సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో నిర్మించిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), ఆరోగ్య కేంద్రాలు, ఇతర నిర్మాణాలను ఆ స్కూళ్లకే ఇచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి హైకోర్టుకు వివరించారు. వాటిని అదనపు తరగతి గదులు, గ్రంథాలయాలు, ఆట గదులుగా వాడుకోవచ్చని చెప్పారు.
ఈ నిర్మాణాల విషయంలో తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. అఫిడవిట్‌ను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో సచివాలయాలు, ఆర్బీకేలు, ఇతర నిర్మాణాలపై దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ప్రభుత్వ స్కూళ్లలో వాటిని నిర్మించవద్దని 2020లో ఆదేశించారు.
అయినా స్కూళ్లలో వాటిని నిర్మిస్తున్నారంటూ మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అలాగే పనులకు బిల్లులు చెల్లించడంలేదని కూడా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్.. తాము ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా నిర్మాణాలు కొనసాగించడంపై కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు.
ఈ ఆదేశాల మేరకు సీఎస్ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గురువారం ఉదయం కోర్టు ముందు హాజరయ్యారు. జవహర్‌రెడ్డి కోర్టుకు వివరణ ఇచ్చారు. పాఠశాలల్లో ఆరోగ్యవంతమైన వాతావరణం ఉండేందుకు ఆ ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలేవీ ఉండరాదన్న హైకోర్టు ఉత్తర్వులు హర్షించదగ్గవన్నారు. బహుళ శాఖలు ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో కోర్టు ఆదేశాల అమలులో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇందుకు క్షమించాలని కోరారు.
నా చిన్నప్పుడే అలాంటి పరిస్థితి చూశా
జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్డుకెక్కడం ఎప్పుడైనా చూశారా అని సీఎస్‌ని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని, తన చిన్న వయస్సులో మూడు నెలల జీతం కోసం అప్పట్లో టీచర్లు ఆందోళన చేశారని జవహర్‌రెడ్డి సమాధానమిచ్చారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ జవహర్‌రెడ్డికి చెప్పారు. ఇది తమ వ్యక్తిగత విజ్ఞప్తి అని తెలిపారు.
ఆ భవనాలు స్కూళ్లకే ఇచ్చేశాం
Published Fri, Dec 23 2022 5:26 AM | Last Updated on Fri, Dec 23 2022 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment