ప్రమాణాలు పాటించడం, చౌక విద్యుత్‌ పవర్‌ ఎక్సే ్చంజీల ద్వారా విద్యుత్‌ కొనుగోలు చేయడం ద్వారా మొత్తం రూ.2,342 కోట్లు ఆదా చేశారు.

విద్యుత్‌ సంస్థల సాంకేతిక, 
వాణిజ్య నష్టాల వివరాలు శాతాల్లో

సంస్థ                                      2018–19    2019–20
ఏపీఈపీడీసీఎల్‌                      6.68    6.64
ఏపీఎస్పీడీసీఎల్‌                     8.45    8.30
ఏపీసీపీడీసీఎల్‌                       7.93    7.99
సాంకేతిక నష్టాల సగటు          7.70    7.62
డిస్కంల వాణిజ్య నష్టాలు       6.09    3.33
ఏటీ అండ్‌ సీ నష్టాల మొత్తం 13.79    10.95

అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుత్‌    
‘‘వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయటంతో పాటు అందుబాటు ధరల్లోనే అందించే ప్రయత్నాలను కొనసాగించాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. విద్యుత్‌ వ్యవస్థలు ఈ విధానాలను పాటిస్తూ ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నాయి’’
– నాగులాపల్లి శ్రీకాంత్‌. ఇంధనశాఖ కార్యదర్శి 

ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం
‘‘ఉత్తమ విధానాల అమలు, చౌక విద్యుత్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యుత్‌ రంగాన్ని సుస్థిరం చేయాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా విద్యుత్‌ సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే ఎస్‌ఏపీ టెండర్లలో రూ.15.96 కోట్లు ఆదా చేయగలిగాం’’– కర్రి వెంకటేశ్వరరావు, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement