
రైల్వే ఉద్యోగులు దీపావళి కానుక అందుకోనున్నారు. ఉద్యోగుల కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. దీంతో రైల్వే కార్మికుల డియర్‌నెస్ అలవెన్స్ బేసిక్ జీతంలో 46 శాతానికి పెరగనుంది. గతంలో ఉద్యోగులు ప్రాథమిక వేతనంలో 42 శాతం డీఏ పొందేవారు. డీఏ పెంపుదల 2023, జూలై ఒకటి నుంచి అమలులోకి రానుంది.
కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల డీఏను నాలుగు శాతం మేరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ప్రకటించిన ఐదు రోజుల తర్వాత రైల్వే బోర్డు ఈ ప్రకటన చేయడం విశేషం. దీపావళికి ముందు చేసిన ఈ ప్రకటనపై రైల్వే ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. డీఏ అనేది ఉద్యోగుల హక్కు అని అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా అన్నారు. దీపావళికి ముందే ఈ చెల్లింపును ప్రకటించడం ఆనందదాయకమన్నారు.
నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ జనరల్ సెక్రటరీ ఎం. రాఘవయ్య మాట్లాడుతూ వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రైల్వేశాఖ డీఎ చెల్లిస్తుందని, ద్రవ్యోల్బణాన్ని తటస్థీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. కాగా కోవిడ్-19 కారణంగా ప్రభుత్వం జనవరి 2020 నుండి జూన్ 2021 వరకు నిలిపివేసిన డీఎను చెల్లించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్‌లో రెండు రైళ్లు ఢీ.. 20 మంది మృతి