సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేయడంతోపాటు వాటిలో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులను అదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి డీజీపీ, కలెక్టర్లు, వివిధ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.
పోలింగ్ స్టేషన్లలో శాఖల వారీగా చేపట్టాల్సిన పనులను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక శాఖకు చెందిన పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపుల నిర్మాణం తప్పనిసరిగా చేపట్టాలని, విద్యుత్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, ఫర్నిచర్, తాగునీరు, టాయిలెట్లు తప్పనిసరిగా ఉండేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.
బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష
తొలుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డితో సమావేశమైన జవహర్‌రెడ్డి అక్రమ మద్యం రవాణాను అరికట్టడం, పటిష్టమైన బందోబస్తు, చెక్ పోస్టుల ఏర్పాట్లు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, విచారణలో ఉన్న కేసులకు సంబంధించి త్వరలో చార్జిïÙట్లు దాఖలు చేయడంపై సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల వద్ద పటిష్టమై చెక్ పోస్టుల ఏర్పాటుతో పాటు పోలీస్ బలగాలను పెద్దఎత్తున నియమించాలని సూచించారు.
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. అడిషనల్ సీఈవో హరేందిరప్రసాద్, అడిషనల్ డీజీ బాగ్చి, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్, ఎస్‌ఈబీ డైరెక్టర్ రవిప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment