
సాక్షి, అమరావతి: వ్యవసాయరంగంలో కిసాన్ డ్రోన్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలిదశలో వచ్చే నెలలో 614 కిసాన్ డ్రోన్‌లను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోంది. తొలిదశలో గుర్తించిన 614 మండలాల్లో ఒక్కో కస్టమ్ హైరింగ్ కేంద్రానికి ఒక డ్రోన్ వినియోగంలోకి తీసుకువచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు.
పట్టణ, గిరిజన, ఉద్యాన మండలాలను మినహాయించి మిగతా 614 మండలాల్లో ఒక్కోకస్టమ్ హైరింగ్ సెంటర్‌కు ఒక డ్రోన్ చొప్పున వినియోగంలోకి తీసుకువచ్చేందుకు జిల్లాల వారీగా ప్రణాళికలను రూపొందించినట్లు సీఎస్ స్పష్టం చేశారు. ప్రతీ కిసాన్ డ్రోన్ కస్టమ్ హైరింగ్ కేంద్రానికి ఒక శిక్షణ పొందిన సరి్టఫైడ్ డ్రోన్ పైలెట్‌ను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 416 మండలాలకు సంబంధించి కిసాన్ డ్రోన్ పైలెట్లను శిక్షణ కోసం ప్రతిపాదించారని, మిగతా 198 మండలాలకు సంబంధించి కిసాన్ డ్రోన్ పైలెట్ల శిక్షణ కోసం త్వరగా ప్రతిపాదనలను పంపించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు సీఎస్ సూచించారు.
రాష్ట్రంలో డ్రోన్ శిక్షణ కేంద్రాలు రెండు ఉన్నాయని, ఈ కేంద్రాలకు నెలకు 100 మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉందని సీఎస్ తెలిపారు. ఇప్పటికే 376 కిసాన్ డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇవ్వడం పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరో 184 మంది డ్రోన్ పైలెట్లకు త్వరలో శిక్షణ ఇవ్వడం పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా గుంటూరు లాంలోని వ్యవసాయ డ్రోన్ పరిశోధనా కేంద్రంలోను, అలాగే తాడేపల్లిలోని డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కిసాన్ డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్నారు.
వివిధ వ్యవసాయ కార్యకలాపాలతో ముడిపడి ఉన్న మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పంటల అంచనా, భూ రికా>ర్డుల డిజిటలైజేషన్, పురుగుమందులు, పోషకాలను పిచికారీ వంటి పనులకు డ్రోన్‌లు వినియోగించనున్నారు. డ్రోన్ల వినియోగంతో రైతులకు వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment