సాక్షి, అమరావతి: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఈలను) రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇతర ఎంఎస్‌ఈలు, ప్రభుత్వ సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న సూక్ష్మ, చిన్న తరహా యూనిట్లకు అండగా నిలుస్తోంది. ఈ పరిశ్రమల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఏపీ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ వాటి బకాయిల వసూళ్లలోనూ సహాయ పడుతోంది.
ఇప్పటివరకు ఈ కౌన్సిల్‌కు రూ.654 కోట్ల బకాయిలకు సంబంధించిన 534 ఫిర్యాదులు రాగా వాటిలో 149 ఫిర్యాదులను పరిష్కరించింది. తద్వారా రూ.97 కోట్ల బకాయిలకు పరిష్కారం చూపింది. మిగిలిన 385 కేసుల్లో 60 కేసులను ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో పరిష్కరించనున్నట్లు కౌన్సిల్ సభ్యుడు, ఫెడరేషన్ ఆఫ్ ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఫాఫ్సియా) అధ్యక్షుడు మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.
కౌన్సిల్ ముందుకు కొత్తగా 65 కేసులు వచ్చాయని, మరో 78 కేసులు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. ఎక్కువ సమస్యలను ఇరు వర్గాలతో మాట్లాడటం ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సూక్ష్మ, చిన్నతరహా సంస్థలు ఆర్థిక ఇబ్బందులతో రుణాలను చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారకుండా ఎంఎస్‌ఎంఈడీ యాక్ట్ 2006 కింద ప్రభుత్వం ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది.
పరిశ్రమల శాఖ కమిషనర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్ కమిటీలో ఫాప్సియా ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ, ఏపీఐఐసీ జీఎం (లీగల్) ఎంఎస్‌ఎంఈ జేడీ సభ్యులుగా ఉంటారు. బకాయిల కోసం కోర్టులకు వెళ్లి సుదీర్ఘ సమయం వృథా చేసుకునే అవసరం లేకుండా వేగంగా పరిష్కరించే చట్టపరమైన హక్కులు ఈ సంస్థకు ఉన్నాయి.
కౌన్సిల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలపై సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్ రెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉద్యం పోర్టల్‌లో నమోదు చేసుకున్న సంస్థలు మాత్రమే కౌన్సిల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉండటంతో అన్ని సంస్థలు ఆ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చూడాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment