DA arrears
-
రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక
రైల్వే ఉద్యోగులు దీపావళి కానుక అందుకోనున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. దీంతో రైల్వే కార్మికుల డియర్నెస్ అలవెన్స్ బేసిక్ జీతంలో 46 శాతానికి పెరగనుంది. గతంలో ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 42 శాతం డీఏ పొందేవారు. డీఏ పెంపుదల 2023, జూలై ఒకటి నుంచి అమలులోకి రానుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను నాలుగు శాతం మేరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ప్రకటించిన ఐదు రోజుల తర్వాత రైల్వే బోర్డు ఈ ప్రకటన చేయడం విశేషం. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనపై రైల్వే ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అన్నారు. దీపావళికి ముందే ఈ చెల్లింపును ప్రకటించడం ఆనందదాయకమన్నారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ ఎం. రాఘవయ్య మాట్లాడుతూ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రైల్వేశాఖ డీఎ చెల్లిస్తుందని, ద్రవ్యోల్బణాన్ని తటస్థీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ప్రభుత్వం జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు నిలిపివేసిన డీఎను చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక విడుదల
సాక్షి, అమరావతి: దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచి్చన ప్రకారం దసరా పండుగ ముందు ఒక డీఏను శనివారం విడుదల చేయనుంది. ఈ మేరకు డీఏ 3.64 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ డీఏను 2022 జూలై ఒకటో తేదీ నుంచి ఇస్తారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డిల హర్షం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని శుక్రవారం ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(ఏపీజీఈఎఫ్) చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి వేర్వేరుగా కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సాయంత్రానికి డీఏ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వారు హర్షం వ్యక్తంచేశారు. డీఏ విడుదల చేయాలని నిర్ణయించినందుకు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు, సీఎస్ జవహర్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఉద్యోగుల ఆశలన్నీ ఆవిరి: కేంద్రం షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. డియర్నెస్ అలవెన్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 18 నెలల డియర్నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి. (లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!) కరోనా సంక్షోభం సమయంలో కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ బకాయిల చెల్లిపులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డియర్నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులకు పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరోనా టైమ్‌లో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డియర్నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలనే ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చాయని అయితే ఈ డియర్నెస్ అలవెన్స్‌ను చెల్లించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో క్లారిటీ ఇచ్చింది. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) డీఏ బకాయిలపై నరేన్ భాయ్ జే రావత్ రాజ్య సభలో అడిగిన ప్రశ్నకు బదులుగా ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.అలాంటి నిబంధనేమీ లేదని, ప్రభుత్వం దాని గురించి ఆలోచించడం లేదని లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా పరిస్థితులు అంతంత మాత్రం గానే ఉన్నాయన్నారు. డియర్నెస్ అలవెన్స్‌ను నిలిపివేత ద్వారా ప్రభుత్వానికి రూ.34,000 కోట్లు ఆదా అవుతుందని సమాచారం. (పేటీఎం భారీ బైబ్యాక్: ఒక్కో షేరు ధర ఎంతంటే!) మరోవైపు డియర్నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగులు,పెన్షనర్ల హక్కు అని ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొంది. కరోనా కాలంలో కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. దీనిపై న్యాయ పోరాటానికి ఉద్యోగుల సంఘాలు సన్నద్ధమ వుతున్నాయి. కాగా 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డియర్నెస్ అలవెన్స్‌ను పెంచాల్సి ఉంటుంది. ఆరు నెలలకు ఒకసారి డీఏ పెరుగుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తరుణంలో కరోనా కాలంలో నిలిపివేసిన డీఏ బకాయిలను కేంద్ర చెల్లిస్తుందని ఉద్యోగులంతా ఎదురు చూశారు. -
ఉద్యోగులకు అండగా ఏపీ ప్రభుత్వం: మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ చెప్పారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి పోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఐఆర్‌గా ఉద్యోగులకు రూ.15,839.99 కోట్లు అందజేశామని చెప్పారు. శుక్రవారం శాసన మండలిలో ‘ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. కోవిడ్ సమయంలో ఉపాధి, ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని కూడా దశలవారీగా ఇస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడమే కాకుండా 1.30 లక్షల మంది గ్రామ/వార్డు కార్యదర్శులను నియమించామన్నారు. మరో 23,000 ప్రభుత్వ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. సీపీఎస్ రద్దుపై కమిటీలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది: విఠాపు బాలసుబ్రమణ్యం అంతకుముందు పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిందని, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుందని అన్నారు. అందువల్లే కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టకున్నామన్నారు. అందుకు తగినట్టుగానే ఈ ప్రభుత్వం మొదట్లో ఐఆర్ బాగా ఇవ్వడంతో సంతోషించామన్నారు. కానీ సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏల పెండింగ్ వంటి ప్రధాన విషయాలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని వివరించారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు కూడా స్పందించడంలేదని, మీరైనా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పి చెప్పి అలసిపోయామని, రాష్ట్రంలో ఉన్న పది లక్షలకుపైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి పోరాటాలు చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపీ కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1.5 శాతం కరువు భత్యం(డీఏ)ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏ జులై 1, 2017 నుంచి వర్తించనుంది. డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. పింఛన్ దారులకు కూడా ఈ డీఏ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరాలు కురిపించిన సంగతి తెలిసిందే. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు సంబంధించి ఒక కరువు భత్యం (డీఏ)ను వెంటనే చెల్లిస్తాం. డీఏకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశానని, మరో డీఏను రెండు నెలల్లో చెల్లిస్తామని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలోనే డీఏను పెంచుతూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. -
జీపీఎఫ్‌లోకి డీఏ బకాయిలు
* డీఏ సొమ్ములు అందేది ఏప్రిల్‌లోనే * రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144 శాతం పెంపు * 8.908 శాతం నుంచి 12.052 శాతానికి పెరుగుదల * పీఆర్సీ తర్వాత తొలి డీఏ ప్రకటన * 15 నెలల బకాయిలు ఏప్రిల్ 1న చెల్లింపు సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) పెంపు జీవో వెలువడింది. డీఏను 3.144 శాతం పెంచుతూ ప్రభుత్వం గురువారం పూర్తిస్థాయి జీవో విడుదలచేసింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక డీఏ జీవో నంబర్ అప్లోడ్ చేయడానికే పరిమితమైన ఆర్థిక శాఖ.. పూర్తి కాపీని గురువారం ఆన్లైన్లో ఉంచింది. 2015 జవవరి నుంచి డీఏ పెంపు అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా పెంపుతో ఉద్యోగుల డీఏ 8.908 శాతం నుంచి 12.052 శాతానికి పెరిగింది. 2015 జనవరి నుంచి 2016 ఫిబ్రవరి వరకు.. 14 నెలల బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు. మార్చి నుంచి నగదు రూపంలో ఉద్యోగులకు చెల్లించనున్నారు. అంటే ఏప్రిల్ 1న అందనున్న జీతంతో పాటు కరువు భత్యం ఉద్యోగులకు నగదు రూపంలో అందనుంది. 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి డీఏ బకాయిల్లో 10 శాతం ‘చందాతో కూడిన పెన్షన్ పథకం’ కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ఖాతాలో జమ చేయనున్నారు. బకాయిల్లో మిగతా 90 శాతాన్ని నగదు రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూన్ 30న లేదా అంత కంటే ముందు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు మొత్తం డీఏ బకాయిలను నగదు రూపంలోనే చెల్లించనున్నారు. 2010 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 77.896 శాతం నుంచి 83.032 శాతానికి పెరగనున్నాయి. 2005 పీఆర్సీ స్కేళ్లలో కొనసాగుతున్న ఉద్యోగులకు 191.226 శాతం నుంచి 201.558 శాతానికి పెరగనున్నాయి. 1999 పీఆర్సీ స్కేళ్ల ప్రకారం జీతాలు తీసుకొంటున్న ఉద్యోగులకు 196.32 శాతం నుంచి 205.318 శాతానికి డీఏ పెరగనుంది. ఐదో జ్యుడీషియల్ వేతన సంఘం సిఫారసుల మేరకు జీతాలు పొందుతున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 212 శాతం నుంచి 223 శాతానికి పెరగనుంది. పద్మనాభన్ కమిటీ నివేదిక ప్రకారం జీతాలు తీసుకుంటున్న జ్యుడీషియల్ అధికారుల డీఏ 107 శాతం నుంచి 113 శాతానికి పెరగనుంది. 2006 యూజీసీ స్కేళ్లలోని ఉద్యోగులకు డీఏ 107 శాతం నుంచి 113 శాతానికి, 1996 యూజీసీ స్కేళ్లు పొందుతున్న ఉద్యోగులకు 212 నుంచి 223 శాతానికి డీఏ పెరగనుంది. గ్రామ సేవకులు, పార్ట్‌టైం అసిస్టెంట్లకు రూ. 100 పెరగనుంది. పెన్షనర్లకు డీఆర్ పెంపు పెన్షనర్లకు 2015 జనవరి నుంచి 3.144 శాతం కరవు భృతి (డీఆర్) పెంచుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డీఆర్ పెంపు జీవో ఒకట్రెండు రోజుల్లో వెలువడనుంది. 2015 జనవరి నుంచి 2016 మార్చి వరకు 15 నెలల బకాయిలను ఏప్రిల్ 1న పెన్షన్‌తో పాటు నగదు చెల్లించనున్నారు. పాత పేస్కేళ్ల ప్రకారం పెన్షన్లు పొందుతున్న వారికి డీఏ తరహాలోనే డీఆర్ పెరగనుంది. రెండో డీఏ ఎప్పుడో.. ఏటా జనవరి, జూలైలో డీఏ పెంచుతారు. 2015 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏ ఇన్నాళ్లకు ఇచ్చారు. జూలై నుంచి ఇవ్వాల్సిన రెండో డీఏ ఎప్పుడిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. రెండో డీఏ కూడా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి నుంచి మూడో డీఏ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చే నెల్లో ప్రకటించే అవకాశం ఉంది. కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
ఖజానా సేవలు బంద్
కొవ్వూరు, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యాలయాల్లో సేవలు 10 రోజులపాటు స్తంభించనున్నాయి. జూన్ 2న రాష్ర్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోనుండటంతో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు చెల్లింపులు, డీఏ బకాయిలు, సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనంతో కూడిన సెల వుల బిల్లుల చెల్లింపులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపులకు ఇచ్చిన గడువు ముగిసింది. బిల్లుల చెల్లింపునకు శనివారం చివరి రోజు కావడంతో జిల్లా ట్రెజరీ కార్యాలయంతోపాటు 14 సబ్ ట్రెజరీలు, బ్యాంకులు సాయంత్రం 6 గంటల వరకు పనిచేశాయి. జిల్లాలో దాదాపు అన్ని బిల్లుల చెల్లింపులను పూర్తి చేసినట్టు జిల్లా ఖజానా అధికారి ఎస్వీకే మోహనరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. జిల్లాలో ట్రెజరీ ద్వారా జీతాలు అందుకునే ఉద్యోగులు 30వేల మంది, పెన్షనర్లు 27 వేల మంది ఉన్నారు. వీరికి నెలకు సుమారు రూ.96.35 కోట్లతో పాటు, ఇతర బిల్లులను చెల్లించాల్సి ఉంది. గత వారం పది రోజులుగా ట్రెజరీ అధికారులు రాత్రింబవళ్లు పనిచేసి ఈ ప్రక్రియను అతికష్టంపై పూర్తి చేయగలిగారు. ఏమైనా ఒకటీఅరా బిల్లులు మిగిలితే కొత్త రాష్ట్రం ఏర్పడి తదుపరి ఆదేశాలు అందిన తరువాతే చెల్లిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి స్పష్టం చేశారు. రాష్ట్రం అధికారికంగా విడిపోయే ‘అపాయింటెడ్ డే’ వరకు పాలన వ్యవహారాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థల రోజువారీ ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో స్తంభించనున్నాయి. తిరిగి కొత్త రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలు వెలువడిన తరువాతే లావాదేవీలు ప్రారంభమవుతాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో హెడ్ ఆఫ్ అకౌంట్లతోపాటు శాఖల వారీగా కేటాయించిన పద్దుల నంబర్లు కూడా మారే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్లు కూడా పూర్తిగా లాక్ చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో మంజూరై ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి బిల్లు చెల్లింపులు కూడా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాతే పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.