టీటీడీ ఈవో జవహర్ రెడ్డి
తిరుమల: తిరుమలలో ఆఫ్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్ల జారీపై ఈ నెల 15న సంబంధిత అధికారులతో చర్చించనున్నట్లు ఈవో కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. వీలైనంత వరకు ఆన్‌లైన్‌లో సర్వదర్శనం టికెట్లను జారీ చేసేందుకే ప్రయత్నిస్తున్నామన్నారు. అదేరోజున ఆర్జిత సేవలను ప్రారంభించడం, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంపైనా నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చి 1 నుంచి ఆర్జిత సేవలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గతేడాది నవంబర్‌లో సంభవించిన వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న శ్రీవారిమెట్టు మార్గాన్ని ఏప్రిల్ నెలాఖరుకల్లా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
టీటీడీ వెబ్‌సైట్‌లో బోర్డు తీర్మానాలు
టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను టీటీడీ వెబ్‌సైట్‌లో భక్తులకు, ప్రజలకు శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ ధర్మకర్తల మండలి గతేడాది నుంచి మూడు, నాలుగు బోర్డు సమావేశాల్లో చైర్మన్, బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయాలను వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచలేదు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి టీటీడీ బోర్డు తీర్మానాలను వెంటనే వెబ్‌సైట్‌లో ఉంచాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహార్‌రెడ్డికి లాయర్ ద్వారా నోటీసులు పంపారు. దీంతో స్పందించిన టీటీడీ చైర్మన్, ఈవో టీటీడీ అధికారులతో చర్చించి టీటీడీ బోర్డు తీర్మానాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment