సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా ఇంకా 18 ఏళ్లు నిండని బాలికలు గర్భం దాల్చుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నివారణకు మరింత సమర్థంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 5,178 బాల్య వివాహాలను నివారించినప్పటికీ ఇంకా 8,496 మంది యుక్తవయసు బాలికలు గర్భం దాల్చినట్టు గర్భిణుల రిజి్రస్టేషన్లలో తేలిందన్నారు.
అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాక, 21 ఏళ్లు నిండిన అబ్బాయిలతో పెళ్లిళ్లు చేస్తేనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎస్ సూచించారు. ఏ గ్రామంలోనైనా బాల్య వివాహం జరిగితే సంబంధిత గ్రామ, వార్డు కార్యదర్శులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.
ప్రకృతి సేద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా చర్యలు
రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రకృతి సేద్యం విస్తరణ, నిధుల సమీకరణ, ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రత్యేకంగా విశ్వ విద్యాలయం ఏర్పాటు అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతులు ప్రకృతి సేద్యం విధానాన్ని పాటిస్తూ ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తే ప్రధాన మంత్రి ప్రాణం పథకం కింద పెద్ద ఎత్తున సబ్సిడీ పొందొచ్చన్నారు.
రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సంబంధించి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. కాగా, కాకినాడ–శ్రీకాకుళం మధ్య ఏర్పాటు చేస్తున్న నాచురల్ గ్యాస్ పైపులైను పనులు వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. సచివాలయంలో ఈ అంశంపై ఆయన అధికారులతో సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment