సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. ఇందులో భాగంగా రూ.3,016 కోట్ల విలువైన 13 పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించడానికి వేగంగా అడుగులు వేస్తోంది.
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా వాస్తవరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ 13 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని రెండునెలల్లో మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ప్రాజెక్టుల్లో 11 స్టార్ హోటళ్ల నిర్మాణానివి కాగా రెండు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వే నిర్మాణానికి సంబంధించినవి.
ఈ 13 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 17,032 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ సంస్థలైన ఒబరాయ్, నోవోటెల్, హయత్, హిల్టన్, మారియట్, మై ఫెయిర్, లెమన్ ట్రీ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒబరాయ్ గ్రూపు కడప గండికోట వద్ద భారీ ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు తిరుపతి విశాఖల్లో కూడా హోటళ్లు నిర్మించనుంది. అలాగే దేవభూమి రోప్‌వేస్ సంస్థ కృష్ణా, నంద్యాల జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనుంది.
రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో తొలుత 13 ప్రాజెక్టులపై దృష్టిసారించామని ఏపీ టూరిజం అథారిటీ ఎండీ కె.కన్నబాబు చెప్పారు. ఈ 13 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పూర్తయ్యాయని, ఒకసారి ఎస్‌ఐపీబీ, మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
ఇంతకాలం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment