తిరుమల కొండకు రోప్ వే? | Ropeway in tirupati | Sakshi
Sakshi News home page

తిరుమల కొండకు రోప్ వే?

Published Sat, Nov 14 2015 11:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:29 PM

తిరుమల కొండకు రోప్ వే?

తిరుమల కొండకు రోప్ వే?

ప్రత్యామ్నాయ దిశగా టీటీడీ
పదిహేనేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి
ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాల్లో ఫలితాలిస్తున్న రోప్‌వేలు
 
తిరుమల: వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డు ధ్వంసం కావడం, ఆ దారి భవిష్యత్‌లో మరింత దుస్థితికి చేరొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యామ్నాయ దిశగా ఆలోచిస్తోంది. ఇప్పటికే లింకు రోడ్డు విస్తరణ పై మొగ్గుతున్నప్పటికీ రోప్‌వే ఏర్పాటుపై కూడా చర్చిస్తోంది.
 
అప్పుడు ఆఖరు దశలో ఆగింది..
పదిహేనేళ్ల క్రితం తిరుపతి నుంచి తిరుమలకొండకు రోప్‌వే  ఏర్పాటు చేయాలని దాదాపు నిర్ణయించారు. టూరిజం శాఖ నేతృత్వంలో ‘రైట్స్’ సంస్థ  పనుల నిర్వహణకు అనుమతులు కూడా పొందింది. పనులను టూరిజం శాఖ చేపట్టడంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుమల పర్యాటక ప్రాంతంగా మారుతుందన్న విమర్శలు అప్పట్లో తలెత్తాయి.  దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారు కొలువైన సన్నిధి కంటే ఎత్తులో ప్రయాణించకూడదన్న ఆగమ అభ్యంతరాలు కూడా ఎదురుకావడంతో రోప్‌వే కథ అంతటితో పరిసమాప్తమైంది.
 
అయితే ప్రస్తుత క్లిష్టపరిస్థితుల దృష్ట్యా ఇలాంటివి తప్పు కాదన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ఆలయంతోపాటు శేషాచల పర్వత శ్రేణుల్లో విమానయానం నిషేధించాలన్న డిమాండ్ ఉన్న తరుణంలో మార్చి 20, 2014న ఆలయానికి కూతవేటు దూరంలోని కాకులకొండ అడవిలో  కార్చిచ్చు రేగడం, ‘ఆపరేషన్ శేషాచలం’ పేరుతో వాయుసేన హెలికాప్టర్‌తో నీళ్లు చల్లి మంటలను అదుపు చే సిన సందర్భాన్ని అధికారులు, నిపుణులు గుర్తు చేస్తున్నారు.
 
విపత్తుల నష్టాన్ని నివారించేందుకు ఇటువంటికి చేపడుతున్నప్పుడు భక్తుల క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని రోప్‌వే నిర్మించడంలో తప్పులేదని అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన ప్రముఖ దేవాలయాలకు రోప్‌వేలు ఉన్నాయని, వాటివల్ల భక్తులు క్లిష్ట పరిస్థితుల్లోకూడా కొండపైకి వెళుతున్నారని చెబుతున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం  హరిద్వార్‌లోని మానసాదేవి ఆలయానికి రోప్‌వే ద్వారా ఎక్కువ మంది భక్తులు సురక్షితంగా వెళుతున్నారని గుర్తు చేస్తున్నారు. కేవలం రోప్‌వేల ద్వారానే వెళ్లగలిగే దేవాలయాలుకూడా ఉన్నాయంటున్నారు.
 
ఘాట్ రోడ్డు దుస్థితితో మళ్లీ తెరపైకి..
రెండో ఘాట్ రోడ్డు ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయం లేకపోతే ఇబ్బందులు తప్పవన్న నిపుణుల హెచ్చరికల మేరకు రోప్ వే ఏర్పాటుపై ప్రస్తుతం చర్చ మొదలైంది. విపత్తుకు ప్రత్యామ్నాయంతోపాటు  భక్తుల రక్షణకోసం చేపడుతున్న చర్యలు కావడంతో రోప్ వే ఏర్పాటుకు అన్ని వర్గాల వారి మద్దతు లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
రోప్ వే వస్తే పగలు మాత్రమే ఘాట్ రోడ్ల వినియోగం..
రోప్‌వే అందుబాటులోకి వస్తే రెండు ఘాట్‌రోడ్లను పగలు మాత్రమే వినియోగించి రాత్రి సమయాల్లో మూసివేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల శ్రీవేంకటేశ్వర అభయారణ్య పరిధిలోకి వచ్చే రెండు ఘాట్‌రోడ్లలోనూ అరుదైన జంతు, జీవజాలం వృద్ధిచెందడంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని లెక్కలు వేస్తున్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండానే 24 గంటలూ భక్తులకు ప్రయాణ వసతి కల్పించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యంతరం తెలిపిన శ్రీవారి ఆలయ ఆగమ పండితులు తాజా ప్రతిపాదనకు అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement