సాక్షి, అమరావతి: గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన 74వ గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో 26న రాష్ట్ర స్థాయిలో వేడుకలను నిర్వహించేందుకు వీలుగా వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా గణతంత్ర దినోత్సవ పరేడ్ చీఫ్ కోఆర్డినేటర్ సంబంధిత విభాగాలు, సంస్థల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల్లో గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులు పాల్గొంటున్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో ఏర్పాట్లు చేయాలని సీఎస్ డా.జవహర్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
వీవీఐపీల రాకపోకలపై సంబంధిత వ్యక్తిగత కార్యదర్శులతో సమన్వయం చేసుకుని ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. స్టేడియంలో వేడుకల రిహార్సల్స్ నిర్వహించాలని, ఈ నెల 24న ఫుల్ డ్రస్ రిహార్సల్స్ నాటికి పరేడ్‌ను పూర్తిగా సిద్ధం చేయాలని చెప్పారు. వీవీఐపీ, వీఐపీలు ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ప్రధాన వేదికను ప్రొటోకాల్ నిబంధనలకు అనుగుణంగా రూపొందించాలని, స్టేడియంలో పోర్ట్ వాల్ డిజైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శకటాలను ఆకర్షణీయంగా రూపొందించాలి
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా వివిధ శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు, పథకాలపై వివిధ శాఖలకు చెందిన శకటాలను(టాబ్లూస్) ఆకర్షణీయంగా రూపొందించి ప్రదర్శనకు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. వేడుకల్లో సికింద్రాబాద్ నుంచి బ్యాండ్ ఆర్మీ కంటెంజెంట్‌తో పాటు రాష్ట్ర పోలీస్ బెటాలియన్స్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, పోలీస్ బ్యాండ్ వంటి విభాగాలు కవాతులో పాల్గొంటాయని తెలిపారు.
అలాగే వేడుకలను రాష్ట్ర ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 26వ తేదీ సాయంత్రం రాజ్ భవన్‌లో నిర్వహించే తేనీటి(హై టీ) విందుకు రాజ్ భవన్ అధికారుల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యంరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, సంయుక్త కలెక్టర్ ఎస్.నుపూర్ అజయ్, మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, విజయవాడ సబ్ కలెక్టర్ అదితి సింగ్ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం
Published Thu, Jan 12 2023 6:10 AM | Last Updated on Thu, Jan 12 2023 7:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment