ఖజానా సేవలు బంద్
కొవ్వూరు, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యాలయాల్లో సేవలు 10 రోజులపాటు స్తంభించనున్నాయి. జూన్ 2న రాష్ర్టం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోనుండటంతో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్లకు చెల్లింపులు, డీఏ బకాయిలు, సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన వేతనంతో కూడిన సెల వుల బిల్లుల చెల్లింపులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాల మేరకు బిల్లుల చెల్లింపులకు ఇచ్చిన గడువు ముగిసింది. బిల్లుల చెల్లింపునకు శనివారం చివరి రోజు కావడంతో జిల్లా ట్రెజరీ కార్యాలయంతోపాటు 14 సబ్ ట్రెజరీలు, బ్యాంకులు సాయంత్రం 6 గంటల వరకు పనిచేశాయి. జిల్లాలో దాదాపు అన్ని బిల్లుల చెల్లింపులను పూర్తి చేసినట్టు జిల్లా ఖజానా అధికారి ఎస్‌వీకే మోహనరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
జిల్లాలో ట్రెజరీ ద్వారా జీతాలు అందుకునే ఉద్యోగులు 30వేల మంది, పెన్షనర్లు 27 వేల మంది ఉన్నారు. వీరికి నెలకు సుమారు రూ.96.35 కోట్లతో పాటు, ఇతర బిల్లులను చెల్లించాల్సి ఉంది. గత వారం పది రోజులుగా ట్రెజరీ అధికారులు రాత్రింబవళ్లు పనిచేసి ఈ ప్రక్రియను అతికష్టంపై పూర్తి చేయగలిగారు. ఏమైనా ఒకటీఅరా బిల్లులు మిగిలితే కొత్త రాష్ట్రం ఏర్పడి తదుపరి ఆదేశాలు అందిన తరువాతే చెల్లిస్తామని జిల్లా ట్రెజరీ అధికారి స్పష్టం చేశారు. రాష్ట్రం అధికారికంగా విడిపోయే ‘అపాయింటెడ్ డే’ వరకు పాలన వ్యవహారాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థల రోజువారీ ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో స్తంభించనున్నాయి.
తిరిగి కొత్త రాష్ట్రంలో నూతన మార్గదర్శకాలు వెలువడిన తరువాతే లావాదేవీలు ప్రారంభమవుతాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో హెడ్ ఆఫ్ అకౌంట్లతోపాటు శాఖల వారీగా కేటాయించిన పద్దుల నంబర్లు కూడా మారే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్లు కూడా పూర్తిగా లాక్ చేసే అవకాశం ఉందని సమాచారం. గతంలో మంజూరై ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి బిల్లు చెల్లింపులు కూడా రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాతే పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.