Ropeway
-
కేదార్నాథ్ రోప్‌వేకి కేంద్ర కేబినెట్ ఆమోదం
కేదార్నాథ్ రోప్‌వే నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ .4,081 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్.. 8-9 గంటలు పట్టే కఠినమైన ట్రెక్కింగ్‌ను కేవలం 36 నిమిషాల ప్రయాణానికి తగ్గిస్తుంది. యాత్రికులకు వేగవంతమైన, సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.ప్రాజెక్టు వివరాలుసోన్ ప్రయాగ్ నుంచి కేదార్ నాథ్ ను కలుపుతూ రోప్ వే 12.9 కిలోమీటర్లు ఉంటుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రతి దిశలో గంటకు 1,800 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల అధునాతన ట్రై-కేబుల్ డిటాచబుల్ గొండోలా (3ఎస్) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్టు ఉపయోగిస్తుంది.ప్రయోజనాలుకేదార్నాథ్ రోప్ వే యాత్రికులకు గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. అన్ని రకాల వాతావరణాల్లో 12 పవిత్ర జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయాన్ని సందర్శించే భాగ్యం భక్తులకు కలుగుతుంది. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కాలినడకన, గుర్రాల ద్వారా లేదా హెలికాఫ్టర్ సర్వీసుల ద్వారా 16 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాల్సి వస్తోంది. రోప్ వే ఈ ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా వృద్ధులు, దివ్యాంగ యాత్రికులకు మరింత సమ్మిళిత అనుభవాన్ని అందిస్తుంది.అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచుతుందని, నిర్మాణం, కార్యాచరణ దశలలో గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఆతిథ్యం, ట్రావెల్, ఆహార, పానీయాల వ్యాపారాలు వంటి అనుబంధ పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇది ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.పర్యావరణ, ఆర్థిక ప్రభావంసంప్రదాయ రవాణా విధానాలతో ముడిపడి ఉన్న కేదార్నాథ్ సందర్శనలో పర్యావరణ హితంగా రోప్‌వేను రూపొందించారు. గుర్రాలు, హెలికాప్టర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా, సుస్థిర ప్రయాణ పరిష్కారాన్ని అందిస్తూ పెళుసైన హిమాలయ పర్యావరణ వ్యవస్థను పరిరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.ఆర్థికంగా, కొండ ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని పెంపొందించే దిశగా ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన అడుగు. లాస్ట్ మైల్ కనెక్టివిటీని పెంపొందించడం, మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది.మరో రోప్‌వేకీ గ్రీన్ సిగ్నల్కనెక్టివిటీని పెంచడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరో రోప్‌వేకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లోని గోవింద్‌ఘాట్ నుండి హేమకుండ్ సాహిబ్‌జి వరకు 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘పర్వతమాల పరియోజన’లో భాగంగా ఈ ప్రాజెక్ట్‌లను కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది.రూ.2,730.13 కోట్ల అంచనా వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) మోడల్ కింద ఈ రోప్‌వేను అభివృద్ధి చేయనున్నారు. గోవింద్‌ఘాట్ నుంచి ఘంగారియా స్ట్రెచ్ (10.55 కిలోమీటర్లు) కోసం మోనోకేబుల్ డిటాచబుల్ గోండోలా (ఎండీజీ) వ్యవస్థ, ఘంగారియా నుంచి హేమకుండ్ సాహిబ్ జీ స్ట్రెచ్ (1.85 కిలోమీటర్లు) కోసం ట్రైకబుల్ డిటాచబుల్ గోండోలా (3ఎస్) వ్యవస్థతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ రోప్ వే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు ప్రవేశ ద్వారంగా మారనుంది. -
పర్యాటకానికి మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. ఇందులో భాగంగా రూ.3,016 కోట్ల విలువైన 13 పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా వాస్తవరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ 13 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని రెండునెలల్లో మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ప్రాజెక్టుల్లో 11 స్టార్ హోటళ్ల నిర్మాణానివి కాగా రెండు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వే నిర్మాణానికి సంబంధించినవి. ఈ 13 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 17,032 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ సంస్థలైన ఒబరాయ్, నోవోటెల్, హయత్, హిల్టన్, మారియట్, మై ఫెయిర్, లెమన్ ట్రీ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒబరాయ్ గ్రూపు కడప గండికోట వద్ద భారీ ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు తిరుపతి విశాఖల్లో కూడా హోటళ్లు నిర్మించనుంది. అలాగే దేవభూమి రోప్‌వేస్ సంస్థ కృష్ణా, నంద్యాల జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనుంది. రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో తొలుత 13 ప్రాజెక్టులపై దృష్టిసారించామని ఏపీ టూరిజం అథారిటీ ఎండీ కె.కన్నబాబు చెప్పారు. ఈ 13 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పూర్తయ్యాయని, ఒకసారి ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
చూడముచ్చటైన జలపాతాలు.. అబ్బురపరిచే వ్యూపాయింట్లు
కనుచూపు మేర కనిపించే పచ్చని కొండలు.. జలజల జాలువారే జలపాతాలు.. అబ్బుర పరిచే వ్యూ పాయింట్లు... పిల్లలను ఆకర్షించే పార్కులు.. బోటు షికారు.. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు.. పర్యాటకులను మురిపించి.. ఆహ్లాదపరిచే ప్రదేశాలు.. పార్వతీపురం మన్యం జిల్లా సొంతం. ప్రపంచ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా మన్యం అందాలను ఓ సారి తిలకిద్దాం. సీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు... పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆహ్లాదపరుస్తున్నాయి. పచ్చని కొండల మధ్య సాగిపోయే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది. సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాచిపెంట మండలాల్లో ఉన్న 9 జలపాతాల వద్ద ఏడాది పొడవునా నీటి సవ్వడి కనిపిస్తుంది. సీతంపేట ఏజెన్సీ అందాలను గత రెండేళ్లలో 2,58,580 మంది పర్యాటకులు తిలకించారు. సీతంపేటలో గిరిజన మ్యూజియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఆదిమ మానవుడి నుంచి నేటి వరకు మానవ జీవన చక్రం, గిరిజన ఆచార, సంప్రదాయాలు, పండగలు, ప్రపంచ దేశాల ఆదిమ తెగల బొమ్మలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. మెట్టుగూడ, సున్నపుగెడ్డ, ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్లు చూసేవారికి కనువిందు కలిగిస్తాయి. కొత్తలోకాన్ని చూపిస్తాయి. మెట్టుగూడ జలపాతాన్ని ఇటీవల కాలంలో సుందరంగా తీర్చిదిద్దారు. పర్యాటకుల కోసం పగోడాలు, ఉండడానికి వీలుగా ఒక భవనం, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. సున్నపుగెడ్డ, మల్లి, కొండాడ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జగతపల్లి వ్యూపాయింట్ వద్ద రీసార్ట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడలి వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. సీతంపేటలో ఎన్టీఆర్ అడ్వెంచర్పార్కును సుందరంగా తీర్చిదిద్దారు. దీనిలో భాగంగా జలవిహార్‌లో బోటు షికారు, ఆల్టర్న్ వెహికల్ వంటివి ఏర్పాటు చేశారు. వచ్చిన పర్యాటకులు వివిధ సాహస క్రీడల్లో పాల్గొనేందుకు జెయింట్‌వీల్, హ్యాంగింగ్ బ్రిడ్జి, జలవిహార్‌లో బోటుషికారు వంటివి ఉన్నాయి. ఇక్కడ నిర్మించిన 5డీ థియేటర్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కార్తీక మాసంలో ఈ ప్రదేశాలన్నీ వనసమారాధకులతో నిండిపోతాయి. పర్యాటక శాఖ ప్రతిపాదనలు ఇలా.. తొటపల్లి రిజర్వాయర్ వద్ద సమగ్ర పర్యాటక అభివృద్ధికి సుంకి ప్రాంతంలో 22.18 ఎకరాల భూమి అవసరంగా గుర్తించారు. ఇక్కడ కార్తీకవనం, ఓపెన్ థియేటర్, ట్రైబుల్ మ్యూజియం, ట్రైబుల్ ఆర్ట్‌గ్యాలరీ అండ్ బజార్, హెలీప్యాడ్ వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఉల్లిభద్ర ప్రాంతంలో 36 ఎకరాల్లో వైఎస్సార్ హార్టీకల్చర్ పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. బోటింగ్ యాక్టివిటీ, రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్, స్పాసెంటర్, చల్లంనాయుడువలస వద్ద 3 ఎకరాల బర్డ్ శాంక్చూరీ వంటివి ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. మూడు రోప్‌వేలు... సీతంపేట మండలం ఆడలి, జగతపల్లి వ్యూపాయింట్, చంద్రమ్మతల్లి గుడి వద్ద మూడు రోప్‌వేల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జగతపల్లి హిల్ రీసార్ట్ పనులు, గుమ్మలక్ష్మీపురం మండలంలో సవరకోటపాడు వద్ద హార్టికల్చర్ ఫారం పనులు చకచకా సాగుతున్నాయి. (క్లిక్: విశాఖ అందాలను చూసేలా స్కైటవర్.. 100 కోట్లతో స్విట్జర్లాండ్..) పర్యాటకాభివృద్ధికి కృషి జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. వీటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. – నారాయణరావు, జిల్లా పర్యాటకశాఖాధికారి పర్యాటక రంగానికి పెద్దపీట పర్యాటక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మన్యం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ధి చేశాం. మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాను. దీనిపై సీఎం జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే -
జార్ఖండ్ దేవ్ గడ్ లో ప్రమాదం
-
మీ పేరు నీరజ్ లేక వందన అయితే మీకు 'ఆ రైడ్' ఫ్రీ
హరిద్వార్: మీ పేరు నీరజ్ లేదా వందన అయితే, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉచిత రోప్‌వే రైడ్ పొందండంటూ ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ప్రకటించింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, భారత మహిళా హాకీ ప్లేయర్ వందన కటారియాలను గౌరవిస్తూ సదరు రోప్‌వే కంపెనీ ఆగస్టు 11 నుంచి 20 వతేదీ వరకు అక్కడికి వచ్చే టూరిస్టులందరికీ ఉచిత రైడ్లను ప్రకటించింది. ఉషా బ్రెకో లిమిటెడ్.. ‘ఉడాన్ ఖటోలా’ బ్రాండ్ పేరుతో రోప్‌వేలను నిర్వహిస్తోంది. చండీదేవి ఆలయ దర్శనం కోసం వచ్చే నీరజ్, వందన అనే పేరుగల పర్యాటకులు రోప్‌వేను ఉచితంగా ఉపయోగించుకోగలరని హరిద్వార్ రోప్ వే కంపెనీ హెడ్ మనోజ్ దోభల్ తెలిపారు. అయితే, ఇందుకోసం వారు తమ ఆధార్ కార్డును చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆగస్టు 7 న ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్గాచరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత మహిళా హాకీ ఫార్వర్డ్ వందనా కటారియా హరిద్వార్ నివాసి కావడం ఉషా బ్రెకో లిమిటెడ్ రోప్‌వే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వందనా కటారియాను ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమించింది. -
నిరంతరం రైతన్నకు మేలు
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. రైతులకు ఇబ్బందులు లేకుండా దేశంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చెప్పారు. ఆయన శనివారం గుజరాత్లో వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, పర్యాటకాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి, పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి కాలానుగుణంగా ప్రయత్నాలను మరింత పెంచాల్సి ఉందని మోదీ అన్నారు. రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా విక్రయించుకోవడానికి అవకాశం కల్పించడం, వేలాది రైతు ఉత్పాదక సంస్థలను సృష్టించడం, మధ్యలోనే ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, పంటల బీమా పథకాన్ని మెరుగుపర్చడం, 100 శాతం వేప పూత యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం, సాయిల్ హెల్త్ కార్డులు.. వీటన్నింటి లక్ష్యం వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడమేనని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఇలాంటి చర్యలతో రైతాంగానికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. మన రైతన్నలకు మేలు చేసే చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అక్కడ సౌకర్యాలు కల్పిస్తే.. గుజరాత్ ప్రభుత్వం అమలు చేయనున్న కిసాన్ సూర్యోదయ యోజన(కేఎస్‌వై)ను ప్రధాని ప్రారంభించారు. ఈ పథకం కింద వ్యవసాయ రంగానికి పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తారు. గిర్నార్ కొండపై ఏర్పాటు చేసిన రోప్‌వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల ఈ రోప్‌వే రాష్ట్రంలో పర్యాటకులను ఆకట్టుకుంటుందని అధికారులు చెప్పారు. ఇది ఆసియాలోనే పొడవైన రోప్‌వే. పర్యాటక ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని చెప్పారు. ప్రపంచానికి దారి చూపుతున్న భారత్ సౌర విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతోందని మోదీ వ్యాఖ్యానించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో ఆరో స్థానానికి చేరిందన్నారు. గత ఆరేళ్లలోనే ఈ ఘనత∙సాధ్యమైందన్నారు. ‘ఒక సూర్యుడు.. ఒక ప్రపంచం.. ఒక గ్రిడ్’ విషయంలో ప్రపంచానికి భారత్ దారి చూపుతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. కిసాన్ సూర్యోదయ యోజన కింద వ్యవసాయానికి సూర్యోదయం నుంచి ఉదయం 9.30 గంటలకు వరకు కరెంటు సరఫరా చేస్తారని, దీనివల్ల లక్షలాది మంది రైతుల్లో పెనుమార్పులు రావడం ఖాయమన్నారు. పగటి పూటే కరెంటు సరఫరా ఉంటుంది కాబట్టి సూక్ష్మ సేద్యం ప్రారంభిస్తే వ్యవసాయంలో మంచి ఫలితాలు వస్తాయని రైతులకు సూచించారు. -
పారాచూట్ తెరుచుకోక..
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వైద్యుడు హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలి విహారయాత్రకు వెళ్లి అక్కడ మృతి చెందారు. దీంతో కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ పరిధిలోని సమతాపురి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లక్క వేమారెడ్డి–లక్ష్మిల దంపతుల చిన్న కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(24) నగరంలోని ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమతాపురి కాలనీకి చెందిన స్నేహితులు విశాల్, అఖిల్‌తో కలసి హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలికి బుధవారం వెళ్లారు. శనివారం విహార యాత్రలో రోప్‌వేలో ప్రయాణిస్తుండగా వైర్లు తెగిపడ్డాయి. దీంతో పారాచూట్ సహాయంతో కిందికి దిగేందుకు ప్రయత్నించగా అది సరిగ్గా తెరుచుకోకపోవడంతో కిందపడి పోయారు. దీంతో చంద్రశేఖర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా మాట్లాడించి మృత దేహాన్ని నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
శ్రీశైలం రోప్‌వే 12వ తేదీ వరకు బంద్
సాక్షి, కర్నూలు: శ్రీశైలంలో పాతాళాగంగకు వెళ్లే రోప్‌వే మార్గాన్ని ఈ నెల 12వ తేదీ వరకు బంద్ చేశారు. కొత్తగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్ వద్ద కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే. భద్రతా చర్యల్లో భాగంగా రోప్‌వే మార్గాన్ని నాలుగు రోజులపాటు మూసివేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మర్మతుల పేరిట రోప్‌వే మార్గాన్ని మూసివేసినట్లు టూరిజం అధికారులు ప్రకటించారు. అయితే 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా వీవీఐపీలకు మాత్రమే రోప్‌వే మార్గం గుండా పాతాళాగంగ వీఐపీ ఘాట్‌కు చేరుకునేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. వద్ధులు, వికలాంగులను.. ప్రత్యేక బస్సుల ద్వారా పాతాళాగంగ వద్దకు తరలించనున్నారు. -
గాలిలో వేలాడుతు పెళ్లి చేసుకున్న జంట
-
ఘాటు చర్చ
– నిపుణుల కమిటీ చెబితే పాతాళగంగ ఘాట్‌ను మూసివేస్తా... – రోప్వేనూ మూసివేస్తా.. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న కలెక్టర్ – భద్రతా కోణంలో సూచనలు చేస్తున్నామన్న ఎస్పీ కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడిన ఘటన కలెక్టరేట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం కలెక్టరేట్లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంపైనే ప్రధానంగా చర్చ సాగింది. పుష్కరాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో భద్రతా కోణంలో కొన్ని సూచనలు చేసే ప్రయత్నం ఎస్పీ ఆకే రవికృష్ణ చేయగా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని అవసరమైతే ఘాట్నే మూసివేస్తామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ స్పష్టం చేశారు. ఈ విషయంపైనే ఇరువురు అధికారుల మధ్య సమావేశంలో ప్రధానంగా చర్చ జరగడం గమనార్హం. నిపుణుల కమిటీ చెబితే రోప్‌వేను కూడా మూసివేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం మీద శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడిన ఘటన జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భయాందోళనలకు గురి అవుతారనే.. కొండ చరియలు విరిగి పడిన ప్రాంతానికి వెళితే ప్రజలు మరింత భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్లలేదని కలెక్టర్ వివరించారు. సంబంధిత శాఖల అధికారులు దగ్గరుండీ పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నిపుణుల కమిటీ ఆదేశిస్తే ఘాట్‌ను మూసివేయడానికి సిద్ధమని ఆయన వివరించారు. నీటిపారుదల శాఖ, భూగర్భ జలశాఖలు దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నాయని.. వాటి నివేదికలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్లను నీటిపారుదల శాఖ, తదితర శాఖలు చేపడుతున్నాయని ఏదీ జరిగినా బాధ్యత వాటిదేనన్నారు. తాను ఏమైన చెప్పి పనులు చేయిస్తే.. ఏదైన జరిగితే ‘‘కలెక్టర్ చెప్పారు.. చేశామని’’ చెబుతారని.. అందువల్ల ఘాట్ పనులు ఆయా శాఖలే చేపట్టాలన్నారు. ఎస్పీ ఘాట్ల భద్రతపై వివరించడానికి ప్రయత్నించిన వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుంటూ ఒకింత అసహనంతో మాట్లాడారు. ఒక హెచ్ఓడీగా ఏదైన సలహా ఇవ్వవచ్చని.. అయితే అది వివాదాస్పదం కాకూడదని వివరించారు. ఎస్పీ స్పందిస్తూ.. ఎలాంటి దస్సంఘటనలకు తావులేకుండా తీసుకోవాల్సిన భద్రత చర్యలపై తాము కొన్ని సూచనలు చేశామని తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ సూచనలు చేస్తున్నట్లు వివరించారు. సంపూర్ణ సమాచారంతో పుష్కర మాన్యువల్ పుష్కరాలు నిర్వహించే సంగమేశ్వరం, శ్రీశైలం పుణ్య క్షేత్రాల్లో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా అధికారులు నిర్వహిస్తున్న విధులు, సిబ్బంది కేటాయింపులు ప్రాంతాల వారీగా తెలియజేస్తూ పుష్కరాల మాన్యువల్ రూపొందిస్తామన్నారు. పుష్కరాల పనులపై విధి విధానాలపై ఆగస్టు 2న శాఖల వారీగా శిక్షణనిస్తామన్నారు. ఆగస్టు 8వ తేదీ నాటికి అధికారులు, సిబ్బంది కేటాయించిన స్థానాలకు వెళ్లాలని సూచించారు. 9, 10, 11 తేదీల్లో ఏర్పాట్లను సరిచూసుకోవాలన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని వివరించారు. శ్రీశైలంలో పుష్కరాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఇన్చార్జి జేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తిరుమల కొండకు రోప్ వే?
ప్రత్యామ్నాయ దిశగా టీటీడీ పదిహేనేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాల్లో ఫలితాలిస్తున్న రోప్‌వేలు తిరుమల: వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డు ధ్వంసం కావడం, ఆ దారి భవిష్యత్‌లో మరింత దుస్థితికి చేరొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యామ్నాయ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటికే లింకు రోడ్డు విస్తరణ పై మొగ్గుతున్నప్పటికీ రోప్‌వే ఏర్పాటుపై కూడా చర్చిస్తోంది. అప్పుడు ఆఖరు దశలో ఆగింది.. పదిహేనేళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకొండకు రోప్‌వే ఏర్పాటు చేయాలని దాదాపు నిర్ణయించారు. టూరిజం శాఖ నేతృత్వంలో ‘రైట్స్’ సంస్థ పనుల నిర్వహణకు అనుమతులు కూడా పొందింది. పనులను టూరిజం శాఖ చేపట్టడంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుమల పర్యాటక ప్రాంతంగా మారుతుందన్న విమర్శలు అప్పట్లో తలెత్తాయి. దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారు కొలువైన సన్నిధి కంటే ఎత్తులో ప్రయాణించకూడదన్న ఆగమ అభ్యంతరాలు కూడా ఎదురుకావడంతో రోప్‌వే కథ అంతటితో పరిసమాప్తమైంది. అయితే ప్రస్తుత క్లిష్టపరిస్థితుల దృష్ట్యా ఇలాంటివి తప్పు కాదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలయంతోపాటు శేషాచల పర్వత శ్రేణుల్లో విమానయానం నిషేధించాలన్న డిమాండ్ ఉన్న తరుణంలో మార్చి 20, 2014న ఆలయానికి కూతవేటు దూరంలోని కాకులకొండ అడవిలో కార్చిచ్చు రేగడం, ‘ఆపరేషన్ శేషాచలం’ పేరుతో వాయుసేన హెలికాప్టర్‌తో నీళ్లు చల్లి మంటలను అదుపు చే సిన సందర్భాన్ని అధికారులు, నిపుణులు గుర్తు చేస్తున్నారు. విపత్తుల నష్టాన్ని నివారించేందుకు ఇటువంటికి చేపడుతున్నప్పుడు భక్తుల క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని రోప్‌వే నిర్మించడంలో తప్పులేదని అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాలకు రోప్‌వేలు ఉన్నాయని, వాటివల్ల భక్తులు క్లిష్ట పరిస్థితుల్లోకూడా కొండపైకి వెళుతున్నారని చెబుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయానికి రోప్‌వే ద్వారా ఎక్కువ మంది భక్తులు సురక్షితంగా వెళుతున్నారని గుర్తు చేస్తున్నారు. కేవలం రోప్‌వేల ద్వారానే వెళ్లగలిగే దేవాలయాలుకూడా ఉన్నాయంటున్నారు. ఘాట్ రోడ్డు దుస్థితితో మళ్లీ తెరపైకి.. రెండో ఘాట్ రోడ్డు ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయం లేకపోతే ఇబ్బందులు తప్పవన్న నిపుణుల హెచ్చరికల మేరకు రోప్ వే ఏర్పాటుపై ప్రస్తుతం చర్చ మొదలైంది. విపత్తుకు ప్రత్యామ్నాయంతోపాటు భక్తుల రక్షణకోసం చేపడుతున్న చర్యలు కావడంతో రోప్ వే ఏర్పాటుకు అన్ని వర్గాల వారి మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోప్ వే వస్తే పగలు మాత్రమే ఘాట్ రోడ్ల వినియోగం.. రోప్‌వే అందుబాటులోకి వస్తే రెండు ఘాట్‌రోడ్లను పగలు మాత్రమే వినియోగించి రాత్రి సమయాల్లో మూసివేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల శ్రీవేంకటేశ్వర అభయారణ్య పరిధిలోకి వచ్చే రెండు ఘాట్‌రోడ్లలోనూ అరుదైన జంతు, జీవజాలం వృద్ధిచెందడంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని లెక్కలు వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండానే 24 గంటలూ భక్తులకు ప్రయాణ వసతి కల్పించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యంతరం తెలిపిన శ్రీవారి ఆలయ ఆగమ పండితులు తాజా ప్రతిపాదనకు అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే. -
కలిసుంటే... కాసులపంటే..
సాక్షి, విజయవాడ : రెండు శాఖల మధ్య సమన్వయ లోపం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని చెబుతున్నారు. మరోవైపు ‘టెంపుల్ టూరిజం’ అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు ప్రకటించారు. అయితే, పర్యాటక, దేవాదాయ శాఖల మధ్య సమన్వయలోపం వల్ల పాల కుల ప్రకటనలు ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యాయి. కీలకమైన కార్యక్రమాలను ఎవరికి వారే వేర్వేరుగా నిర్వహించుకుంటున్నారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రెండు శాఖలు కలిసి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడంలేదు. రెండు శాఖల అధికారులు కలిసి కార్యక్రమాలు రూపొందిస్తే కాసుల పంట పండుతుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వచ్చినా... ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రోజూ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చూడదగిన ప్రదేశాల వివరాలు తెలియజేసేందుకు దేవాదాయ, పర్యాటక శాఖలు చర్యలు తీసుకోవడంలేదు. కొం దరు భక్తులు దుర్గగుడి అధికారులను అడిగినా పర్యాటక శాఖ ప్యాకేజీలు తమకు తెలియవని బదులిస్తున్నారు. దీంతో భక్తు లు అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోతున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు, తమ శాఖ ప్యాకేజీల గురించి వివరిస్తే వాటిని తిలకిం చాలని భక్తులకు ఆసక్తి గలిగే అవకాశం ఉంటుంది. ఇతర రాష్ట్రాల భక్తులు పర్యాటక శాఖ ఆధ్వర్యాన పర్యటిస్తున్న సమయంలో దుర్గగుడి వివరాలు అడిగినా చె ప్పడం లేదని తెలుస్తోంది. ఈ రెండు శాఖ లు పరస్పరం సహకరించుకుం టే ఆదా యం భారీగా పెరిగే అవకాశం ఉంది. దుర్గగుడిని కలుపుతూ ప్యాకేజీ లేదు రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం అయిన దుర్గగుడిని కలుపుతూ పర్యాటక శాఖ ఏ విధమైన ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటి వరకు రూపొందించలేదు. దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల విరమణ సమయంలో ఎంతోమంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తారు. ఆ సమయంలో అమ్మవారి ప్రత్యేక దర్శనంతోపా టు కృష్ణా, గుంటూరు జిల్లాలోని ముఖ్య దేవాలయాలను సందర్శించే విధంగా పర్యాటక శాఖ ప్యాకేజీలు తయారు చేయవచ్చు. కార్తీక మాసంలోనూ అంతే.. కార్తీకమాసంలో ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా పంచారామాలకు భక్తులను తీసుకెళ్తుంది. పర్యాటక శాఖ కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించుకుంటోంది. భవానీ ద్వీపానికి ఇతర ప్రాంతాల నుంచి వనభోజనాలకు వచ్చే భక్తుల్లో చాలా తక్కువ మంది మాత్రమే దుర్గగుడికి వెళ్తున్నారు. వీరు దుర్గమ్మను దర్శించుకునేలా పర్యాటక శాఖ కార్యక్రమాలు రూపొం దించే అవకాశం ఉంది. గదులు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు... దుర్గగుడికి వచ్చే భక్తులకు రూముల కొరత తీవ్రంగా ఉంది. నగరంలో హోటళ్లలో దిగి అమ్మవారి దర్శనానికి రావాల్సి వస్తోంది. భవానీ ద్వీపంలో, పున్నమి గార్డెన్స్‌లోని పర్యాటక శాఖ రూములు ఖాళీగా ఉంటున్నాయి. ఈ రెండు శాఖల మధ్య సమన్వ యం ఉంటే భక్తులకు ఇబ్బంది లేకుండా రూమ్‌లు సర్దుబాటు చేసే అవకాశం ఉంది. కాగితాలకే పరిమితమైన రోప్‌వే పర్యాటక శాఖ ఆధ్వర్యాన సీతమ్మవారి పాదాల నుంచి దుర్గగుడికి రోప్ వే ఏర్పాటుకు ప్రతిపాదనలు అర్ధ శతాబ్దంగా ఉన్నా యి. దుర్గగుడికి వచ్చే భక్తులకు ఉపయోగపడుతుంది. రెండు శాఖల మధ్య సమన్వ యం లేకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇప్పటికైనా రెండు శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే ఆదాయాన్ని పెంచుకోవచ్చు.