స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు  | Free and peaceful elections | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు 

Published Thu, Mar 21 2024 4:30 AM | Last Updated on Thu, Mar 21 2024 4:30 AM

Free and peaceful elections - Sakshi

విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం 

50% కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌.. కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షణ 

నిరంతరం నిఘాకు 121 చెక్‌ పోస్టులు 

జనవరి నుండి రూ.176 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాదీనం 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డి 

బందోబస్తుకు కేంద్ర, రాష్ట్ర బలగాలతో పాటు సమీప రాష్ట్రాల పోలీసులు: డీజీపీ 

సాక్షి, అమరావతి: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలుస్వేచ్ఛగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా. కేఎస్‌ జవహర్‌ రెడ్డి చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో డీజీపీ కేవీ రాజేంద్రనాధ్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాతో కలిసి సీఎస్‌ సమీక్షించారు. ముఖ్యంగా సైబర్‌ సెక్యూరిటీ, ఐటీ, స్వీప్, శాంతి భద్రతలు, కమ్యూనికేషన్‌ ప్లాన్, కంప్లైంట్‌ రిడ్రస్సల్, ఓటరు హెల్ప్‌ లైన్, పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు వంటి అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు. ఓటు హక్కు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 46,165 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, కనీసం 50 శాతం కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. వెబ్‌ కాస్టింగ్‌ ఉన్న కేంద్రాలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌లతో అనుసంధానమై ఉంటాయని, వాటిలో పోలింగ్‌ సరళిని నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు.

జనవరి నుండి ఇప్పటివరకు రూ.78 కోట్ల నగదు, రూ.41 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, రూ.30 కోట్ల విలవైన వివిధ డ్రగ్స్‌ వంటివి మొత్తం రూ.176 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన గత నాలుగు రోజుల్లోనే వివిధ రూ. 3.39 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామన్నారు.

అక్రమాల నియంత్రణకు రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు సహా 121 చెక్‌ పోస్టులు ఏర్పాటుచేస్తున్నామన్నారు. డీజీపీ కేవీ రాజేంద్రనాధ్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల బందోబస్తుకు 1.50 లక్షల మంది రాష్ట్ర పోలీసులు, 522 కంపెనీల స్టేట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులు, 465 కంపెనీల సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి హోంగార్డు తదితర స్థాయి పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు.  

సిబ్బంది, వాహనాలు సిద్ధం: మీనా 
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఎన్నికల సన్నద్దతపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రంలో 4,09,41,182 మంది ఓటర్లున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు, పోలింగ్‌ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరమని చెప్పారు.

175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, 829 మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్‌ ఎఆర్‌ఓలు, 5,067 మంది సెక్టోరల్‌ అధికారులు, 5,067 మంది సెక్టోరల్‌ పోలీస్‌ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 2,48,814 మంది పోలింగ్‌ అధికారులు, 46,165 బూత్‌ స్థాయి అధికారులు, 416 మంది జిల్లా స్థాయి నోడల్‌ అధికారులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలను కల్పించామన్నారు.

ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నియోజకవర్గాల పరిధిలో మోడల్‌ కోడ్‌ బృందాలు చురుగ్గా పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో హోం, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా శాఖల ముఖ్య కార్యదర్శులు హరీశ్‌ కుమార్‌ గుప్త, శశిభూషణ్‌ కుమార్, ప్రవీణ్‌ ప్రకాశ్, స్టేట్‌ టాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, విద్యా శాఖ కమిషనర్‌ సురేశ్‌ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, సీడీఎంఏ శ్రీకేశ్‌ బాలాజీ రావు, అదనపు సీఈవో హరీంద్ర ప్రసాద్, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్‌ రవి ప్రకాశ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement