
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారం సా.5.10 – 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. వాసుదేవ భట్టాచార్యులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమరుత్తులను (దేవతా పురుషులు), రుషిగణాన్ని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్ ధ్వజస్తంభాన్ని అధిరోహించారు.
పెద్ద శేషుడిపై మలయప్ప
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు శ్రీవారి పెద్ద శేషవాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడు తలల శేషవాహనంపై పరమపదనాథుని అలంకారంలో అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ జవహర్‌రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాన్ని మలయప్పస్వామి అధిరోహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment