ఘాటు చర్చ
ఘాటు చర్చ
Published Wed, Jul 27 2016 9:09 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– నిపుణుల కమిటీ చెబితే పాతాళగంగ ఘాట్‌ను మూసివేస్తా...
– రోప్‌వేనూ మూసివేస్తా.. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న కలెక్టర్
– భద్రతా కోణంలో సూచనలు చేస్తున్నామన్న ఎస్పీ
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడిన ఘటన కలెక్టరేట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం కలెక్టరేట్‌లో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో జరిగిన ప్రమాదంపైనే ప్రధానంగా చర్చ సాగింది. పుష్కరాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో భద్రతా కోణంలో కొన్ని సూచనలు చేసే ప్రయత్నం ఎస్పీ ఆకే రవికృష్ణ చేయగా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని అవసరమైతే ఘాట్‌నే మూసివేస్తామని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ స్పష్టం చేశారు. ఈ విషయంపైనే ఇరువురు అధికారుల మధ్య సమావేశంలో ప్రధానంగా చర్చ జరగడం గమనార్హం. నిపుణుల కమిటీ చెబితే రోప్‌వేను కూడా మూసివేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. మొత్తం మీద శ్రీశైలంలో కొండచరియలు విరిగిపడిన ఘటన జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
భయాందోళనలకు గురి అవుతారనే..
కొండ చరియలు విరిగి పడిన ప్రాంతానికి వెళితే ప్రజలు మరింత భయాందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో తాను అక్కడికి వెళ్లలేదని కలెక్టర్ వివరించారు. సంబంధిత శాఖల అధికారులు దగ్గరుండీ పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నిపుణుల కమిటీ ఆదేశిస్తే ఘాట్‌ను మూసివేయడానికి సిద్ధమని ఆయన వివరించారు. నీటిపారుదల శాఖ, భూగర్భ జలశాఖలు దీనిపై నిశితంగా పరిశీలిస్తున్నాయని.. వాటి నివేదికలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఘాట్‌లను నీటిపారుదల శాఖ, తదితర శాఖలు చేపడుతున్నాయని ఏదీ జరిగినా బాధ్యత వాటిదేనన్నారు. తాను ఏమైన చెప్పి పనులు చేయిస్తే.. ఏదైన జరిగితే ‘‘కలెక్టర్ చెప్పారు.. చేశామని’’ చెబుతారని.. అందువల్ల ఘాట్ పనులు ఆయా శాఖలే చేపట్టాలన్నారు. ఎస్పీ ఘాట్‌ల భద్రతపై వివరించడానికి ప్రయత్నించిన వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుంటూ ఒకింత అసహనంతో మాట్లాడారు. ఒక హెచ్‌ఓడీగా ఏదైన సలహా ఇవ్వవచ్చని.. అయితే అది వివాదాస్పదం కాకూడదని వివరించారు. ఎస్పీ స్పందిస్తూ.. ఎలాంటి దస్సంఘటనలకు తావులేకుండా తీసుకోవాల్సిన భద్రత చర్యలపై తాము కొన్ని సూచనలు చేశామని తెలిపారు. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఈ సూచనలు చేస్తున్నట్లు వివరించారు.
సంపూర్ణ సమాచారంతో పుష్కర మాన్యువల్
పుష్కరాలు నిర్వహించే సంగమేశ్వరం, శ్రీశైలం పుణ్య క్షేత్రాల్లో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా అధికారులు నిర్వహిస్తున్న విధులు, సిబ్బంది కేటాయింపులు ప్రాంతాల వారీగా తెలియజేస్తూ పుష్కరాల మాన్యువల్ రూపొందిస్తామన్నారు. పుష్కరాల పనులపై విధి విధానాలపై ఆగస్టు 2న శాఖల వారీగా శిక్షణనిస్తామన్నారు. ఆగస్టు 8వ తేదీ నాటికి అధికారులు, సిబ్బంది కేటాయించిన స్థానాలకు వెళ్లాలని సూచించారు. 9, 10, 11 తేదీల్లో ఏర్పాట్లను సరిచూసుకోవాలన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని వివరించారు. శ్రీశైలంలో పుష్కరాల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఇన్‌చార్జి జేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement