ప్రయివేటుకు వెలుగులు.. పేదలకు చీకట్లు | Analysis On Chandrababu White Paper Over Energy | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 8:01 AM | Last Updated on Fri, Jan 4 2019 8:01 AM

Analysis On Chandrababu White Paper Over Energy - Sakshi

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 14 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్‌ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్‌ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. మిగులు విద్యుత్‌ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్‌ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది.

ఇంధన రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంలో అనేక వాస్తవాలను చంద్రబాబు ప్రభుత్వం చర్చకు రానివ్వకుండా జాగ్రత్తపడింది. అంకెల గారడీతో పరుగుల పురోభివృద్ధి పెట్టించాలనే ప్రయత్నం చేసినట్టు కన్పిస్తోంది. మిగులు విద్యుత్‌ పేరుతో డ్రామాలు ఆడుతూ, గతం కన్నా తామే మెరుగంటూ చెప్పుకొచ్చిన సర్కార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏలుబడిలో ఒక్కపైసా కరెంట్‌ ఛార్జీ పెంచలేదన్న సత్యాన్ని పూర్తిగా విస్మరించింది. అదే సమయంలో తమ నాలుగేళ్ల పాలనలో మూడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు  ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరించలేకపోయింది. ఛార్జీల పెంపు రూపంలో జనం నుంచి పిండుకోవడం మాత్రమే తెలిసిన సర్కారు దండుకునే మార్గాన్వేషణలో ప్రత్యక్ష, పరోక్ష పద్ధతులు అనుసరించి  ఏకంగా రూ. 5,742 కోట్లకుపైబడి ప్రజలపై భారం మోపడాన్ని ఎక్కడా ప్రస్తావించనే లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం ఉదయ్‌తో డిస్కమ్‌ల అప్పులన్నీ తీరిపోయినా... విద్యుత్‌ సంస్థలు మళ్ళీ ఆర్థిక లోటులోకి ఎందుకెళ్లాయో వివరించనే లేదు. విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరిగినా ఏయేటికాయేడు జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తిని ఏ ప్రైవేటు సంస్థల కోసం తగ్గించారో స్పష్టం చేస్తే బాగుండేదేమో! విద్యుత్‌ వ్యవస్థ విస్తరణ జరిగినట్టు చెబుతున్న ప్రభుత్వం  నాలుగేళ్ళుగా ఏ ఒక్క పోస్టునూ భర్తీ చేయకపోవడానికి కారణాలేంటి?  అయినవాళ్ళకు ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులిచ్చి అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారన్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబు సర్కార్‌  శ్వేతపత్రం వాస్తవాలకు కడుదూరంలో ఉంది.

మిగులు ఓ డ్రామా!
రాష్ట్ర విభజన నాటికున్న 22 ఎంయూల విద్యుత్‌ లోటును అధిగమించి మిగుల్లోకి వెళ్ళామనేది ప్రభుత్వ వాదన. దీన్ని లోతుగా విశ్లేషిస్తే అనేక వాస్తవాలు వెలుగుచూస్తాయి. ఈ నాలుగేళ్ళల్లో ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2,250 మెగావాట్లు పెరిగింది. వైఎస్‌ హయాంలో ఏర్పాటు చేసిన 1600 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంటు 2016లో వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చింది. ఆర్టీపీపీ నాల్గవ దశ 600 మెగావాట్లు వైఎస్‌ హయాంలోదే. నాగార్జున టేల్‌పాండ్‌ 25 మెగావాట్లు కూడా పాత ప్రభుత్వాల కాలంలో తీసుకొచ్చినవే. ఏపీ జెన్‌కో పరిధిలో ఒక్క మెగావాట్‌ ప్లాంట్‌ కూడా చంద్రబాబు కాలంలో ఏర్పాటు కాలేదు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విద్యుత్‌ ప్లాంట్ల విద్యుత్‌ను తన ఖాతాలో చేర్చుకున్నాడు. రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ ఏడాదికి 57,018 మిలియన్‌ యూనిట్లని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి.

అంటే రోజుకు సగటున 156 మిలియన్‌ యూనిట్లు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కోకు  4,410 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కేవలం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచే రోజుకు 84 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసే సత్తా ఉంది. జల విద్యుత్‌ కేంద్రాల నుంచి మరో 24 మిలియన్‌ యూనిట్లు తీసుకోవచ్చు. రోజుకు మరో 34 మిలియన్‌ యూనిట్లు కేంద్ర విద్యుత్‌ వాటాగా రాష్ట్రానికి అందుతుంది. అంతర్రాష్ట్ర జల విద్యుత్‌ వాటాగా ఇంకో 25 మిలియన్‌ యూనిట్లు వచ్చే వీలుంది. ఇవన్నీ కలుపుకుంటే రోజుకు 167 మిలియన్‌ యూనిట్ల వరకూ ఉంటుంది. ఒక్క యూనిట్‌ కూడా ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వం ఏపీ జెన్‌కో ఉత్పత్తిని ఉద్దేశ్యపూర్వకంగా తగ్గిస్తోంది. 2016–17 లెక్కల ప్రకారం కేవలం 10,119 మిలియన్‌ యూనిట్లు మాత్రమే జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. అంటే రోజుకు 84 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంటే... కేవలం 27 మి.యూనిట్లకు పరిమితం చేశారు. మరోపక్క ప్రైవేటు విద్యుత్‌ను రోజుకు 25 నుంచి 30 మిలియన్‌ యూనిట్లకు పెంచారు. జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తి సగటున రూ. 4 లోపే లభిస్తుంది. ప్రైవేటు విద్యుత్‌ సగటున రూ. 6 వరకూ ఉంటుంది. కాబట్టే డిస్కమ్‌లు నష్టపోతున్నాయి.  2014–18 మధ్య కాలంలో రాష్ట్రంలో జెన్‌కో, ప్రైవేటు కలిపి 9,529 మెగావాట్ల నుంచి 19,080 మెగావాట్లకు పెరిగింది. అంటే పెరిగింది 9,551 మెగావాట్లు. ఇందులో జెన్‌కో సామర్త్యం 2250 మెగావాట్లు పెరిగితే, ప్రైవేటు ఉత్పత్తి సామర్థ్య 7,301 మెగావాట్లు పెరిగింది. ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక ఉద్దేశ్యమేమిటి? 

జనానికి మోత... కార్పొరేట్లకు చేరవేత!
విద్యుత్‌ పంపిణీ సంస్థలను రుణ విముక్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల డిస్కమ్‌ అస్యూరెన్స్‌ యోజన (ఉదయ్‌) పథకాన్ని తీసు కొచ్చింది. అందరికంటే ముందే మన రాష్ట్రం ఇందులో చేరింది. డిస్కమ్‌ల అప్పును 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి. ఈ మొత్తాన్ని కేంద్రం అప్పుగా ఇప్పిస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ హామీతో డిస్కమ్‌లు బాండ్లు విడుదల చేశాయి. మొత్తం మీద 2017 నాటికే డిస్కమ్‌లు అప్పుల్లోంచి బయటపడ్డాయి. కానీ 2018 నవం బర్‌లో ఏపీఈఆర్‌సీకి సమర్పించిన నివేదికల ప్రకారం రూ. 8 వేల కోట్ల ఆర్థిక లోటును పేర్కొన్నాయి. కారణమేంటి? వైఎస్‌ హయాంలో ఆరేళ్ళ పాటు విద్యుత్‌ ఛార్జీలు ఎందుకు పెరగలేదు?  బాబు ప్రభుత్వం వచ్చీ రావడం తోనే ఇలా వేల కోట్ల భారం ఎందుకు వేస్తుంది? ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలివి.

డిస్కమ్‌లు ప్రతీ యూనిట్‌కు రూ. 5.94 చొప్పున వెచ్చిస్తున్నాయి. కానీ వినియోగదారుడికి దీన్ని యూనిట్‌ రూ. 4.53 చొప్పునే విక్రయిస్తున్నాయి. కాబట్టి యూనిట్‌కు రూ. 1.42 చొప్పున నష్టం వస్తోందనేది పంపిణీ సంస్థల వాదన. ఇలా అమ్మితే ముమ్మాటికీ నష్టమే. కానీ ఇలా అమ్మాల్సిన అవసరం ఏమిటి? బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ యూనిట్‌ రూ. 1.99కే లభిస్తోంటే, పంపిణీ సంస్థలు మాత్రం రూ. 5.94 ఎందుకు ఖర్చుపెడుతున్నాయి? అసలు కథ వేరుగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో  రోజుకు 14 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉందని ప్రభుత్వం లెక్క తేల్చింది. మిగులు విద్యుత్‌ సాధించే పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు విద్యుత్‌ను ప్రోత్సహించింది. ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారులంతా ప్రభుత్వ పెద్దలతో లాలూచీ పడ్డారని, అందువల్లే యూనిట్‌ రూ. 7 వరకూ కొనుగోలు చేశారనే ఆరో పణలూ ఉన్నాయి. అవసరానికి మించి మాత్రం విద్యుత్‌ కొనుగోలు చేశారు. రాష్ట్ర అవసరాలకు ఏడాదికి 57,018  మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరిపోతుంది. కానీ ప్రభుత్వం 67,948 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చింది. అంటే 10,930 మిలియన్‌ యూనిట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. దీన్నిబట్టి అవసరం లేని ఈ విద్యుత్‌కు రూ. 6,492 కోట్లు చెల్లిస్తుంది. డిస్కమ్‌లు కొనుగోలు చేసే విద్యుత్‌లో 50 శాతం ప్రైవేటు విద్యుత్తే ఉంటుంది. ఇలా జనం నుంచి దోచుకునే డబ్బంతా ప్రైవేటు జేబుల్లోకి వెళ్తుంది. కాబట్టే పంపిణీ సంస్థ లకు నష్టాలొస్తున్నాయి. ఆ భారాన్ని జనంపై వేస్తున్నారనేది సుస్పష్టం.

ఏటా షాక్‌లే!
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రావడంతోనే విద్యుత్‌ ఛార్జీలను పెంచింది. 2015–16 సంవత్సరంలో ఏకంగా రూ. 941 కోట్ల భారం విద్యుత్‌ వినియోగదారులపై వేసింది. మరో రూ. 750 కోట్లు ట్రూ అప్‌ ఛార్జీల రూపంలో పిండుకోవాలని చూసింది. జనాగ్రహంతో ట్రూ అప్‌ మాట వెనక్కు తీసుకుంది. 2016–17లో మరో దఫా విద్యుత్‌ ఛార్జీల భారం మోపింది. ఈసారి కాస్తా జాగ్రత్తగా వ్యవహరించింది. నేరుగా రూ. 242 కోట్ల మేర ఛార్జీలు పెంచింది. కానీ శ్లాబుల వర్గీకరణతో దాదాపు రూ. 1,200 కోట్లు దండుకుంది. 2014–15 లో ఏడాదికి 600 యూనిట్ల విద్యుత్‌ వాడకం దాటితే నెలవారీ బిల్లు రెట్టింపయ్యే ఎత్తుగడ ఇది. మొదటి 50 యూనిట్లకు రూ. 1.45 (యూనిట్‌కు) చొప్పున చెల్లించే విద్యుత్‌ వినియోగదారుడు ఏడాదికి 601 యూనిట్ల వినియోగం ఉంటే చాలు యూనిట్‌కు రూ. 2.60 చొప్పున చెల్లించాలి. దీనిబట్టి ఏడాదికి ప్రతీ వినియోగదారుడు రూ. 600 వరకూ అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఇలా 45 లక్షల మంది విద్యుత్‌ వినియోగదారులపై అదనపు భారం పడింది. దళిత పేద వర్గాల సబ్సిడీ ఎగిరిపోయింది.  2017–18 లో కొత్త రకం దొంగ దెబ్బను కనిపెట్టింది. 1 కేవీ లోడ్‌ దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీలు వసూలు చేస్తామంటోంది. అంటే వెయ్యి వాట్స్‌కు సరిపడా లోడ్‌ ఉంటే బిల్లు మోతమోగినట్టే.  రకరకాల విద్యుత్‌ ఉపకరణాలున్న ఈ రోజుల్లో 1 కేవీ లోడ్‌ దాటని వారు ఎవరుంటారు? నాలుగు బల్బులు, ఫ్యాన్లు, మిక్సీ, కూలర్, ఇస్త్రీ పెట్టె... ఇలాంటివన్నీ సర్వసాధారణం కదా? ఈ విధానం వల్ల మధ్య తరగతి వినియోగదారుడి బిల్లు రూ. 150 నుంచి రూ. 600 వరకూ పెరిగే వీలుంది. ఇది దొంగదెబ్బ కాదా? విద్యుత్‌ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ,  ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహి స్తున్న ప్రభుత్వం  భారాన్ని మాత్రం ప్రజలపై మోపుతోంది. సంస్కరణల పేరుతో విద్యుత్‌ నియంత్రణ మండలిని ఏర్పాటు చేసినా, ఈ స్వతంత్ర సంస్థ స్వేచ్ఛను సర్కారే పూర్తిగా హరించింది. నాలుగేళ్ళుగా ప్రజాభిప్రాయ సేకరణలో పలు అంశాలు ముందుకొచ్చినా ఏపీఈఆర్‌సీ మాత్రం ప్రభుత్వ పెద్దల కొమ్ము గాస్తోందనే ఆరోపణలున్నాయి. వాస్తవాలు మరుగున పరచిన ప్రభుత్వం అంకెల గారడీతో శ్వేతపత్రం విడుదల చేయడం దురదృష్టకరం.      
– వనం దుర్గా ప్రసాద్, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement