వెబినార్‌లో మాట్లాడుతున్న ఈవో జవహర్‌రెడ్డి
తిరుమల: తిరుమలలోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి జన్మస్థలమని వాల్మీకి రామాయణంలో స్పష్టంగా ఉందని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అనవసరమని చెప్పారు. టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి’ అంశంపై శుక్రవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది.
భారతీ మహాస్వామి వర్చువల్ విధానంలో పాల్గొని మాట్లాడుతూ కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా చెప్పుకుంటున్నామన్నారు. బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. దీంతో పాటు అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని పేర్కొన్నట్లు వివరించారు. కిష్కిందకు శాస్త్ర, పురాణ ప్రమాణాలు లేవని, సంస్కృతం, పురాణం, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉండదన్నారు.
నమ్మకం కుదిరాకే ప్రకటించాం: ఈవో జవహర్‌రెడ్డి
టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, తాను ఈవోగా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమనే విషయం గురించి పలువురు మెయిల్స్ ద్వారా సూచనలు చేశారని చెప్పారు. పలువురు ప్రముఖ పండితులతో మాట్లాడితే ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించినట్టు తెలిపారు. వీటిపై నమ్మకం కుదిరాకే 2020 డిసెంబర్‌లో పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఈవో వెల్లడించారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించినట్లు తెలిపారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చ పెట్టామని, వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉండడంతో వారితో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
ఆక్స్‌ఫర్డ్ పుస్తకంలోనూ ఆధారాలు: మాడభూషి శ్రీధర్
మహీంద్రా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల డీన్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, రామాయణం జరిగిందనడానికి ధనుష్కోటిలోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ తీసుకున్న పురాణ ఆధారాలు చాలా బాగున్నాయన్నారు. 2007లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ముద్రించిన ‘హనుమాన్ కేం’ పుస్తకంలోనూ అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని రాశారన్నారు. టీటీడీ కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయం రాశారని తెలిపారు.
ప్రపంచానికి తెలియాలనే వెబినార్: మురళీధరశర్మ
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య వి.మురళీధరశర్మ మాట్లాడుతూ, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించడానికి పండిత పరిషత్ పరిశోధన ప్రపంచానికి తెలియాలనే వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్ర పుస్తకం ముద్రిస్తామన్నారు. జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగరామానుజాచార్యులు, పుణె దక్కన్ కాలేజీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంపటి కుటుంబరావు శాస్త్రి, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె.మునిరత్నం, ఆచార్య శంకరనారాయణ, ఆర్కియాలజీ, మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ విజయకుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ.ప్రసన్నకుమార్, విశ్రాంత సంస్కృతోపన్యాసకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment