కట్టుదిట్టంగా ‘కోడ్‌’ | Assembly Elections: Election Code Of Conduct Should Be Strictly Enforced Says Jawahar Reddy, Details Inside - Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా ‘కోడ్‌’

Published Wed, Mar 20 2024 4:51 AM | Last Updated on Wed, Mar 20 2024 12:44 PM

Election code of conduct should be strictly enforced says Jawahar Reddy - Sakshi

ప్రభుత్వ వెబ్‌సైట్లలో, కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫొటోలు.. ఆడియో, వీడియోలు తొలగించండి

ప్రభుత్వ ఆస్తులపై రాజకీయపరమైన ప్రకటనలు తీసేయాలి 

పార్టీల ప్రచారాల్లో ప్రభుత్వోద్యోగులు పాల్గొంటే చర్యలు  

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల మీద వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించండి 

పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరం లేదు  

అధికారులకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌)ని కట్టుదిట్టంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లన్నింటిలోనూ ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలు, ఆడియో, వీడియోలు కూడా వెంటనే తొలగించాలని సీఎస్‌ స్పష్టంచేశారు.

అంతేకాక.. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను, ఫ్లెక్సీలతోపాటు ప్రభుత్వ ఆస్తులపైనున్న రాజకీయ ప్రకటనలన్నీ కూడా తొలగించాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై జవహర్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 

ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.. 
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఏ శాఖపైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వోద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.

కోడ్‌ అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలుచేసేందుకు అధికారులందరూ చర్యలు తీసుకోవాలి. చాలావరకు కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్నందున వారంతా కోడ్‌ మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలి. కోడ్‌కు సంబంధించి సీఈఓ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్‌లో కార్యదర్శులందరూ నివేదిక ఇవ్వాలి. 

పెన్షన్ల పంపిణీ, ఉపాధి పనులకు అభ్యంతరంలేదు : ముఖేష్ కుమార్‌ మీనా 
ఎన్నికల షెడ్యూల్‌  వెలువడి కోడ్‌ అమల్లోకి వచ్చాక కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదు.
 బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూ­రు, హామీలు, శంకుస్థాపనలు నిషిద్ధం.  
వర్క్‌ఆర్డర్‌ ఉండి క్షేత్రస్థాయిలో మొదలు కాని పనులను చేపట్టకూడదు. పనులు పూర్తయిన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధంలేదు. 
♦ అలాగే, వివిధ రకాల పించన్లపంపిణీకీ ఎలాంటి అభ్యంతరంలేదు.  
ఉపాధి హామీ పథకం కింద రిజిస్టర్డ్‌ లబ్ధిదారులకు యధావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చు. కోడ్‌ అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించుకోవచ్చు. కానీ, టెండర్లను ఖరారు చేయడానికి వీల్లేదు. 
♦ కోడ్‌ అమలులోకి వచ్చాక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు లేదా వీడియో సమావేశాలు నిర్వహించకూడదు.  
  పీఎం, సీఎం సహాయ నిధి కింద రోగుల చికిత్స నిమిత్తం నిధులు మంజూరు చెయ్యొచ్చు. 

అన్ని రకాల ప్రకటనలనూ నిలిపివేయాలి.. 
ఇక కోడ్‌ అమలులోకి వచ్చినందున ప్రభుత్వ ఆస్తులపై ఉన్న అన్ని రకాల వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ వెంటనే తొలగించాలి. అలాగే, వివిధ పబ్లిక్‌ ఆస్తులు అంటే.. బహిరంగ ప్రదేశాలు, బస్‌స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైలు..రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్‌ స్తంభాలు, మున్సిపల్‌ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ ప్రకటనలు.. వాల్‌ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటివన్నింటినీ వెంటనే తొలగించాలి. అదే విధంగా.. ప్రింట్‌ అండ్‌ ఎల్రక్టానిక్‌ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేయాలి.  

మంత్రులెవరూ అధికారిక వాహనాలు వాడరాదు.. 
ఎన్నికల ప్రకటన వచ్చేసినందున ఇక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచా­రం కోసం వినియోగించరాదు. ఎంపీ లేదా  ఎంఎల్‌ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పథకాల నిధులతో నిర్వహించే వాటర్‌ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ప్రజాప్రతినిధుల ఫొటోలు కూడా ఉండరాదు. ప్రభుత్వ భవ­నాలు, కార్యాలయాల్లో ప్రధాని, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలూ ఉండకూడదు.

అలాగే, విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్‌ పాస్‌లు, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లపై కూడా ప్రజాప్రతినిధుల ఫొటోలు, సందేశాలు వంటివి కూడా ఉండకూడదు. ప్రభుత్వోద్యోగులెవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర ఏ రకమైన ­లబి­్ధపొందినా అలాంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.  

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్ర­త్యే­క ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, వై. శ్రీలక్ష్మి, కె. విజయానంద్, వర్చువల్‌గా.. ఎం.టి. కృ­ష్ణబాబు, అనంతరాము పాల్గొన్నారు. ముఖ్య కా­ర్య­దర్శులు శశిభూషణ్‌కుమార్, హరీశ్‌కుమార్‌ గుప్తా, ప్రవీణ్‌ప్రకాశ్, సునీత, కాంతిలాల్‌ దండే, చి­రంజీవి చౌదరి, వాణీమోహన్, పలువురు కార్యదర్శు­లు, కమిషనర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement