సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ మేటి అని అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్‌ఏ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్ కొనియాడారు. ఇంధన భద్రత దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో ‘ఎనర్జీ ఎఫిషియన్సీ మ్యాటర్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ పుస్తక రచయితల్లో ఒకరైన డాక్టర్ అజయ్ మాథుర్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డికి తన పుస్తకాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాథుర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ‘జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు’ను అందుకున్న ఏపీ ప్రభుత్వ సంస్థ ఏపీఎస్‌ఈసీఎంను అభినందించారు. ఇంధన పరిరక్షణకు సంబంధించిన పలు పథకాలను సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరుసలో ఉందన్నారు. ఏపీలో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో అన్ని శాఖలనూ భాగస్వాములను చేయడం, అన్ని విభాగాల్లోనూ ఇంధన సంరక్షణ సెల్స్ ఏర్పాటు వంటి చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని ఆయన చెప్పారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రోత్సాహం, అనుసరిస్తున్న విధానాలతోనే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధనశాఖకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు, అవార్డులు లభిస్తున్నాయని చంద్రశేఖరరెడ్డి అన్నారు.
రాష్ట్రానికి మూడు ‘ఎనర్షియా’ అవార్డులు
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న విధానాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు లభించింది. ఇంధన రంగంలో జాతీయ స్థాయిలో ఏపీకి మూడు అవార్డులు వచ్చాయి. ఇంధన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవార్డుకు ఏపీ ఎంపికైంది. అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్(ఏపీట్రాన్స్‌కో)కు అవార్డు లభించింది.
ఉత్తమ పునరుత్పాదక సంస్థగా ఆంధ్రప్రదేశ్ నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌ఈడీఏపీ) నెడ్‌కాప్‌ను అవార్డు వరించింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన 15వ ఎనర్షియా అవార్డుల సదస్సులో ఈ అవార్డులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్ అందుకున్నారు. ఎనర్షియా ఫౌండేషన్ అనేది ముంబైకి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది భారత్‌తో పాటు ఆసియా, మిగిలిన ప్రపంచ దేశాల్లో క్లీన్, గ్రీన్, సస్టైనబుల్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ, ఇంధన రంగం అభివృద్ధికి కృషిచేస్తోంది.
చదవండి: పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా?
Comments
Please login to add a commentAdd a comment