సూరత్: ఇటీవలికాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా గుజరాత్‌లో జరిగిన ఇటువంటి దుశ్చర్య వెనుక రైల్వే ఉద్యోగులే ఉన్నారని తెలియడంతో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు, పోలీసులు కంగుతిన్నారు.
గుజరాత్‌లోని సూరత్‌లో కీమ్-కొసాంబ మధ్య రైలును పట్టాలు తప్పించేందుకు ఇటీవల కుట్ర జరిగింది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్ ఈ కేసులో నిందితునిగా గుర్తించింది. సుభాష్ తన ప్రమోషన్ కోసం రైలును పట్టాలను తప్పించాలని ప్లాన్ చేశాడని, ట్రాక్‌లపై ఉన్న ఫిష్ ప్లేట్, కీలను అతనే తొలగించాడని ఎన్‌ఐఏ అధికారులు కనుగొన్నారు. ట్రాక్‌ల నుండి 71 ఫిష్ ప్లేట్లు, కీలను సాధారణ వ్యక్తి సులభంగా తొలగించలేడు.
ఎన్‌ఐఏకు తొలుత ఘటనా స్థలంలో ఎలాంటి పాదముద్రలు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. అయితే రైలు పట్టాలు తప్పించేందుకు కుట్ర జరిగిందని ముందుగా రైల్వే ఉన్నతాధికారులకు చెప్పిన రైల్వే ఉద్యోగి సుభాష్ పొద్దార్‌ను ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. ఈ కేసులో సుభాష్ కుమార్ కృష్ణదేవ్ పోద్దార్, మనీష్ కుమార్ సుర్దేవ్ మిస్త్రీ, శుభం శ్రీజైప్రకాష్ జైస్వాల్ అనే ముగ్గురు రైల్వే ఉద్యోగులను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు బీహార్‌కు చెందిన వారు కాగా, ఒకరు యూపీకి చెందిన ఉద్యోగి. రైల్వేలో పనిచేస్తున్న వీరు పదోన్నతి పొందేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు విచారణలో అంగీకరించారు.
రైలు ప్రమాదాలను నివారించే రైల్వే ఉద్యోగులకు రివార్డులతో పాటు ప్రమోషన్ కూడా వస్తుందని, ఈ ఆశతోనే తాము ఈ చర్యకు పాల్పడినట్లు నిందితులు అధికారులకు తెలిపారు. ఈ రైల్వే ఉద్యోగులే స్వయంగా రైలు పట్టాలకున్న 71 ఫిష్ ప్లేట్లు, కీలను తొలగించి, ఆ పక్కనే ఉంచారు. తరువాత రైల్వే ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు, ఈ విషయాన్ని వారికి తెలిపారు. దీంతో అధికారులు రైల్వే ఉద్యోగి సుభాష్ పోద్దార్‌ను మెచ్చుకున్నారు. అయితే ఎన్‌ఐఏ విచారణలో ఈ ముగ్గురు రైల్వే ఉద్యోగులు తప్పుడు కథనాన్ని అల్లి ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించారని తేలింది. పోలీసులు ఈ ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కోటక్ మహేంద్ర బ్యాంక్ చైర్మన్‌పై ఫోర్జరీ కేసు..
Comments
Please login to add a commentAdd a comment