కార్యక్రమంలో భాగంగా సాకర్ ప్లేయర్ మెస్సి జెర్సీని అందుకుంటున్న మోదీ
సాక్షి, బెంగళూరు: దేశంలో ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని, విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం బెంగళూరులో భారత ఇంధన వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంధన రంగానిది కీలక పాత్ర అన్నారు.
చమురు శుద్ధి సామర్థ్యంలో నాలుగో స్థానం
భారత్‌లో సుస్థిర ప్రభుత్వం, నిరంతర సంస్కరణలు, సామాజిక, ఆర్థిక సాధికారత పలు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు తోడ్పడ్డాయని మోదీ ఉద్ఘాటించారు. ‘‘తొమ్మిదేళ్లలో ఇంటర్నెట్ అనుసంధానం మూడు రెట్లు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. పెట్రోలియం ఉత్పత్తుల డిమాండ్ 5 శాతం మేర పెరిగిందన్నారు. ప్రపంచంలో అత్యధిక చమురు శుద్ధి సామర్థ్యం కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. 2030 నాటికి 4 ఎంఎంటీల మేర గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇందుకోసం రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు.
ఇక ఈ–20 ఇంధనం
ఈ–20 ఫ్యూయల్ (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్)ను మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ–20ని తొలుత 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులోకి తెస్తారు. రెండేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తారు. ఈ–20 ఇంధన వినియోగంతో ముడిచమురు దిగుమతుల భారం తగ్గనుంది. తుమకూరు జిల్లా గుబ్బీ తాలూకాలో హెచ్‌ఏఎల్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ తయారీ ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment