అమ్మవారి ఆలయంలోకి వెళ్లే ద్వారం వద్ద కనిపించని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు
భద్రత..మల్లన్నకెరుక?
Published Tue, Aug 2 2016 12:08 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
– అమలుకు నోచుకోని ఎస్పీ ప్రతిపాదనలు
– కనిపించని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు
– సెల్ జామర్ల జాడ కరువు
– సోలార్ ఫెన్సింగ్ ఊసే లేదు
శ్రీశైలం:
శ్రీశైలం..జ్యోతిర్లింగ క్షేత్రం. ఆగస్టు 12వ తేదీన ఇక్కడ కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. పాతాళగంగ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పుష్కర ఘాట్ వద్ద ఇటీవల కొండ చరియలు విరిగిపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జరిగిన పుష్కరాల సమీక్షలో మొత్తం 22 భద్రతా అంశాలపై కలెక్టర్ విజయమోహన్‌కు జిల్లా ఎస్పీ రవికష్ణ నివేదిక సమర్పించారు. రెండు, మూడు మినహా మిగిలినవి ఏవీ ఇప్పటి వరకు అమలు కాలేదని ఎస్పీ స్వయంగా చెప్పారు. కృష్ణా పుష్కరాలకు ముందే ఆగస్టు 3 నుంచి శ్రావణమాసం ప్రారంభమవుతోంది. భక్తులరద్దీ లక్షల సంఖ్యలో ఉంటుందని, సుమారు 30 లక్షలకు పైగా భక్తులు పుష్కరాలలో పవిత్ర పుణ్యస్నానాలు చేసుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే క్షేత్రంలో భద్రత ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన మధుసూదన్‌రెడ్డి మహాశివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చి పలు సూచనలను జారీ చేశారు. అవేవి గడిచిన 9 ఏళ్లుగా అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత జిల్లా ఎస్పీ రవికష్ణ కూడా ఆలయప్రాంగణంలోకి ప్రవేశించడానికి ముందే బ్యాగ్ స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు నివేదికను అందజేశారు. అలాగే దేవస్థానం అధికారులకు కూడా ఈ మేరకు భద్రతా ఏర్పాట్లను చేయాల్సిందిగా సూచించారు. అయితే ఇప్పటి వరకు ప్రధానాలయ గోపురం ముందు రెండు డోర్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్లు మినహా ఎక్కడా అమర్చలేదు. కేవలం సీసీ కెమెరాలతో నిఘాకు మాత్రమే ఆలయం పరిమితమైంది.
ఆలయ రక్షణ కోసం ఏం చేయాలంటే...
· మల్లన్న ఆలయరక్షణ చర్యలలో భాగంగా ఆలయప్రాకార కుడ్యానికి నాలుగు వైపులా వాచ్ టవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
· ప్రవేటు భద్రతా సిబ్బంది ప్రస్తుతం 70 మంది మాత్రమే ఉన్నారు. మరో 40 మందికిపైగా నియమించాల్సి ఉంది.
· కోట గోడ పై భాగం చుట్టూ నలువైపులా సోలార్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలి.
· బ్యాగ్ స్కానర్లను ఆలయప్రవేశానికి ముందే ఏర్పాటు చేయాలి.
· ఆలయప్రాంగణంలో సెల్ జామర్లను వినియోగించాలి.
· డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఆలయం ముందు భాగం, దర్శనం చేసుకుని వెళ్లే ఎగ్జిట్‌లో ఏర్పాటు చేయాలి.
· మెటల్ డిటెక్టర్లు పనితీరు ఎప్పటికప్పుడు గమనించాలి.
·ప్రస్తుతం ఎప్పీఎఫ్ సిబ్బంది అమ్మవారికి గుడికి మాత్రమే పరిమితమయ్యారు. స్వామివారి ఆలయప్రాంగణంలో కూడా వీరిని నియమించాలి.
· ఆలయప్రాంగణంలో ఏఆర్ సిబ్బందిని నియమించాలి.
·అధునాతన స్కానర్లను ఏర్పాటు చేయాలి.
· క్లాక్ రూమ్ వద్ద మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానర్లు ఏర్పాటు చేయాలి.
·అమ్మవారి గర్భాలయానికి ఆగ్నేయ దిశగా ఉన్న ప్రాకారకుడ్యం ఎత్తు పెంచాలి.
Advertisement