అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా
15లోగా మద్యం సరఫరా వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలి
ఇప్పటివరకు రూ. 100 కోట్లకు పైగా విలువైన నగదు, లిక్కర్, డ్రగ్స్ జప్తు
సాక్షి, అమరావతి/సింగరాయకొండ (మర్రిపూడి)/శ్రీకాళహస్తి(తిరుపతి జిల్లా)/నెల్లూరు(బారకాసు): త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అక్రమ నిల్వలు, అమ్మకం, పంపిణీని నిరోధించేందుకు వెబ్ క్యాస్టింగ్, జీపీఎస్ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.
రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం గొడౌన్ల ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లు, మద్యం తయారీ–నిల్వ చేసే స్థలాల వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గోడౌన్ల నుంచి షాపులకు మద్యం సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ కనెక్టివిటీని ఈనెల 15లోగా ఏర్పాటు చేసి ట్రాకింగ్ ద్వారా నిఘా ఉంచాలన్నారు. ఈ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్ ద్వారా గమనించేలా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు.
అదేవిధంగా తనిఖీలను ముమ్మరం చేయాలని అబ్కారీ శాఖ కమిషనర్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కమిషనర్‌లకు ఆదేశాలు జారీచేశారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపరచకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.
ప్రలోభాలపై గట్టి నిఘా
రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలపై గట్టి నిఘా ఉంచామని, ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులు జప్తు చేశామని ముకేశ్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారా అలాగే పోలీస్, ఎక్సైజ్, ఐటీ, ఫారెస్టు, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్‌ఫోర్సుమెంట్ ఏజన్సీలతో నిరంతరం నిఘా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు జప్తు చేసిన వాటిలో రూ. 25.03 కోట్ల నగదు, రూ. 12.49 కోట్ల విలువైన మద్యం, రూ.2.05 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ. 51.23 కోట్ల విలువైన లోహాలు, రూ. 2.42 కోట్ల విలువైన ఉచితాలు, రూ. 7.04 కోట్ల విలువైన ఇతర వస్తువులను జప్తుచేయడం జరిగిందని ఆయన తెలిపారు.
నామినేషన్లకు 18న నోటిఫికేషన్
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌తో కలిసి గురువారం ముకేశ్ కుమార్ మీనా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18న ప్రారంభం అవుతుందని చెప్పారు. కోడ్‌ను అమలు చేస్తున్న తీరు పరిశీలించి అధికారులను అభినందించారు. ఓటు ఆవశ్యకతను తెలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన అవగాహన మస్కట్‌ను ఆవిష్కరించారు.
ముక్కంటి సేవలో మీనా
జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆర్డీవో రవిశంకర్‌రెడ్డి, ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేదపండితులు మీనాకు ఆశీర్వచనం ఇవ్వగా.. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు.
సింగరాయకొండ చెక్‌పోస్టు తనిఖీ
ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం ముకేశ్ కుమార్ మీనా తనిఖీ చేశారు. ఈమార్గంలో వస్తున్న వాహనాలను సిబ్బంది తనిఖీ చేస్తున్న తీరు, వీడియో రికార్డింగ్ చేస్తున్న విధానాన్ని ఆయన చెక్‌పోస్టు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు, నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
మహిళా ప్రయాణికుల బ్యాగులను కచ్చితంగా మహిళా సిబ్బందితోనే తనిఖీ చేయించాలని సూచించారు. తగిన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు పైగా నగదు ఉంటే దానిని సీజ్ చేసి ట్రెజరీకి జమచేయాలన్నారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఒంగోలులో బుధవారం రాత్రి జరిగిన ఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇందుకోసం ఎన్నికల రాష్ట్ర పోలీసు అబ్జర్వర్ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలో విచారణ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment