ప్రధాని ఆఫ్రికా పర్యటనలో..
న్యూఢిల్లీః ప్రధాని ఆఫ్రికా పర్యటన ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆఫ్రికా, భారత్ మధ్య సన్నిహిత సంబంధాలను పెంచుకోవడం, సహకారం బలోపేతం చేయడంతోపాటు ఆయాదేశాల్లోని అనేక వనరుల వినియోగంపై దృష్టి సారించనున్నారు. పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు, పప్పుధాన్యాలు, విద్యుత్ శక్తి మొదలైన అంశాలపై చర్చించనున్నారు.
జూలై 7న మొదలై.. ఐదురోజులపాటు కొనసాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో విద్యుత్, వాణిజ్య, పెట్టుబడి, ఆహారం, సముద్ర భద్రత, తీవ్రవాదం, సహకారం వంటి విషయాలపై దృష్టి సారించనున్నట్లు భారత విదేశాంగశాఖ ఆర్థిక సంబంధాల కార్యదర్శి అమర్ సిన్హా తెలిపారు. నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఒక్కోదేశంలోనూ అనేక ఒప్పందాలపై మోదీ సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. ఆఫ్రికాలో.. చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అమిద్ అన్సారీలు ఆఫ్రికా దేశాల్లో పర్యటించగా... ప్రస్తుతం మోదీ పర్యటన మరింత దోహదం చేయనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే భారతదేశం ఆఫ్రికా దేశాలనుంచి భారీ పరిమాణంలో పప్పుధాన్యాల దిగుబడి చేసుకుంటుండగా.. ఈ పర్యటనలో మొజాంబిక్ తో దీర్ఘ కాల సేకరణకు ఒప్పందాలు కుదుర్చుకొనే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొద్ది నెల్లుగా భారత్ లో పప్పుధాన్యాల ధర తీవ్రంగా పెరగడం అనేక విమర్శలకు తావిస్తున్న నేపథ్యంలో ప్రధాని పప్పుధాన్యాల దిగుబడులపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా జోహాన్స్ బర్గ్, నైరోబిల్లో భారత సంతతికి చెందిన ప్రజలు గణనీయంగా ఉండటంతో ప్రధాని ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా నాలుగు దేశాల్లో జరిగే సమావేశాల్లో భారత సమాజంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సిన్హా తెలిపారు. పర్యటనలో ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ ఎంతో లాభం చేకూరుస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ లో భారత్ లో నిర్వహించిన నాలుగు రోజుల ఆఫ్రికా దేశాల సదస్సుకు సుమారు 54 ఆఫ్రికా దేశాల ప్రభుత్వాధినేతలు, 40 మంది ప్రతినిధులు హాజరయ్యారన్నారు.
గురువారం ప్రారంభం కానున్న మోదీ విదేశీ ప్రయాణంలో ముందుగా మొజాంబిక్ కు చేరుకుని ఆ దేశ అధ్యక్షుడు ఫిలిఫె న్యూసితో ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారు. అనంతరం రెండు రోజులపాటు దక్షిణాఫ్రికాలోని జొహన్స్ బర్గ్, పీటర్ మారిట్జ్ బర్గ్, డర్బన్ నగరాల్లో పర్యటిస్తారు. దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంలో మహాత్మాగాంధీ ప్రయాణించిన చారిత్రక రైలులో మోదీ పీటర్మారిట్జ్ బర్గ్ ప్రయాణించనున్నారు. తెల్లవారు కాని వారికి అనుమతి లేదంటూ అప్పట్లో మహాత్మా గాంధీని మొదటి తరగతి కంపార్ట్ మెంట్ నుంచి బయటకు తోసేసిన కథనం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో భారత్ కు ఉన్న చారిత్రక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమాతోపాటు, ఇతర రాజకీయ నేతలతో మోదీ సమావేశం అవుతారు. జూలై 10న టాంజానియాలో, 11న కెన్యాలో మోదీ పర్యటన జరగనున్నట్లు ప్రధాని పర్యటనపై పూర్తి వివరాలను సిన్హా తెలిపారు.