సాక్షి, అమరావతి: ఒకే ప్రాంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని, ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బందిని ఈ నెల 25వ తేదీలోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా. కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ, బదిలీలు తదితర అంశాలపై ఆయన సోమవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.
పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన కనీస సౌకర్యాలు, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులైన ఓటర్ల కోసం ర్యాంపులు వంటివి కల్పించాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా తదితర శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ఇతర నిషేధిత వస్తువుల అక్రమ రవాణా నియంత్రణతో పాటు పటిష్ట నిఘాకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్లు) కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరగా చర్యలు తీసుకోవాలని సీఈవో, సీసీఎల్‌ఏను ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ బదిలీ చేయాల్సిన అధికారులు, సిబ్బందిని గుర్తించామని, ఇప్పటికే కొందరిని బదిలీ చేశామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్), పోలీస్ శాఖల్లో మూడు రోజుల్లోగా బదిలీలు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ఎస్.బాగ్చి, సీడీఎంఏ వివేక్ యాదవ్, సెబ్ డైరెక్టర్ ఎం.రవిప్రకాశ్, ఐజీ రవీంద్ర బాబు, అదనపు సీఈవో కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, నిషాంతి పాల్గొన్నారు.
ఆ ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపాలి: సీఎస్
సచివాలయ బిజినెస్ రూల్స్ ప్రకారం నిర్దిష్ట అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని సీఎస్ డా. కేఎస్ జవహర్ రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగాల భర్తీ, పదోన్నతులు, బడ్జెట్, ప్రాజెక్టు పనులు, సవరించిన అంచనాలు, విధానపరమైన అంశాల ఫైళ్లను ముందుగా ఆర్థిక శాఖకు పంపించి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఇటీవల ఈ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని శాఖలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తరువాత ఆర్థిక శాఖకు ఫైళ్లు పంపిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బడ్జెట్ మంజూరు, నిధుల విడుదల, అదనపు నిధులు, ప్రొక్యూర్‌మెంట్ ప్రాజెక్టులు, పనులు, సర్వీసెస్ పరిపాలన అనుమతులు, సవరించిన అంచనాలు, కార్యక్రమాలు, పథకాలు, ఇన్‌స్టిట్యూషన్స్, విధానపరమైన అంశాలు, చట్టాలు, జీవోలు, విధివిధానాల మార్గదర్శకాలకు సంబంధించిన ఫైళ్లను తప్పనిసరిగా ఆర్థిక శాఖకు పంపి, అనుమతి పొందాలని పేర్కొన్నారు. సంబంధిత శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు పంపే ఫైళ్లపై తగిన సిఫార్సులు కూడా చేయాలని, నిబంధనల మేరకు సంబంధిత అథారిటీ అనుమతి మేరకే ఫైళ్లు పంపుతున్నారా లేదా అనే విషయాలను కూడా ఫైళ్లలో స్పష్టంగా పేర్కొనాలన్నారు.
ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చే ముందు అందుకు తగిన నిధులు ఉన్నాయా లేదా, సంబంధిత ఫైళ్లకు సంబంధించిన అంశాల వల్ల ప్రభుత్వ ప్రాధాన్యతలు నెరవేరుతాయా లేదా అనే విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు. శాఖలు పంపే ప్రతిపాదనలు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో ఉన్నాయా లేదా, బడ్టెట్ కేటాయింపులున్నాయా లేదా అనే విషయాలను ఆ ర్థికశాఖ పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment