రాష్ట్రంలో మే 13న 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్
ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ.. 26న పరిశీలన
29 వరకు ఉపసంహరణకు చాన్స్
ఉ.11 నుంచి మ.3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం
ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి కి ఒకరు, స్వతంత్ర అభ్యర్థికి పదిమంది ఓటర్లు ప్రతిపాదించాలి
ఎంపీ అభ్యర్థి నామినేషన్ రుసుం రూ.25,000.. ఎమ్మెల్యేకు రూ.10,000
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ.. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్‌సభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయనుంది. దీంతో అప్పటి నుంచే అంటే ఈనెల 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. అతి కీలకమైన ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో.. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో ఎన్నికల కోడ్‌ను పాటిస్తూ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా రికార్డు చేసేందుకు నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద సీసీ కెమేరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ల దాఖలు ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. ఈ క్రతువులో అభ్యర్థుల భవితవ్యాన్ని 4.10 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో తొలిరోజు నుంచే నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకానుంది. వీటిని ఏప్రిల్ 26 వరకు పరిశీలించి, 29 వరకు ఉపసంహరణకు సమయమిస్తారు. మే 13న పోలింగ్ కాగా.. జూన్ 4 ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఉ.11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ..
ఎన్నికల నోటిఫికేషన్ గురువారం జారీకాగానే నామినేషన్ల దాఖలు ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. సంబంధిత అసెంబ్లీ లేదా లోక్‌సభ స్థానం రిటర్నింగ్ ఆఫీసు కార్యాలయంలో ఉ.11 గంటల నుంచి మ.3 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో స్వీకరించరు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు వెయ్యొచ్చు. ఒక అభ్యర్థి ఏదైనా రెండు స్థానాల్లో మాత్రమే పోటీచేసే అవకాశముంది. ఎంపీ అభ్యర్థి అయితే ఫారం–2ఏ, ఎమ్మెల్యే అభ్యర్థయితే ఫారం–2బీ ఉపయోగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేయవచ్చు.
అయితే, వాటి కాపీలను భౌతికంగా ఆర్వోలకు అందజేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం గుర్తించిన రాజకీయ పార్టీల అభ్యర్థి కి స్థానికంగా ఉండే ఒక ఓటరు ప్రతిపాదన (ప్రపోజర్‌గా) సంతకం చేయాల్సి ఉంటుంది. అదే ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు 10 మంది ప్రతిపాదించాలి. ఒక ఓటరు ఎంతమంది అభ్యర్థుల కైన ప్రపోజ్ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా ప్రతీ అభ్యర్థి కొన్ని కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
నామినేషన్ వేయడానికి వెళ్లే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోనికి కేవలం మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి గదిలోకి అభ్యర్థి తో కలిపి కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు దాఖలు చేసినప్పుడు ఫారం–ఏ, ఫారం–బీలు కూడా సమర్పించవచ్చు. లేకపోతే నామినేషన్ల చివరి రోజున 3 గంటలలోపు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటుచేశారు.
ఫారం–26 తప్పనిసరి..
ఇక నామినేషన్ దాఖలుతోపాటు ఫారం–26 (అఫిడవిట్) కూడా అభ్యర్థులు విధిగా సమర్పించాలి. ఇది నామినేషన్ల చివరి తేదీ ఏప్రిల్ 25, మ.3 గంటల లోపు ఇవ్వొచ్చు. ఫారం–26 స్టాంప్ పేపర్ విలువ రూ.10 కంటే ఎక్కువ ఉండాలి. భౌతిక స్టాంప్ పేపర్ అందుబాటులో లేకపోతే ఈ–స్టాంప్ పేపర్ ఉపయోగించవచ్చు. ఫారం–26 అంటే.. పోటీచేసే అభ్యర్థులు తన కుటుంబసభ్యుల ఆస్తులు, అప్పులతోపాటు క్రిమినల్ కేసులు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న అన్ని కేసుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి. అదే ఇతర అభ్యర్థులైతే ఫ్రీ సింబల్స్ నుండి తనకు నచ్చిన మూడు గుర్తులను కోరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్ అయివుండి, గుర్తింపు పొందని పార్టీలు ఎన్నికల సంఘం నుండి కామన్ సింబల్ కేటాయించినట్లయితే ఆ గుర్తును నామినేషన్ ఫారంలో రాయాలి.
నామినేషన్ రుసుం ఇలా..
పార్లమెంటు అభ్యర్థి అయితే రూ.25,000లు, అసెంబ్లీ అభ్యర్థి అయితే రూ. 10,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఈ రుసుంలో 50 శాతం రాయితీ కల్పించారు. వీరు సామాజిక ధ్రువపత్రాన్ని విధిగా సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తర్వాత ప్రతి అభ్యర్థి రిటర్నింగ్ అధికారి ముందు ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
ప్రతి అభ్యర్థి నామినేషన్‌తో పాటు లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫొటో (2 ్ఠ2.5 సెం.మీ) ఇవ్వాల్సి ఉంటుంది. నామినేషన్ వేసిన తరువాత అభ్యర్థి రశీదుతోపాటు స్కూృట్నీ తేదీ, సమయం.. నామినేషన్ ఉపసంహరణ తేదీ, సమయం.. గుర్తులు కేటాయించే తేదీ, సమయం తెలిపే నోటీసులను అధికారుల నుంచి తీసుకోవాలి. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు 13 రకాల పత్రాలను తీసుకురావల్సి ఉంటుంది.
నేటి నుంచి అభ్యర్థుల ఖర్చు కౌంట్
నామినేషన్ల పర్వం ప్రారంభైన నాటి నుంచి అంటే గురువారం నుంచే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో నమోదు చేస్తారు. పత్రికల్లో వచ్చే పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వార్తలను సైతం అభ్యర్థి ఖాతా కింద లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు. అలాగే, ఎంపీ అభ్యర్థి రూ.95 లక్షల వరకు వ్యయం చెయ్యొచ్చు. అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన నోడల్ అధికారులు పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు ఎన్నికల వ్యయానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాలి.
ముఖ్యమైన తేదీలు
నామినేషన్ల దాఖలు చివరి తేదీఏప్రిల్ 25 గురువారం
ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ జారీ ఏప్రిల్ 18 గురువారం
నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26 శుక్రవారం
నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ఏప్రిల్ 29 సోమవారం
పోలింగ్ తేదీ మే 13 సోమవారం
ఓట్ల లెక్కింపు జూన్ 4 మంగళవారం
ఎన్నికల ప్రక్రియ ముగింపు తేదీజూన్ 6 గురువారం
Comments
Please login to add a commentAdd a comment