
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం దసరా పండుగ ముందు ఒక డీఏను శనివారం విడుదల చేయనుంది. ఈ మేరకు డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిల హర్షం
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి వేర్వేరుగా కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సాయంత్రానికి డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. డీఏ విడుదల చేయాలని నిర్ణయించినందుకు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు, సీఎస్ జవహర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.